
- క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, సిరీస్‌లు చూసి క్రూరమైన నేరాలు
- క్రైమ్ పాఠాలకు అడ్డాగా మారిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
- నేరాలు చేయడం, సాక్ష్యాధారాలు మాయం చేయడంపైనే స్టోరీలు
- యూట్యూబ్ చానెళ్లలోనూ విచ్చలవిడిగా కంటెంట్
- సమాజంలో జరుగుతున్న అనేక దారుణాలకు ఇవే కారణం
- ఇటీవల జరిగిన కొన్ని క్రైమ్స్ కు ఓటీటీ మూవీస్,
- సిరీస్‌లే కారణమని పోలీసుల విచారణలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: క్రైమ్ థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ మూవీస్, వెబ్‌సిరీస్‌లకు ఓటీటీ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సెన్సార్ కటింగ్స్లేకపోవడంతో ఇందులోని కంటెంట్ అత్యంత దారుణంగా ఉంటున్నది. రొమాంటిక్ మూవీస్ పేరుతో బోల్డ్, సెమీ న్యూడ్సీన్స్ పెరిగిపోయాయి. డైలాగుల్లో మాటకో బూతు కామన్‌గా మారింది. ఇంట్లో పిల్లలతో కలిసి చూస్తున్నప్పుడు అప్పటిదాకా సాఫీగా సాగే మూవీ/వెబ్‌సిరీస్‌లో అకస్మాత్తుగా వస్తున్న బూతు డైలాగులు, లిప్టు లిప్‌కిస్‌లు, బెడ్రూం సీన్స్ చూసి తల్లిదండ్రులు బిత్తరపోతున్నారు. ఇక హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో క్రైమ్ సన్నివేశాలు మరీ శ్రుతిమించుతున్నాయి.
అత్యంత కిరాతకంగా హత్యలు చేయడం, కేసుల నుంచి తప్పించుకునేందుకు శవాలను ముక్కలు చేయడం, కుక్కలకు వేయడం, కుక్కర్లో వేసి ఉడికించడం, కాల్చి పొడిచేయడం, డ్రైన్లు, చెరువుల్లో కలపడం లాంటి సీన్స్ ఉంటున్నాయి. ఇలా డైరెక్టర్లు, రైటర్లు తమ క్రిమినల్ బుర్రలకు పదునుపెట్టి మరీ తీస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లను చూస్తున్న పలువురు.. అదే విధంగా హత్యలు చేయడానికి, సాక్ష్యాధారాలను మాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఓటీటీ కంటెంట్చూసే మనుషుల ప్రవర్తన విపరీతంగా ఉంటున్నదని.. ముఖ్యంగా చిన్నారులు, యువతపై తీవ్ర ప్రభావం పడుతున్నదని సైకియాట్రిస్టులు అంటున్నారు. అదే విధంగా క్రైమ్ థ్రిల్లర్సినిమాల ప్రభావం వల్ల గతంతో పోలిస్తే హత్యల్లో క్రూరత్వం అనేక రెట్లు పెరిగిందని.. సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రయత్నాలు ఎక్కువయ్యాయని పోలీసులు చెబుతున్నారు.
నో సెన్సార్..
ఒకప్పుడు సినిమాలంటే కళాత్మకం లేదంటే సందేశాత్మకంగా ఉండేవి. సినిమా బాగుంటేనే ఆడుతుందనే ఉద్దేశంతో నిర్మాతలు, దర్శకులు, రచయితలు తీసే ప్రతి సీన్‌లో, రాసే ప్రతి డైలాగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాగైతేనే ఫ్యామిలీ ఆడియెన్స్థియేటర్ల దాకా వచ్చేవారు. ఏమాత్రం తేడా కొట్టినా సినిమాలు బాక్సాఫీస్వద్దే బోల్తా కొట్టేవి. దీంతో నిర్మాతలు, దర్శకులు లక్ష్మణరేఖ దాటేవారు కాదు. క్రైమ్ అయినా, రొమాన్స్అయినా ఒకస్థాయి వరకే పరిమితయ్యేవారు. అప్పటికీ సెన్సార్‌బోర్డు సినిమాకు అనేక కత్తెర్లు పెట్టాకగానీ రిలీజ్‌కు ఓకే చెప్పేది కాదు. కానీ ఓటీటీలు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా వెబ్‌సిరీస్‌లకు అడ్డూఅదుపూలేకుండా పోయింది. రెగ్యులర్ సినిమాలు ఓవైపు థియేటర్ల కోసం పోటీపడ్తుంటే.. తక్కువ ఖర్చుతో, ఏమాత్రం సామాజిక బాధ్యత లేకుండా తీస్తున్న కొన్ని మూవీస్, వెబ్‌సిరీస్‌లకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అడ్డాగా మారాయి. కొత్త సినిమాలు థియేటర్స్‌లలో సందడి చేస్తుంటే.. సెన్సార్‌లేని ఇలాంటి క్రైమ్, హారర్ మూవీస్ ఓటీటీల్లో టెర్రర్ సృష్టిస్తున్నాయి. ఈ సినిమాలు నడిచే తీరు సామాన్యులు కూడా క్రిమినల్స్‌గా మారే విధంగా ఉందని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈజీగా మనీ సంపాదించేందుకు ఎలా అడ్డదారులు తొక్కాలో? డ్రగ్స్ఎలా తీసుకోవాలో? దోపిడీలు చేసి ఎలా తప్పించుకోవాలో? అడ్డువచ్చేవాళ్లను అతి కిరాతకంగా ఎలా హతమార్చాలో? సాక్ష్యాధారాలను ఎలా మాయం చేయాలో? ఇలా అన్నీ చూపిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి గల్లీ దాకా జరుగుతున్న అనేక దారుణాలకు ఓటీటీలోని క్రైమ్ థ్రిల్లర్మూవీస్, వెబ్‌సిరీస్‌లే పరోక్షంగా కారణమవుతున్నాయని అంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు నేరాలు, ఘోరాలు ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.
ఓటీటీ క్రైమ్స్ ఎన్నో..
మేడ్చల్ ఓఆర్‌ఆర్ అండర్ పాస్ వద్ద ఇటీవల లభించిన యువతి డెడ్‌బాడీ మిస్టరీ ఇంకా వీడలేదు. ఆ యువతి ఆనవాళ్లు లభించకుండా ఉండేందుకు నిందితులు పక్కా ప్లాన్ తో చంపేశారు. హత్య చేసిన తరువాత ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. క్రైమ్ సీన్‌లో ఎలాంటి క్లూస్ లభించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం యువతి చేతులపై ఉన్న టాటూలు మినహా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పునావాలా కూడా సినిమాలనే అనుసరించాడు. శ్రద్దావాకర్‌ను చంపాక ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో భద్రపర్చాడు. ఇంట్లో ఆనవాళ్లు దొరక్కుండా ఏం చేయాలని ఇంటర్‌నెట్‌లో వెతికినట్టు పోలీస్ విచారణలో తేలింది. సల్ఫర్ హైపోకెలోరిక్ యాసిడ్ కొనుగోలు చేసి ఆధారాలు చెరిపేశాడని పోలీసులు గుర్తించారు.
వెబ్ సిరీస్ చూసి భార్య హత్య..
ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన గురుమూర్తి.. తన భార్యపై అనుమానంతో ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ నెల 22న తన భార్య వెంకటమాధవిని హత్య చేసి, పోలీసులకు దొరక్కుండా శవాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో డెడ్‌బాడీని ముక్కలుముక్కలుగా నరికాడు. మాంసం ముద్దలను ఓ కెమికల్లో ముంచి, ద్రావణంగా మార్చి డ్రైన్‌లోకి పంపేశాడు. మిగిలిన ఎముకలను కాల్చి, రోట్లో వేసి దంచి చూర్ణంగా మార్చి చెరువులో పడేశాడు. ఇలాంటి క్రూరమైన ఆలోచనలు ఎలా వచ్చాయి? అని ఇన్వెస్టిగేషన్లో గురుమూర్తిని ప్రశ్నించిన పోలీసులకు.. అతను చెప్పిన సమాధానం విని దిమ్మదిరిగింది. శవాన్ని ఎలా ముక్కలు చేయాలి? తర్వాత ఎలా మాయం చేయాలి? అనేది ఓటీటీలో వచ్చిన ఓ వెబ్సీరీస్లోచూశానని.. కెమికల్స్ గురించి ఓ యూట్యూబ్ చానల్ద్వారా తెలుసుకున్నానని గురుమూర్తి చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఓటీటీలతో డేంజరే..
ఓటీటీల ప్రభావంపై 2017 నుంచి 2024 మధ్య కాలంలో వచ్చిన 25 స్టడీలను సమగ్ర అధ్యయనం చేసి 2024 మార్చి 31న ‘ఇంటర్నేషనల్జర్నల్ఆఫ్ఇండియన్సైకాలజీ’ ఓ రిపోర్ట్‌ను రిలీజ్చేసింది. ఓటీటీ కంటెంట్కారణంగా సమాజంలో నేరాలు, లైంగిక హింస పెరుగుతున్నాయని అందులో అభిప్రాయపడింది. ఓటీటీకి అలవాటుపడ్డవారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కలుగుతున్నట్టు.. ముఖ్యంగా టీనేజర్స్‌లో ఒంటరితనం, హింసాప్రవృత్తి పెరుగుతున్నట్టు, గుంపులుగా ఉన్నప్పుడు క్రూరంగా ప్రవరిస్తున్నట్టు ఈ స్టడీ తేల్చింది. ఓటీటీకి కేటాయించే సమయాన్ని క్రమంగా తగ్గిస్తూ సాహిత్యం, సంగీతం, ఇతర కళలు, అభిరుచుల వైపు దృష్టి సారిస్తేనే ఈ విపత్తును బయటపడవచ్చని సూచించింది.
ప్రిడెక్టివ్ పోలీసింగ్ అందుబాటులోకి తేవాలి..
హత్యలు, దోపిడీలు ఎలా చేయాలి? అని ఆన్‌లైన్ లో సెర్చ్‌చేస్తే వేలాది వీడియోస్ వస్తున్నాయి. వీటిని చూసి నేర్చుకునే వాళ్లను టెక్నికల్ పరిభాషలో స్క్రిప్ట్ కిడ్డీస్ అంటారు. ప్రిడెక్టివ్ పోలీసింగ్ ద్వారా భవిష్యత్ నేరాల్ని అంచనా వేసి అడ్డుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.
- పి.ప్రసాద్, సైబర్ ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ నిపుణుడు, హైదరాబాద్
మంచి కంటే చెడే ఎక్కువ..
ఒకప్పుడు సినిమాలు సందేశాత్మకంగా ఉండేవి. ప్రస్తుతం నేరప్రవృత్తి గల సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రధానంగా ఓటీటీలో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సొసైటీని పెడదారి పట్టిస్తున్నాయి. వీటిల్లో మంచి కంటే చెడునే ఎక్కువగా చూపిస్తున్నారు.
- హరిణి, సైకియాట్రిస్ట్, కేర్‌హాస్పిటల్, హైదరాబాద్