అమరుల త్యాగాలకు గుర్తింపేది? : రమేశ్ యాదవ్

2009 నవంబర్ 29 ఒక్కటే యావత్తు తెలంగాణ చరిత్రలో భాగం అన్నట్లు చూడటం ముమ్మాటికి అది వక్రీకరణే అయితది. తెలంగాణలో ఉద్యమాలు నియంతృత్వ నిజాం రాచరిక కాలంలోనే పురుడుపోసుకున్నాయి. మొట్టమొదటిగా భూమి కోసం, భుక్తి కోసం, దేశ్ ముఖ్ లు, దేశ్ పాండేలు, పటేల్, పట్వారీ, జమీందారీ వ్యవస్థల నియంతృత్వ దాస్యశృంఖలాల నుంచి విముక్తి కోసం స్వచ్ఛందంగా సాధారణ గ్రామీణ రైతులతో మొదలైందే  తెలంగాణ భూస్వామ్య వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటం. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మల చైతన్యంతో ఈ పోరు ఎక్కడి వరకు వెళ్లిందీ చరిత్ర చూసింది. 1952 వరంగల్ లో పార్థసారథి అనే ఆంధ్ర విద్యాధికారి ఉపాధ్యాయ బదీలీల్లో నాన్ ముల్కీలకు అధిక ప్రాధాన్యతనివ్వడంను గ్రహించిన తెలంగాణ బిడ్డలు తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే స్థానికేతర ఆంధ్రులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ‘ఇడ్లీ సాంబార్ గో-బ్యాక్, గోంగూర పచ్చడి గో-బ్యాక్’ అంటూ నినదించారు. అప్పటి ఆంధ్ర విద్యాధికారి పార్థసారథి నుంచి మొదలుకొని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కూమార్ రెడ్డి వరకు, నాన్-ముల్కి గో-బ్యాక్ నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు ఆంధ్రుల పెత్తానాన్ని అన్ని దశల్లో తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తూనే ఉన్నది.

60 ఏండ్ల పోరాటం

తెలంగాణ ఉద్యమం అనంగనే వ్యక్తుల కన్నా ముందు గుర్తొచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ.  స్వరాష్ట్ర ఉద్యమంలో ఓయూ ఒక యుద్ధభూమిలా మారింది. నినాదాలు, నిరసనలు, ఉద్రిక్తతలు, లాఠీలు, తూటాల నుంచి  నిలువెత్తు నిప్పు కణికై కూడా ‘జై తెలంగాణ’ నినాదం వదలని అమరుడు శ్రీకాంతచారి ఆత్మార్పణం వరకు తెలంగాణ చరిత్ర దాగి ఉన్నది. ఓయూ స్టూడెంట్​ఇషాన్ రెడ్డి తెలంగాణ వస్తే తనును తాను మైసమ్మకు నైవేద్యంగా సమర్పించుకుంటానని మాట మరవని వంటి అనేక తెలంగాణ బిడ్డల త్యాగం ఈ నేలలో నిక్షిప్తమైంది.1969 తొలి దశ తెలంగాణోద్యమంలో 360 మంది, మలిదశ ఉద్యమంలో 1200 మంది అమరుల త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ నిర్మితమై ఉన్నది. ఇవన్నిటిని పక్కన పెడుతూ తెలంగాణ ఉద్యమం అంటే ఒకరిద్దరు నడిపారని, ఒకరే తెలంగాణ తెచ్చారని చెప్పడం సత్యదూరం. సమస్త ప్రజానీకం ఏకమై నడిచి, నిలిచి గెలిచిన ఉద్యమం ఇది. తెలంగాణోద్యమం ఆరు దశాబ్దాల పోరాటం, 60 ఏండ్ల కొట్లాట, ఈ పోరాటంలో ఓనాడు ఎక్కువ, ఓనాడు తక్కువ స్థాయిలో కనపడొచ్చేమో గానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాగడా ఏనాడూ ఆరిపోలేదు, ఆగిపోలేదు.

ఎందరో త్యాగాలు చేస్తే..

తెలంగాణ ఉద్యమం ఏ ఒక్క రాజకీయ పార్టీనో, ప్రజా సంఘమో, ఉద్యోగ సంఘమో నడిపితే నడిచింది ముమ్మాటికి కాదు. 1956 మొదలుకొని రాష్ట్ర ఆవిర్భావం వరకు కాళోజీ, జయశంకర్ సార్, ప్రొ. కేశవ్ రావు జాదవ్, ముచ్చర్ల సత్యనారాయణ వంటి ఎంతో మంది మేధావులు మొదలు1969 జనవరి 8న ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్షకు కూచున్న అన్న బత్తుల రవీందర్ లాంటి ఎందరో దీక్షాపరులతో పాటు, తెలంగాణ ఏర్పాటే ఎకైక లక్ష్యంగా మొట్టమొదటగా1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలోనే తన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు, 97 ఏండ్ల వయసులో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 7 రోజులు ఎముకలు కొరికే చలిలోసైతం దీక్షను కొనసాగించి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను తెలియజెప్పిన కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి అసలు సిసలైన తెలంగాణ నాయకులెందరో త్యాగం చేస్తే నిలబడ్డదీ ఉద్యమం. కానీ నేడు మనకు కనిపిస్తున్న వాళ్లే 60 ఏండ్ల ఉద్యమం నడిపారు అన్నట్లు మాట్లాడితే.. అది ముమ్మాటికి వక్రీకరణే. 

ఉద్యమ ఆకాంక్షలు మరిచి..

భువనగిరికి చెందిన తెలంగాణ గాన కోకిలగా పేరుగాంచి రాష్ట్రం కోసమే ముక్కలుగా మారిన బెల్లి లలిత అమరత్వం, ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద అగ్గి పిడుగై తెలంగాణ కోసం బూడిదైన సిరిపురం యాదయ్య త్యాగం, తెలంగాణ ఆవశ్యకతను యావత్తు దేశానికి ఎరుకజెయ్యాలని ఢిల్లీ పార్లమెంటు సాక్షిగా పీనుగై నిలవడ్డ యాదిరెడ్డి వీరత్వాన్ని గుర్తించాల్సిన అవసరం మనకు ఉన్నది. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు వంటి వర్సిటీలు ఉద్యమాన్ని భుజాలపై మోశాయి. విద్యార్థులు ఆంధ్రా పోలీసుల లాఠీలకు, తూటాలకు, రబ్బర్ బుల్లెట్లకు ఎదురొడ్డి రక్తం చిందించారు. తెలంగాణ అమరుల త్యాగాలకు, ఉద్యమకారులకు స్వరాష్ట్ర పాలనలో పెద్దగా గౌరవం, గుర్తింపు దక్కలేదు. కానీ మలిదశ ఉద్యమంలో అడుగడుగునా అడ్డుపడ్డ ఉద్యమ ద్రోహులే ఇయ్యాల ప్రభుత్వంలో పెద్దలుగా చలామణి అవుతున్నారు. ఉద్యమ ఆకాంక్షలను మరిచిన ప్రభుత్వం ఫక్తు రాజకీయాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అమరుల త్యాగాలకు గుర్తింపునివ్వడమే శ్రీకాంతచారికి మనం ఇచ్చే నివాళి!

తొలి దశ ఉద్యమం

1956 ఆంధ్రాతో పొత్తు ప్రస్తావన మొదలుకొని మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కాలంలోనే వరంగల్ కు చెందిన మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ (సంగంరెడ్డి సత్యనారాయణ) యాదవ్ రాసిన ‘సంజీవ రెడ్డి మామా, సంజీవ రెడ్డి మామా..!! అయ్యయ్యో రామా రామా, సంజీవ రెడ్డి మామా...!! సూలోజి మేర గాన కైసరే తెలంగాణ..??’ అనే పాటతోనే తెలంగాణ ఉద్యమ గీతం మొదలైందని, దీన్ని బట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్షను, అనాటి తెలంగాణ వాదుల పోరాట తీవ్రతను గ్రహించవచ్చు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్ష1956 నవంబర్1 నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు నిరంతరాయంగా ఆరు దశాబ్దాలు నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో కొనసాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ 60 ఏండ్లలో తెలంగాణ వాదులు, విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, కళాకారులు, అన్ని కుల సంఘాలు, మత సంఘాలు, సకల జనులు, సబ్బండ వర్గాలు, విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు, తెలంగాణలోని 90 ఏండ్ల ముసలి నుంచి 5 ఏండ్ల బడి పోరడి వరకు 2014కు ముందు జరిగిన ప్రతి ఉద్యమ ఘట్టంలో అన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందరి పాత్ర ఉందనేది కాదనలేని సత్యం.

- కె. రమేశ్ యాదవ్
అధ్యక్షుడు, విద్యార్థి జన సమితి, ఓయూ