
న్యూఢిల్లీ: యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్ని దేశాలపై టారిఫ్‌లు వేయడంతో చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఇండియాతో వ్యాపారం పెంచుకోవడానికి ముందుకొస్తున్నాయి. చర్చల దశలో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (ఎఫ్‌టీఏల)ను వీలున్నంత తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నాయి. సస్టయినబిలిటీ, క్లెయిమేట్ చేంజ్ వంటి నాన్ ట్రేడ్ అంశాలను పెద్దగా పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాయి. ముందు ఎఫ్‌టీఏ అమలు చేద్దాం, ఆ తర్వాత సమస్యేమైన ఉంటే చర్చిద్దామనే ఆలోచనలో ఉన్నాయని సంబంధిత వ్యక్తులు వివరించారు.
ఇటువంటి అంశాలను ఎఫ్‌టీఏల్లో చేర్చాలని యూరోపియన్ యూనియన్, యూకే వంటి ప్రాంతాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. సస్టయినబిలిటీ, లేబర్, పర్యావరణం వంటి అంశాలను వాణిజ్య ఒప్పందాలలో చేర్చడం కంటే, వాటిని వేర్వేరు వేదికలు లేదా అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌లలో పరిష్కరించాలని ముందు నుంచి ఇండియా వాదిస్తూ వచ్చింది. లేబర్ స్టాండర్డ్స్ కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఉండగా, పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు యూఎన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లెయిమేట్ చేంజ్ (యూఎన్‌ఎఫ్‌సీసీ)ఉంది.
ఈ ఏడాది చివరి నాటికి ఈయూ, ఇండియా మధ్య ఎఫ్‌టీఏ పూర్తి కానుంది. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చర్చించారు. కాగా, ఎఫ్‌టీఏల కింద ఇరు దేశాల మధ్య జరిగే వ్యాపారంలో దిగుమతులపై పూర్తిగా సుంకాలను ఎత్తివేయడం లేదా పెద్ద మొత్తంలో తగ్గించడం జరుగుతుంది.