- తొలి దశ నుంచి మలి దశ వరకు అలుపెరుగని పోరు
- ఎందరో విద్యార్థుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన స్వరాష్ట్రం
సికింద్రాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు పుట్టినిల్లు. రాష్ట్రంలో జరిగిన ఉద్యమం ఏదైనా పునాది ఇక్కడి నుంచే పడింది. దేశ చరిత్రలో నిలిచిపోయే తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీనే ముందుండి నడిపించింది. స్వరాష్ట్ర సాధనలో ఉస్మానియా విద్యార్థుల పాత్ర ఎన్నటికీ మర్చిపోలేనిది. 1969 తొలిదశ ఉద్యమం మొదలు.. 2001లో మొదలైన మలిదశ ఉద్యమం నుంచి 2014లో రాష్ట్రం సిద్ధించే వరకూ జరిగిన పోరాటంలో ఉస్మానియా విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ఈ పోరుబాటలో ఎందరో విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. ఆ అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ ఉద్యమాన్ని, ఓయూ విద్యార్థులను వేరుచేసి చూడలేం. 1969 నుంచి తెలంగాణ ఉద్యమ భావనను సజీవంగా ఉంచింది విద్యార్థుల పోరాటాలే. ఒక్క తెలంగాణ ఉద్యమమే కాదు.. ఎన్నో చారిత్రక పోరాటాలకూ ఉస్మానియా కేంద్రంగా పని చేసింది.
1969లో తొలిదశ..
తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1969 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నో చారిత్రక పోరాటాలకు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రమైంది. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని మొదట గొంతెత్తింది ఉస్మానియా విద్యార్థులే. సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉస్మానియా విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ 1969 జనవరి 9న పాల్వంచలో అన్నాబత్తుల రవీంద్రనాథ్ చేపట్టిన ఉద్యమానికి స్టూడెంట్లు అండగా నిలిచారు. విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు, నిరసనలకు దిగారు. కాళోజీ ఆశీస్సులతో 1969 జనవరిలో ఉస్మానియా విద్యార్థులు తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. పల్లెపల్లెకు తెలంగాణ భావజాలాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థుల పోరాటానికి ఉద్యోగులు సైతం మద్దతు తెలపడంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. విద్యార్థుల ఉద్యమాన్ని ఎలాగైనా అణచివేయాలని అనుకున్న ఆనాటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం.. విద్యార్థులపై కాల్పులు జరిపింది. దీంతో 369 మంది విద్యార్థులు అమరులయ్యారు.
2001 నుంచి మలిదశ..
1969లో తొలిదశ ఉద్యమాన్ని ఆనాటి సర్కార్ అణచివేసినప్పటికీ, ఉస్మానియా విద్యార్థులు పోరుబాటను వీడలేదు. స్వరాష్ట్రం కోసం పోరాడుతూనే వచ్చారు. ఈ క్రమంలో 2001లో కేసీఆర్ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మొదలుపెట్టాక ఉస్మానియా విద్యార్థులు ముందుండి కొట్లాడారు. 2001 ఏప్రిల్ 7న హైదరాబాద్ లోని జలదృశ్యం కేంద్రంగా తెలంగాణవాదుల సమక్షంలో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) ను కేసీఆర్ ఏర్పాటు చేశారు. నాడు కేసీఆర్ కు ఉస్మానియా విద్యార్థులు మద్దతుగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. 2009 నవంబర్ 9న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు విద్యార్థి లోకమంతా అండగా నిలిచింది. ఈ క్రమంలో ఉద్యమం కోసం విద్యార్థులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
నవంబర్ 18న అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కలిసి స్టూడెంట్ జేఏసీని ఏర్పాటు చేశారు. అదే నెల 21న ఆర్ట్స్ కాలేజీ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ చేపట్టారు. నిరాహార దీక్ష విరమించాలని కేసీఆర్ ను ఆనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రికి తరలించగా ఆయన అక్కడే దీక్ష కొనసాగించారు. కేసీఆర్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నదని డాక్టర్లు ప్రకటించారు. దీంతో ఉవ్వెత్తున ఎగిసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రోడ్ల పైకి వచ్చి గర్జించారు. ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలతో హైదరాబాద్ నగరాన్ని అగ్నిగుండంలా మార్చారు. చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చి సబ్బండ వర్గాలను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. దీంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని 2009 డిసెంబర్ 9న ప్రకటించింది.
విద్యార్థుల త్యాగ ఫలితమే తెలంగాణ..
తెలంగాణ ఏర్పాటు చేస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆంధ్రా నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమానికి తెరలేపారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిప్పుకణికలై మండారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. 2010 జనవరి 3న లక్షలాది మందితో విద్యార్థి మహా గర్జన నిర్వ హించారు. జేఏసీతో కలిసి సాగరహారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె లాంటి ఎన్నో పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ గోసను అర్థం చేసుకున్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని 2013 జులై 30న ప్రకటించింది. 2014 ఫిబ్రవరి 21న రాజ్యసభ తెలంగాణ బిల్లును ఆమోదించింది. 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ కోసం మొదటి నుంచి బరిగీసి కొట్లాడిన ఉస్మానియా.. చివరకు అనుకున్నది సాధించింది. ఎంతోమంది విద్యార్థి అమరుల త్యాగాలతో స్వరాష్ట్రం సిద్ధించింది.
ఇయ్యాల ఓయూలో సంబురాలు..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించనున్నట్టు ఓయూ రీసెర్చ్ స్కాలర్ కంచర్ల బద్రి తెలిపారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులను సన్మానిస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగే ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని కోరారు.
ఇన్నాళ్లు ఉద్యమకారులకు గుర్తింపు లేదు..
తెలంగాణలో జరిగిన విద్యార్థి పోరాటాలకు ఎంతో చరిత్ర ఉంది. ప్రజల కోసం జరిగిన ప్రతి పోరాటంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. విద్యార్థుల త్యాగాలకు గుర్తింపు, గౌరవం దక్కలేదు. తమ చదువులను, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరం కోసం పోరాడిన విద్యార్థులకు మిగిలింది శూన్యం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
-
దుర్గం భాస్కర్, -ఓయూ జేఏసీ
ఇప్పుడు ఉద్యమకారులకు గౌరవం దక్కింది..
ఇన్నాళ్లు తెలంగాణ వచ్చిన సంతోషమే లేకుండే. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు రావాలని ఉద్యమంలో పాల్గొన్న మాలాంటి వాళ్లకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో నిజమైన ఉద్యమకారులకు గౌరవం దక్కినట్టుగా భావిస్తున్న. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలం గాణ’ను రాష్ట్ర గీతంగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.
‑ డాక్టర్ దరువు ఎల్లన్న, ఉద్యమకారుడు, ఓయూ