వందేమాతర ఉద్యమం నుంచి తెలంగాణ పోరాటం వరకు ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూది, మరెన్నో పరిశోధనలకు వేదికగా నిలిచింది ఉస్మానియా యూనివర్సిటీ. శాస్త్ర సాంకేతిక రంగాలు మొదలుకొని, వాణిజ్యం, వ్యవసాయం, రాజ్యాంగం నుంచి రాజకీయం వరకు ఎన్నో విభాగాల్లో మరెన్నో గ్రంథావిష్కరణలకు కేంద్ర బిందువై నూట నాలుగేండ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలబడింది ఓయూ. ప్రతిష్టాత్మకమైన ఈ యూనివర్సిటీ దేశానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఎందరో శాస్త్రవేత్తలను, మేధావులను అందించింది. ఇది ఒక విజ్ఞాన పరిశ్రమ. విద్య వికాసానికి, ఆ వికాసంతో పరిశోధన, తద్వారా పరివర్తన మొత్తంగా ఉస్మానియా అంటేనే ఒక చైతన్యం. ఇక్కడ చదువుకొని దేశ విదేశాల్లో వివిధ స్థాయిల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా నేడు ఒకే వేదికపైకి రాబోతున్నారు. జనవరి 3న ‘ఓయూ గ్లోబల్ఆలుమ్ని మీట్’తో దాదాపు 2000 మంది పూర్వ విద్యార్థులు సమావేశం కాబోతున్నారు. ఉస్మానియా చరిత్రలో ఇలాంటి వేదిక ఒకటి ప్రారంభం కానుండటం శుభపరిణామం.
ప్రాభవాన్ని కాపాడుకుందాం..
వందేండ్ల జ్ఞాపకాల దొంతర సామాన్య విద్యార్థులను మహనీయులుగా తీర్చిదిద్దిన ఉస్మానియా విశ్వ విద్యాలయం ప్రతిష్ట గతమెంతో ఘనమైనా.. ప్రస్తుత పరిస్థితి బాగా లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఓయూ క్రమంగా ప్రాభవం కోల్పోతున్నది. ఒకప్పుడు ప్రపంచ స్థాయి వర్సిటీలతో పోటీ పడిన ఈ విద్యాలయం.. ప్రభుత్వ ఉద్దేశపూర్వక కుట్రతో ఇప్పుడు కనీసం దేశంలోని యూనివర్సిటీలతో పోటీ పడలేక చతికిలబడుతున్నది. దీనికి పునర్వైభవం, పూర్వ ప్రాభవం తీసుకువచ్చే బాధ్యత ‘గ్లోబల్ఆలుమ్నీ’ తీసుకోవాలి. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటేందుకు ఓయూ ఒక యుద్ధభూమిగా, చైతన్య వేదికగా నిలిచింది. స్వరాష్ట్రం వస్తే.. యూనివర్సిటీకి నిధులు పెరిగి, పరిశోధనలకు, నాణ్యమైన చదువులకు కేరాఫ్అడ్రస్గా మారుతుందని అంతా భావించాం. ఈ వర్సిటీ ద్వారా తెలంగాణ మానవ వనరుల అభివృద్ధి జరిగి దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆశించాం. కానీ అలా జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కంటే దయనీయమైన, అధ్వాన స్థితి ఇప్పుడు వర్సిటీ ఎదుర్కొంటున్నది. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తామన్నహామీతో స్వరాష్ట్రంలో ప్రథమంగా అధికారం చేపట్టిన కేసీఆర్విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వకపోగా, యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారు. ఎనిమిదేండ్ల స్వరాష్ట్ర పాలనలో సగ భాగం మాత్రమే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను నియమించి, మిగతా పాలనంతా ఇన్చార్జ్ వీసీలతో నడిపిస్తున్నారు. ఉన్నత విద్యను నిర్వీర్యం చేసి, యూనివర్సిటీలను ఖాయిలా పడ్డ పరిశ్రమలుగా మార్చేశారు.
నిధులు, నియామకాలు లేక..
తెలంగాణ ఏర్పాటు తర్వాత యూనివర్సిటీలను ప్రపంచ స్థాయి వర్సిటీలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన కేసీఆర్ అధికారం చేపట్టిన వెంటనే ఆ హామీని విస్మరించారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నిధుల కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఉస్మానియా యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయలేదు. యూనివర్సిటీలో 850కి పైగా బోధన, వేల సంఖ్యలో బోధనేతర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందడం లేదు. పరిశోధనలకూ పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఇదంతా ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంగానే పరిగణించాలి. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1061 బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రకటించి 5 సంవత్సరాలైనా నేటికీ అతీగతీ లేదు. స్వతంత్రంగా అకడమిక్, పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించి ప్రపంచస్థాయి సదుపాయాలు, మెరుగైన బోధన, పరిశోధనలకు సానుకూల పరిస్థితులు, వైవిధ్యమైన కోర్సులను ఎంచుకునే అవకాశం కల్పించడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను తీర్చిదిద్దడం, ప్రతిభ, సృజనాత్మకత కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం వంటి నూతన ఆలోచనలకు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కావాలి. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసేలా ‘గ్లోబల్ఆలుమ్నీ’ చర్యలకు పూనుకోవాలి. గురుతర బాధ్యత ప్రభుత్వం, అధికారులు, పూర్వ విద్యార్థుల భుజస్కందాలపై ఉంది.
- ప్రవీణ్ రెడ్డి,ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ