ఉస్మానియాను ముంచింది డ్రైనేజీ లోపాలే

ఉస్మానియాను ముంచింది డ్రైనేజీ లోపాలే
  • రోడ్ల కోసం తవ్వారు.. బిల్డింగులు కట్టారు.. డ్రైనేజీని మాత్రం వదిలేశారు
  • ఉస్మానియాలో పైప్ లైన్ పగిలి నీటి లీకేజీ.. మెయింటెనెన్స్ గురించి పట్టించుకోలేదు
  • ఎక్కడికక్కడ పైప్‌లైన్లు జామ్‌.. వానలు పడటంతో వెనక్కి తన్నుకొచ్చిన నీళ్లు
  • హాస్పిటల్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న డ్రైనేజీ పనులు
  • అసలు లైన్‌ గుర్తించేందుకు రెండు రోజులు తంటాలు పడిన అధికారులు

హైదరాబాద్‌, వెలుగు:  చుట్టుపక్కల రోడ్ల కోసం తవ్వారు.. బిల్డింగులు కట్టారు.. కానీ పైప్ లైన్ పగిలిపోయినా పట్టించుకోలేదు.. డ్రైనేజీ డ్యామీజీ అవుతున్నా ఆలోచించలేదు.. రిపేర్లు లేవు.. మెయింటెనెన్స్ అసలే లేదు.. మోస్తరు వాన వచ్చింది. పైప్ లైన్ బ్లాక్ అయింది. నీళ్లన్నీ వెనక్కి వచ్చాయి. వరదలా మారాయి.. ఉస్మానియా ఆస్పత్రికి పోటెత్తాయి.. డ్రైనేజీ పైప్ లైన్ బ్లో అవుట్ వల్లే ఉస్మానియా హాస్పిటల్‌ ఆవరణలోకి నీళ్లు వచ్చినట్లు తెలిసింది. హాస్పిటల్‌ కింది నుంచి మూసీలోకి పోయే పైప్‌లైన్‌ బ్లాక్‌ కావడంతో ఆ నీరంతా పైప్‌లైన్ల నుంచి బయటకు వచ్చింది. హాస్పిటల్‌ ఇంజనీరింగ్‌ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌ అధికారులు రెండు రోజులపాటు వెతికిన తర్వాత వరదకు కారణమైన అసలు పైప్‌లైన్‌ బయట పడింది.

హాస్పిటల్‌ పరిసరాల్లో రోడ్ల తవ్వకాలు

హాస్పిటల్‌ పరిసరాల్లో అనేక నివాస ప్రాంతాలున్నాయి. కొన్నాళ్ల కిందట బర్తన్‌బజార్‌, రామ్‌నాథ్‌ ఆశ్రమం, భూలక్ష్మీ టెంపుల్‌ పరిసరాల్లో డ్రైనేజీ పనులు చేపట్టారు. ఈ క్రమంలో రోడ్లు తవ్వి డ్రైనేజీ పైప్‌లైన్‌లు ఓపెన్‌ చేశారు. కొన్ని చోట్ల రిపేర్లు, మరికొన్ని చోట్ల నిర్మాణాలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా పనులు చేసేటపుడు హాస్పిటల్‌ మీదుగా వెళ్లే కొన్ని డ్రెయిన్ల పనులను అస్తవ్యస్థంగా వదిలేసినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల డ్రెయిన్లు సరిగ్గా మూసి వేయకపోవడం, మరికొన్ని చోట్ల లైన్లు సరిగ్గా క్లియర్‌ చేయకపోవడంతో ప్రస్తుత బ్లో అవుట్‌కు కారణమై ఉంటుందని స్థానికంగా చెబుతున్నారు. ఏడాదిగా తరచూ ఏదో ఒక ప్రాంతంలో డ్రైనేజీ, రోడ్లు పనులు జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రాంతాల నుంచి వెళ్లే డ్రైనేజీ, వరద నీటి పైప్‌లైన్లు ఉస్మానియా హాస్పిటల్‌ కింది నుంచి మూసీలోకి కలుస్తాయి. ఈ పైప్‌లైన్లలో కొన్ని వందేళ్ల కిందట నిర్మించినవి కూడా ఉన్నాయి.

3.1 సెంటీమీటర్ల వానకే

1908లో హైదరాబాద్‌లో భారీ వానలు కురిశాయి. ఒకసారి 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  హాస్పిటల్‌ లోకి వరద నీరు పోటెత్తింది. అప్పట్లో ఇపుడున్న బిల్డింగ్​ లేదు. 1866లో నిజాం నిర్మించిన చిన్న క్లినిక్‌ ఉండేది. దాన్ని అఫ్జల్‌గంజ్‌ హాస్పిటల్‌ అని పిలిచేవారు. నాటి వరదలకు హాస్పిటల్‌ ప్రాంగణంలో ఉన్న చింతచెట్టును పట్టుకొని 150 మంది ప్రాణాలు కాపాడుకున్నారని చెబుతారు. 1908 నాటి వరదల తర్వాత మూసీ ఎగువన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ ఆనకట్టలు నిర్మించారు. తర్వాత సిటీకి వరద ముప్పు తప్పింది. 2000 ఆగస్టు 24న ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయిలో 24.15 సెంటీమీటర్ల వాన పడినా హాస్పిటల్‌లోకి నీరు రాలేదు. ఇపుడు 3.1 సెంటీమీటర్ల వానకే ఉస్మానియా వార్డులు జలమయమయ్యాయి.

ఏమైందో తెలుసుకునేందుకు రెండు రోజులు

ఉస్మానియా వెనక ప్రాంతమైన బేగంబజార్‌ నుంచి ఓ ప్రధాన పైప్‌లైన్‌ హాస్పిటల్‌ కింది నుంచి వెళ్తుంది. వివిధ పనుల వల్ల హాస్పిటల్‌ ఆవరణలో ఈ లైన్‌  జామ్‌ అయ్యిందని, దాంతో నీరు వెనక్కు తన్నుకు వచ్చిందని, దీంతో హాస్పిటల్‌ డ్రైనేజీ పైప్‌లైన్‌ల నుంచి మురుగు నీరు బయటకు వచ్చిందని ఇంజనీరింగ్‌ విభాగం అంచనా వేస్తోంది. హాస్పిటల్‌ నుంచి వెళ్లే డ్రైనేజీ లైన్‌ ఏ ప్రధాన పైప్‌లైన్‌ వ్యవస్థతో అనుసంధానమై ఉందో తెలిలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. 2 రోజుల తర్వాత పైప్ లైన్ ను గుర్తించినట్లు తెలుస్తోంది. ‘వందేళ్ల క్రితం నాటి డ్రైనేజీ కావడంతో ఎటు నుంచి ఎటు పోతుందో తెలియక ఇబ్బంది పడ్డాం’ అని హాస్పిటల్‌ ఇన్​చార్జ్  సూపరింటెండెంట్‌ పాండురంగ నాయక్‌ కూడా అంగీకరించారు. దీనికి తోడు ఈ మధ్య దోభీ ఘాట్‌ దిశగా హాస్పిటల్‌ ఆవరణలో కొత్త బిల్డింగ్​ కట్టారు. ఇన్‌పేషంట్‌ వార్డు వైపు కొన్ని పనులు చేశారు. రోడ్లు వేశారు. దీని వల్ల కూడా డ్రైనేజీ దెబ్బ తిన్నదని హాస్పిటల్‌ స్టాఫ్‌ చెబుతున్నారు.

రిపేర్లు లేక మరో సమస్య

2015 జులై 23న ఉస్మానియా హాస్పిటల్‌ను సీఎం కేసీఆర్‌ సందర్శించారు. పురాతన భవనం కూల్చి కొత్తది కడతామన్నారు. తర్వాతి పరిణామాలతో కూల్చివేత నిర్ణయాన్ని సర్కారు వాయిదా వేసుకుంది. హాస్పిటల్‌ ఆవరణలోనే రెండు టవర్లు నిర్మిస్తామంది. కానీ అది ముందుకు కదల్లేదు. హాస్పిటల్‌ మెయింటెనెన్స్‌ కూడా ఆగిపోయింది. మరోవైపు ఉస్మానియాను సర్కారు కూల్చాలని చూస్తోందని తెలియగానే ఇంటాక్‌ (హెరిటేజ్‌ పరిరక్షణ కోసం పని చేసే సంస్థ) రంగంలోకి దిగింది. హాస్పిటల్‌ శిథిలావస్థకు చేరిందా లేదా పరిశీలించేందుకు ఎక్స్ పర్టుల కమిటీని నియమించింది. 2015 ఆగస్టు 2, 3 తేదీల్లో కమిటీ హాస్పిటల్‌ను సందర్శించి రిపోర్టు రెడీ చేసింది. బిల్డింగ్​ శిథిలావస్థలో లేదని, గట్టిగా ఉందని రిపోర్టులో స్పష్టంగా చెప్పింది. మెయింటెనెన్స్‌ లేక పెచ్చులు మాత్రం ఊడుతున్నాయని, గోడలు గట్టిగా ఉన్నాయని తేల్చింది. హాస్పిటల్‌ పైనుంచి వచ్చే వాన నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్లు పగిలిపోయి ఉన్నాయని, దాంతో నీరు గోడల్లోకి వెళ్లిపోతోందని చెప్పింది. ఈ చెమ్మతోనే మొక్కలు మొలుస్తున్నాయని, వార్డుల్లోకి నీళ్లు లీక్ అవుతున్నాయని తెలిపింది. మెయింటెనెన్స్ సరిగ్గా చేస్తే బిల్డింగ్ చాలా కాలం పనికొస్తుందని స్పష్టం చేసింది. ఈ రిపోర్టును కేంద్ర టూరిజం శాఖ అభినందించడం గమనార్హం.

మెయింటెనెన్స్‌ సరిగా లేదు

‘‘మేం 2015లో, 2019లో రెండు సార్లు సర్వే చేశాం.  రిపోర్ట్‌ రెడీ చేశాం. దాని ప్రకారం ఉస్మానియా బిల్డింగ్‌ గట్టిగా ఉంది. గోడలకు ఏం కాలేదు. మెయింటెనెన్స్‌ మాత్రం సరిగా లేదు. వర్షం నీరు పోయేందుకు పైప్‌ లైన్లు లేవు. పగిలి వాటికి రిపేర్లు లేవు. సరిగ్గా మెయింటెన్‌ చేస్తే బిల్డింగ్​ను చాలా రోజులు వాడుకోవచ్చు. ఈ సమస్యకు డ్రైనేజీ కారణమని తెలిసింది. ఇష్టమొచ్చినట్లు నిర్మాణాలు చేస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్ట్‌ లను కన్సల్ట్‌ చేసి పనులు చేయాలి. అపుడే హెరిటేజ్‌ బిల్డింగ్‌లను రక్షించుకోగలం’’

= అనురాధా రెడ్డి, కన్వీనర్‌, ఇంటాక్‌

మళ్లీ జరగకుండా చూస్తాం

‘‘డ్రైనేజీ జామ్ కావడం వల్లే ఆస్పత్రిలోకి వరద పోటెత్తింది. వందేళ్ల కిందట నిర్మించిన డ్రైనేజీ కావడంతో అది ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందో సరిగ్గా తెలియడం లేదు. దానికి రిపేర్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్, ఉస్మానియా ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రిపేర్లు చేసి మరోసారి నీళ్లు రాకుండా చేస్తాం. హాస్పిటల్ పాత భవనం కావడంతో కొంచెం నీరు వస్తున్నది. ఈ సమస్య కూడా లేకుండా చేస్తాం. కొత్త భవనం నిర్మించే విషయం ప్రభుత్వ పరిధిలోనిది’’

– పాండురంగ నాయక్, ఇన్​చార్జ్ సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి

ఇదే తొలిసారి

‘‘ఎప్పుడో వందేళ్ల క్రితం వాన పడినపుడు ఉస్మానియా హాస్పిటల్‌ ఆవరణలోకి నీళ్లొచ్చాయి. తర్వాత ఎప్పుడూ రాలేదు. కొన్ని వార్డుల్లో లీకయ్యేదంతే. తొలిసారి బెడ్లు మునిగేలా నీళ్లు రావడం చూస్తున్నా. హాస్పిటల్‌ కింది నుంచి పోయే పైప్‌లైన్ల గురించి అక్కడి ఇంజనీర్లకు కూడా సరైన అవగాహన లేదు’’

రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా హాస్పిటల్‌

కరోనాను గాలికొదిలేసి కలెక్టర్లకు వేరే టార్గెట్లు