Sunday Special: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సీరీస్లు ఇవే..

Sunday Special: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సీరీస్లు ఇవే..

ద్వీపాన్ని వెతికేందుకు.. 

  • టైటిల్ : మోనా 2,
  • ప్లాట్​ ఫాం : జియోస్టార్​
  • డైరెక్షన్ : డేవిడ్ డెరిక్ జూనియర్, జాసన్ హ్యాండ్, డానా లెడౌక్స్ మిల్లర్,
  • కాస్ట్​ : ఔలీ క్రావాల్హో, డ్వేన్ జాన్సన్, హులాలై చుంగ్, రోజ్ మాటాఫియో, డేవిడ్ ఫాన్ 

మోనా మొదటి పార్ట్‌‌‌‌ 2016లో విడుదలై అందరినీ ఆకట్టుకుంది. దానికి సీక్వెల్​గా ఇప్పుడు మోనా 2 సినిమా వచ్చింది. కథలోకి వెళ్తే.. మోనాకు తన పూర్వీకుల నుండి ఒక ఊహించని పిలుపు వస్తుంది. వాళ్లు మోటుఫెటు అనే శాప ద్వీపం గురించి ఆమెకు చెప్తారు. దేవుడి శాపం వల్ల ఆ ద్వీపం ప్రపంచం నుంచి విడిపోయింది. పూర్వీకులు ఆ ద్వీపాన్ని వెతికే పనిని మోనాకు అప్పగిస్తారు. దాంతో ఆమె తన టీమ్​తో ద్వీపాన్ని వెతకడానికి బయల్దేరుతుంది. ఆ సాహస యాత్రలో ఆమెకు ఎదురైన సవాళ్లు, సమస్యలేంటి? తెలియాలంటే సినిమా చూడాలి. 


బంగారం ఎలా రాబట్టాలి?

  • టైటిల్ : పొన్​మ్యాన్​, 
  • ప్లాట్​ ఫాం : జియోస్టార్
  • డైరెక్షన్ : జ్యోతిష్ శంకర్
  • కాస్ట్​ : బాసిల్ జోసెఫ్, లిజోమోల్ జోస్, సజిన్ గోపు,  ఆనంద్ మన్మథన్ 

బ్రూనో (ఆనంద్ మన్మథన్) ఒక రాజకీయ పార్టీలో యాక్టివ్​గా పనిచేస్తుంటాడు. అతని చెల్లి స్టెఫీ గ్రాఫ్ (లిజోమోల్ జోస్)కి మరియానో ​​(సజిన్ గోపు) అనే వ్యక్తితో పెండ్లి కుదురుతుంది. అతనికి కట్నంగా 25 తులాల బంగారం ఇస్తామని ఒప్పుకుంటారు. కానీ.. అంత డబ్బు బ్రూనో దగ్గర లేకపోవడంతో 13 తులాలు మాత్రమే కొంటాడు. మరో 12 తులాల డబ్బుని పెండ్లి జరిగిన మరుసటి రోజు ఇస్తానని చెప్పి అజీష్ (బాసిల్ జోసెఫ్) దగ్గర బంగారం కొంటాడు. పెళ్లికి వచ్చిన చదివింపుల డబ్బుతో ఆ అప్పు తీర్చేయాలి అనుకుంటాడు. కానీ.. అంతలోనే బ్రూనో చర్చికి సంబంధించిన వ్యక్తి​తో గొడవపడతాడు. దాంతో పార్టీ, చర్చి నుంచి ఎవరూ పెండ్లికి వెళ్లరు. దాంతో చదివింపులు రావు. అజీష్ తన12 తులాల బంగారాన్ని తిరిగి ఇచ్చేయాలని పట్టుబడతాడు. మరియానోని ఎదిరించి బంగారం వెనక్కి తీసుకోవడం కుదరని పని. అప్పుడు అజీష్ ఏం చేశాడు? అనేది మిగతా కథ. 

నాన్నను వదిలించుకుందామని..  

  • టైటిల్ : వనవాస్,
  • ప్లాట్​ ఫాం : జీ5,
  • డైరెక్షన్ : అనిల్ శర్మ, 
  • కాస్ట్​ : నానా పటేకర్, ఖుష్బూ, ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, రాజ్‌‌‌‌పాల్ యాదవ్, అశ్విని కల్సేకర్

దీపక్ త్యాగి (నానా పటేకర్) రిటైర్డ్ ఉద్యోగి. అతనికి ముగ్గురు కొడుకులు. డెమెన్షియా వ్యాధితో బాధపడుతున్న దీపక్​ చనిపోయిన తన భార్య విమల త్యాగి (ఖుష్బూ)ను తరచుగా గుర్తుచేసుకుంటుంటాడు. పిల్లలు చేసే పనులను పదే పదే కరెక్ట్‌‌‌‌ చేస్తుంటాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన కొడుకులు దీపక్​ని.. వారణాసిలోని వృద్ధాశ్రమంలో వదిలేయాలని ప్లాన్​ వేస్తారు. కానీ.. అది కుదరకపోవడంతో ఒక ఘాట్​ దగ్గర వదిలేసి వెళ్లిపోతారు. దీపక్​ తన స్వస్థలం మర్చిపోతాడు. అప్పుడే దీపక్​కు ఒక దొంగ వీరు (ఉత్కర్ష్ శర్మ)ని కలుస్తాడు. ఆ తర్వాత తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.