వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవం నేడు మంగళవారం ఠాగూర్ అడిటోరియం వేదికగా జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ చాన్సలర్, గవర్నర్ తమిళిసై అటెండ్ కానున్నారు. మొత్తం 1,325 మంది విద్యార్థులకు పీహెచ్డీ డాక్టరేట్లు, గోల్డ్ మెడల్స్, డిగ్రీ సాధించినవారికి అవార్డులను ప్రదానం చేయబోతున్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ దాదాపుగా 5,000 పట్టాలను యూనివర్సిటీ విద్యార్థులకు అందించినది. ఎంతోమంది డిగ్రీ పట్టాలు సాధించినప్పటికీ చదువుకు, స్థాయికి సంబంధం లేనటువంటి నిరుద్యోగులుగా మిగిలిపోయారు. డిగ్రీ పట్టాలను తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తును ఒకసారి పరిశీలిస్తే అంతా అగమ్యగోచరంగా మారింది. సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థి పీహెచ్డీ పూర్తి చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని దాదాపు పది లక్షల వరకు ఖర్చు చేసి పూర్తి చేస్తున్నారు.
సోషల్ సైన్స్ విద్యార్థి ఐదు లక్షల రూపాయలు ఖర్చుచేసి తన పీహెచ్డీ పూర్తి చేస్తున్నారు. ఇంత ఖర్చు చేసినా భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించవచ్చని ఆశలు ఉన్నప్పటికీ యూనివర్సిటీ అధికారుల అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పట్టాలు తీసుకుంటున్నారే తప్పితే వారికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. అన్ని యూనివర్సిటీలు స్నాతకోత్సవాలు నిర్వహించి విద్యార్థులకు పట్టాలను అందిస్తున్నాయి. కానీ, విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి దారి చూపడం లేదు. ఈ స్నాతకోత్సవాల వేదికగా యూనివర్సిటీ అధికారులు తమకు నచ్చిన వ్యక్తులకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారు తప్పితే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడంలేదు.
గొప్పలు తప్ప నియామకాలు లేవు
యూనివర్సిటీ అధికారులు వరుసగా స్నాతకోత్సవాలు నిర్వహిస్తున్నామని గొప్పలు చెపుతున్నారు. అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయడంలో మాత్రం వారు వెనుకడుగు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా నగరాల్లోని యూనివర్సిటీలకు ఉన్నత చదువులు చదవడానికి వస్తున్నారు. కానీ, వారికి నాణ్యమైన విద్య అందడం లేదు. ప్రతి డిపార్ట్మెంట్లో తాత్కాలిక ప్రాతిపదికన అధ్యాపకులను నియమించి వారికి చాలీచాలని జీతాలు ఇస్తూ యూనివర్సిటీని నడిపే పరిస్థితి నెలకొంది. ఒక పార్ట్ టైం అధ్యాపక పోస్టుకు పదుల సంఖ్యలో డాక్టరేట్ విద్యార్థులు పోటీ పడుతున్నారు. దీన్నిబట్టి యూనివర్సిటీలో డాక్టరేట్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు కాదు కదా ఒక అటెండర్ పోస్టు కూడా తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది. రాష్ట్ర అభివృద్ధిపై మన రాజకీయ నాయకుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. మానవ అభివృద్ధిలో యూనివర్సిటీల పాత్ర ఎంతో ఉంటుందని మన నాయకులు గుర్తించవలసిన అవసరం ఉంది.
మారిన వైస్ చాన్సలర్ల వైఖరి
యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తితో నడిచే అధికారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వమే యూనివర్సిటీలను నడిపిస్తున్నా...వాస్తవానికి యూనివర్సిటీలకు అవసరమైనటువంటి నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి అంశాలపై మాత్రం యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తితో నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. కానీ, గత కొన్ని రోజులుగా యూనివర్సిటీలను నడపాల్సినటువంటి వైస్ చాన్సలర్ల వైఖరి పూర్తిగా మారిపోయింది.
గతంలో పని చేసిన వైస్ చాన్సలర్లు యూనివర్సిటీకి ఏం కావాలో వారే నిర్ణయించి దానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించేవారు. ప్రస్తుతం ఉన్న వైస్ చాన్సలర్లు తమ పదవీ కాలాన్ని పెంచుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారు తప్పితే యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఏమాత్రం కృషి చేయడం లేదు. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని విద్యార్థులు ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టించేందుకు కూడా ప్రస్తుతం ఉన్న వైస్ చాన్సలర్లు వెనకాడడం లేదు. ఈ వైఖరి యూనివర్సిటీకి ఏమాత్రం మంచిది కాదు.
గవర్నర్ చొరవ తీసుకోవాలె
యూనివర్సిటీలను కాపాడాల్సిన బాధ్యత మొదటగా వైస్ చాన్సలర్‌కు ఉంటుంది. కాబట్టి యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు పట్టాలు అందించడమే కాదు వారి చదువుకు తగ్గట్టు పోస్టులను నియామకం చేయాల్సిన నైతిక బాధ్యత కూడా వైస్ చాన్సలర్లపైన ఉంటుంది. యూనివర్సిటీలకు చాన్సలర్‌గా ఉన్న గవర్నర్ ప్రతిసారి విద్యార్థులకు కేవలం డిగ్రీ పట్టాలు ఇవ్వడమే కాకుండా నియామకాలకు సంబంధించి బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
లేదంటే ఉపాధి లేని డిగ్రీ పట్టాలు ఎన్ని తీసుకున్న విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు ముందుగా యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడానికి ప్రయత్నించాలి.
ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం
పీ హెచ్డీ చేసే ప్రతి విద్యార్థికి కూడా యూనివర్సిటీలో అధ్యాపకునిగా ఎంపిక కావాలని ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తితో ఎంతో కష్టపడి పీహెచ్డీ పూర్తి చేస్తారు. కానీ, విద్యార్థుల ఆసక్తి తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు కలిపి దాదాపుగా 3,000 అధ్యాపక పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులన్నీ మాకే వస్తాయని ఆకాంక్షతో నాటి విద్యార్థులు ఉద్యమం చేశారు.
అయితే స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో 1,200 మంది అధ్యాపకులు పని చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం 360 మంది మాత్రమే పనిచేయడం జరుగుతున్నది.
– డా. చింత ఎల్లస్వామి, ఉస్మానియా యూనివర్సిటీ