తిరుమల కొండపై యహోవా కారు : అన్యమత ప్రచారంపై భక్తుల ఆగ్రహం

తిరుమల కొండపై యహోవా కారు : అన్యమత ప్రచారంపై భక్తుల ఆగ్రహం

తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా వైఫల్యాలు.. తనిఖీల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తిరుమల కొండపై అన్యమత ప్రచారం అనేది నిషేధం.. నేరం. కనీసం కార్లకు ఇతర మతాలకు చెందిన స్టిక్కర్లు ఉండటం కూడా నేరం.. ఏదైనా కార్లపై ఇతర మతాల దేవుళ్లకు చెందిన స్లోగన్స్, స్టిక్కర్లు ఉంటే తిరుపతిలోని అలిపిరి టోల్ గేట్ దగ్గర వాటిని నిలిపివేస్తారు భద్రతా సిబ్బంది. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే తిరుమల కొండపైకి అనుమతి ఉంటుంది. 2025, ఫిబ్రవరి 5వ తేదీ తిరుమల కొండపై బైబిల్ స్లోగన్ స్టిక్కర్లు ఉన్న కార్లు స్వేచ్ఛగా తిరగటం చర్చనీయాంశం అయ్యింది. అలిపిరి దగ్గర ఆ స్లోగన్ పై కనీసం స్టిక్కర్లు కూడా వేయకపోవటం.. అలాంటి వాహనాన్ని యథావిధిగా కొండపై అనుమతించటంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.

అలిపిరి తనిఖీ కేంద్రంలో మరో మారు నిఘా వైఫల్యం ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే అపవాదులు తెచ్చిపెడుతుంది. తిరుమల కొండపైన నందకం గెస్ట్ హౌస్ ఎదుట అన్యమత స్టిక్కర్ తో ఓ కారు తిరుగటం.. పార్క్ చేసి ఉండటం చూస్తుంటే.. భద్రతా వైఫల్యం అనేది కొట్టిచ్చినట్లు బయటపడింది. ఇటీవల తరచూ అలిపిరి దగ్గర బయటపడుతున్న భద్రతా వైఫల్యాలకు ఇది సాక్ష్యంగా ఉంది. అలిపిరి దగ్గర తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనటానికి ఇదే నిదర్శనం.

కొత్త పాలకమండలి వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి.. తిరుపతిలో టోకెన్ల కోసం తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవటం వంటి ఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే..