
- షార్ట్ గట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 40 ఏండ్ల వ్యక్తి
- మరణించిన వ్యక్తి నుంచి పేగు సేకరించి ట్రాన్స్ ప్లాంట్
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లు అరుదైన శస్ట్రచికిత్స నిర్వహించారు. పేగు దెబ్బతిన్న ఓ వ్యక్తికి పేగు మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. ఆసుపత్రిలో ఇలాంటి ట్రాన్స్ ప్లాంట్ చేయడం ఇదే మొదటిసారి అని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ మధుసూదన్ వెల్లడించారు. 40 ఏండ్ల ఓ వ్యక్తి తీవ్రమైన పేగు సమస్యతో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చేరాడు. రిపీటెడ్ సెంట్రల్ లైన్ ఇన్ఫెక్షన్లు, ప్రధాన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, అక్యూట్ సుపీరియర్ మెసెంటరిక్ ఆర్టరీ (ఎస్ఎమ్ఏ) కారణంగా అతని రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడి చిన్నపేగులోని పెద్దభాగాన్ని తొలగించాల్సి వచ్చింది.
చిన్నపేగు 30 సెంటీమీటర్లు మాత్రమే మిగిలింది. దీంతో అతని పేగు ఆక్సిజన్, పోషకాలను తీసుకోకపోవడంతో శరీరం బలహీనంగా మారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది. దీంతో ఆ రోగికి టోటల్ పేరెంటల్ న్యూట్రీషన్ (టీపీఎన్), ఇంట్రావీనస్ ద్వారా ఆహారాన్ని అందించారు. దీంతో ఆ వ్యక్తికి పేగు ట్రాన్స్ ప్లాంట్ చేయాలని డాక్టర్ మధుసూదన్ బృందం నిర్ణయించింది. చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించిన చిన్నపేగును ఈనెల 19న ఆ రోగికి విజయవంతంగా ట్రాన్స్ ప్లాంట్ చేశారు. ట్రాన్స్ ప్లాంటేషన్ తరువాత అతని ఆరోగ్యంలో మార్పులు కనిపించాయని డాక్టర్ మధుసూదన్ చెప్పారు. ప్రస్తుతం అతను ఆహారాన్ని నోటి ద్వారా తీసుకోగలుగుతున్నాడని, అతని పేగు పనితీరు సరిగ్గానే ఉందని వెల్లడించారు.