ఓయూలో ఆందోళనల రద్దు సర్క్యులర్​ను వెనక్కి తీసుకోవాలి

 ఓయూలో ఆందోళనల రద్దు సర్క్యులర్​ను వెనక్కి తీసుకోవాలి
  • లేనిపక్షంలో రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తం
  • మెయిన్​ లైబ్రరీ నుంచి ఆర్ట్స్​కాలేజీ వరకు విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ 

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్​లో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు, నినాదాలు చేయకూడదంటూ వర్సిటీ అధికారులు రిలీజ్​చేసిన సర్క్యులర్​ను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్​చేశాయి. సర్క్యులర్ ను వ్యతిరేకిస్తూ సోమవారం క్యాంపస్​లోని మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని అంబర్​పేట, నల్లకుంట, ఓయూ పీఎస్​లకు తరలించారు. 

ఈ సందర్భంగా స్టూడెంట్​లీడర్లు మాట్లాడుతూ.. స్టూడెంట్లు తమ సమస్యలపై పోరాటం చేస్తారనే కనీస అవగాహన లేకుండా ఓయూలో ప్రొఫెసర్లుగా ఉన్నారా అని ప్రశ్నించారు. స్టూడెంట్ల సమస్యలు వినడానికి సిద్ధంగా లేకపోతే తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్​చేశారు. ఇలానే వ్యవహరిస్తే ఫెయిల్యూర్ వీసీగా మిగిలిపోతారని విమర్శించారు. తాజా సర్క్యులర్ పై సీఎం, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇది వీసీ సొంత నిర్ణయమా లేక ప్రభుత్వ నిర్ణయమో స్పష్టం చేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను, రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను, ప్రతిపక్షాలను కలుపుకొని భారీ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తామని, అవసరమైతే అసెంబ్లీ ముట్టడికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.