కొత్త పరేషాన్.. ఓటీపీలు లేట్ అవుతాయంట.. నెట్ బ్యాంకింగ్, ఆధార్ ఓటీపీలు ఆలస్యమైతే ఎట్ల..!

కొత్త పరేషాన్.. ఓటీపీలు లేట్ అవుతాయంట.. నెట్ బ్యాంకింగ్, ఆధార్ ఓటీపీలు ఆలస్యమైతే  ఎట్ల..!

ఓటీపీ(OTP). ఈ మధ్య అన్ని సేవలు డిజిటలైజేషన్ అయిన తర్వాత ఓటీపీ(వన్ టైం పాస్వర్డ్) అనేది తప్పనిసరి అయింది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వంటి ప్రభుత్వ సేవలకు, బ్యాంకింగ్ సేవలకు, షాపింగ్స్ యాప్స్ అయినా, క్యాబ్ బుక్ చేసుకున్నా.. ఎల్ఐసీ సేవలకైనా.. ఇలా ఒక్కటేంటి.. మన దైనందిన జీవితంలో చాలా సేవలు సవ్యంగా మనకు అందాలంటే ఓటీపీ మస్ట్. మన మొబైల్ నంబర్కు ఈ ఓటీటీ రావడం కాస్త ఆలస్యమైతే తన్నుకులాడిపోతుంటాం. అలాంటిది.. ట్రాయ్ కొత్త నిబంధనల కారణంగా డిసెంబర్ 1 నుంచి ఓటీపీ ఆలస్యంగా రావడం జరుగుతుందని తెలిస్తే.. ఇంకేమైనా ఉందా..? డిసెంబర్ 1, 2024 నుంచి టెలికాం రెగ్యులరేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రేసబులిటీ గైడ్ లైన్స్ అమల్లోకి రానున్నాయి.

ఈ కారణంగా వన్ టైం పాస్వర్డ్ మెసేజ్లు లేట్గా వస్తాయని వార్తలు గుప్పుమంటున్నాయి. సైబర్ మోసాలను అరికట్టేందుకు కమర్షియల్ మెసేజ్లు, ఓటీపీలను కూడా ఇకపై ట్రాక్ చేయాలని ట్రాయ్ నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి అమలు కానున్న ట్రాయ్ కొత్త ట్రేసబులిటీ నిబంధనల్లో ఇది ముఖ్యమైనది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్-ఐడియా.. ఇలా భారత్లోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ట్రాయ్ కొత్త నిబంధనలను తూచాతప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 

ఈ నిబంధనల ప్రభావం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు, ఈ-కామర్స్ పోర్టల్స్ పంపించే ఓటీపీలపై పడే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. వాస్తవానికి ఈ రూల్ అక్టోబర్లోనే అమల్లోకి వచ్చి ఉండేది. అక్టోబర్ 31 వరకూ అప్పట్లో ట్రాయ్ డెడ్లైన్ విధించింది. నవంబర్ 30 వరకూ ఈ డెడ్లైన్ను పొడిగించింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఈ రూల్ అమలుకు మరింత సమయం కోరినట్టు తెలిసింది. కానీ.. అందుకు ట్రాయ్ సుముఖంగా లేదు. 

సైబర్ నేరాలకు అడ్డుకట్టవేసేందుకు డిసెంబర్ 1 నుంచి సెండర్స్ పంపించే మెసేజ్లను బ్లాక్ చేసి సమీక్షించాకే మొబైల్ యూజర్లకు పంపించాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే.. ఓటీపీలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందనే వార్తలపై ట్రాయ్ స్పందించింది. నెట్ బ్యాంకింగ్, ఆధార్ వంటి అత్యవసర సేవలకు సంబంధించిన ఓటీపీలను ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చూస్తామని మొబైల్ యూజర్లకు హామీ ఇచ్చింది.