దేశంలో మహమ్మారి కరోనా మళ్లీ విజృంభిస్తుంది. కొత్త వేరియంట్ JN-1 వేగంగా విస్తరిస్తుండడంతో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ 19 కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ICU అవసరాలతో సహా అవసరమైన అన్ని సౌకర్యాలతో ఐదు ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి బెడ్స్ సిద్ధం చేస్తున్నారు. వెంటిలేటర్, ఆక్సిజన్ సరఫరా, తగినన్ని RTPCR కిట్లు మెడిసిన్ తో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
మాస్క్‌ల వాడకం, చేతుల పరిశుభ్రత చర్యలు, సామాజిక దూరం జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించేలా సిబ్బందిని వైద్యాఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడానికి ఆసుపత్రిలో, నివాసాలలో ముందుజాగ్రత్త చర్యలను పాటించాలని -ఉస్మానియా సూపరిండెంట్ తెలిపారు. వరంగల్ ఎంజీఎంలో గుండె చికిత్స విభాగంలో 50 పడకలతో పూర్తిస్థాయి కరోనా వార్డ్ ఏర్పాటు చేశారు. వార్డులో ఆక్సిజన్ , వెంటిలేటర్, ల్యాబ్ తదితర ముందస్తు జాగ్రత్తలను ఎంజీఎం హాస్పిటల్ సిబ్బంది ఏర్పాటు చేసింది.