ఓయూలో వీసీ వర్సెస్ ప్రొఫెసర్స్​ .. గవర్నర్​కు ఫిర్యాదు చేసిన ఔటా నేతలు

ఓయూలో వీసీ వర్సెస్ ప్రొఫెసర్స్​ .. గవర్నర్​కు ఫిర్యాదు చేసిన ఔటా నేతలు
  • వీసీ కుమార్​తమను పట్టించుకోవడం లేదని సీనియర్ల గుస్సా
  • ‘ఫిజికల్ ఎడ్యుకేషన్’లో బాధ్యతల నుంచి తప్పించాలని నలుగురు ప్రొఫెసర్ల లేఖలు 
  • పాలమూరు వర్సిటీకి రిజిస్ట్రార్​చాన్స్ వస్తే  ఓ ప్రొఫెసర్ ను రిలీవ్ చేయని వీసీ

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ ప్రొఫెసర్ కుమార్ తీరును నిరసిస్తూ స్టూడెంట్లతో పాటు ప్రొఫెసర్లూ నిరసన  బాట పట్టారు. ఇప్పటికే వర్సిటీలో ఆందోళనలు చేయొద్దనే సర్క్యులర్ పై నిరసనలు కొనసాగుతుండగానే, వీసీ వ్యవహార శైలిపై ప్రొఫెసర్లు  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీసీగా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తికాకముందే.. ఆయన తీరుపై వ్యతిరేకత రావడం గమనార్హం. మహబూబ్ నగర్​ జిల్లాలోని పాలమూరు వర్సిటీకి రిజిస్ట్రార్​గా ఓయూ మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ పి.రమేశ్​ బాబును నియమిస్తూ.. ఆ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్  ఈ నెల 21న ఆర్డర్స్ జారీచేశారు. 

ఈ నేపథ్యంలో తనను రిలీవ్ చేయాలని  వర్సిటీ అధికారులకు రమేశ్​బాబు లెటర్​ పెట్టుకున్నారు. అయితే, వివిధ కారణాలు చెప్తూ ఆయన్ను ఇప్పటికీ ఓయూ నుంచి రిలీవ్ చేయలేదు.  దీనికి గతం నుంచి వీసీ కుమార్ కు,  రమేశ్​ బాబుకు  మధ్య ఉన్న విభేదాలే కారణమని తెలుస్తున్నది. మరోపక్క ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో నలుగురు సీనియర్ ప్రొఫెసర్లు తమను ఆ పాలనాపరమైన బాధ్యతల నుంచి తప్పించాలని రిజిస్ట్రార్​ నరేశ్​ కు లెటర్స్​పెట్టుకున్నారు. 

 డిపార్ట్ మెంట్ మీటింగ్ పెట్టాలని కోరుతున్నా.. వీసీ, రిజిస్ట్రార్​  పట్టించుకోవడం లేదని అందులో పేర్కొన్నారు. దీనికితోడు హెచ్ సీయూ, నిజాం కాలేజీ క్రికెట్ టీమ్ ఇన్​చార్జీగా నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ వైస్ ప్రిన్సిపాల్​ను నియమించారని చెప్పారు. వెంటనే తమను బాధ్యతల నుంచి తప్పించాలని ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్ ఎల్ బీ లక్ష్మీకాంత్ రాథోడ్, డీపీఈ డైరెక్టర్ రాజేశ్ కుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ సునీల్ కుమార్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ సెక్రటరీ కే.దీప్లా తదితరులు లేఖ అందించారు. ఇదే బాటలో మరిన్ని డిపార్ట్​మెంట్ల ప్రొఫెసర్లు ఉన్నట్టు వర్సిటీలో చర్చ జరుగుతున్నది.

గవర్నర్​కు ఫిర్యాదు..

ఓయూ వీసీ కుమార్ తీరును నిరసిస్తూ గవర్నర్, వర్సిటీ చాన్స్ లర్ జిష్ణుదేవ్ వర్మ కు ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ సంఘం నేతలు కోరారు. పాలమూరు రిజిస్ట్రార్​గా నియమితులైన రమేశ్​ బాబును రిలీవ్ చేయడం లేదని, వర్సిటీ నిబంధనలను అతిక్రమిస్తున్నారని చెప్పారు. ఆఫీస్ పనివేళల్లో వీసీ అందుబాటులో ఉండడం లేదని, దీంతో సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోతుందని తెలిపారు. ఇటీవల వర్సిటీలో నిరసనలు చేయొద్దనే సర్క్యులర్ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్​ను ఔటా నేతలు కోరారు.