ఓటీటీ బరితెగింపులకు కళ్లెం వేయాలి

న్యూస్‌‌‌‌ పేపర్లు, టీవీ చానల్స్‌‌‌‌, శాటిలైట్‌‌‌‌ చానల్స్‌‌‌‌ కేంద్రం చేసిన చట్టాల పరిధిలో పనిచేస్తున్నాయి. కానీ, డిజిటల్‌‌‌‌, సోషల్‌‌‌‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌కు ఇలాంటి నియంత్రణలేవీ లేవు. అశ్లీల, హింసాత్మక సన్నివేశాలు, మహిళలను, మనదేశ సంప్రదాయాలు, సంస్కృతిని దెబ్బ తీసేలా సినిమాలు, సిరీస్‌‌‌‌లను ప్రసారం చేస్తున్నాయి. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించే అధికారిక నియంత్రణ సంస్థ లేకపోవడమే దీనంతటికీ కారణం. ఈ నేపథ్యంలో డిజిటల్‌‌‌‌ బరితెగింపులకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘డిజిటల్ మీడియా నైతిక స్మృతి-2021’ను తీసుకొచ్చింది.

మనదేశంలో లక్షా 18 వేల 239 న్యూస్‌‌‌‌ పేపర్లు, 1,600 శాటిలైట్ చానల్స్‌‌‌‌, 400లకు పైగా న్యూస్‌‌‌‌ చానల్స్‌‌‌‌, 300లకు పైగా మ్యాగజైన్స్, 25 వేల బ్లాగ్స్ ఉన్నాయి. ఈ న్యూస్‌‌‌‌ చానల్స్‌‌‌‌, పేపర్లు, మ్యాగజైన్లు.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1965, 1978 చట్టాల పరిధిలోని నియమావళిని అనుసరిస్తున్నాయి. ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌‌‌ చానెల్స్‌‌‌‌ కేబుల్ టీవీ రెగ్యులేషన్ చట్టం 1995 పరిధిలో నడుచుకుంటున్నాయి. కానీ, డిజిటల్, సోషల్‌‌‌‌ మీడియాలకు, ఓటీటీ(ఓవర్ ద టాప్) ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లకు ప్రత్యేక నియంత్రణ చట్టాలు లేవు. దీన్ని అదునుగా చేసుకుని చాలా డిజిటల్‌‌‌‌, సోషల్‌‌‌‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ ఎలాంటి నియమావళిని పాటించడం లేదు. సృజనాత్మకత పేరు మీద డిస్నీ ప్లస్ హాట్‌‌‌‌స్టార్, నెట్‌‌‌‌ఫ్లిక్స్, అమెజాన్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌ వీడియో లాంటి ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ సామాజిక బాధ్యతను విస్మరిస్తూ, నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయి. బూతు సంభాషణలు, అశ్లీల, హింసాత్మక సన్నివేశాలు, మహిళలను కించపరిచే విధంగా, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను, సామరస్యతను దెబ్బతీసేలా, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్‌‌‌‌కు అనుకూలంగా, మనదేశానికి వ్యతిరేకంగా, మన సంప్రదాయాలు, విశ్వాసాలను దెబ్బతీస్తూ, సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులను పలుచన చేస్తూ చిత్రాలను నిర్మిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో దుమారం రేగిన తాండవ్, లీలా వెబ్ సిరీస్‌‌‌‌లు ఈ కోవలోకే వస్తాయి. కొంతమంది సినిమా డైరెక్టర్లు చాలా తెలివిగా తమ వీక్షకుల సంఖ్యను పెంచుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని వివాదాస్పద సీన్లను తమ సినిమాలు, సిరీస్‌‌‌‌ల్లో పొందుపరుస్తున్నారు. తద్వారా తమ చిత్రాలకు మరింత ఎక్కువ ప్రచారం లభిస్తుందని వారు భావిస్తున్నారు. దీనంతటికీ కారణం అభ్యంతరకర సన్నివేశాలను తొలగించే అధికారిక నియంత్రణ సంస్థ లేదా నియమావళి లేకపోవడమే.

సోషల్‌‌‌‌ మీడియాలో విచ్చలవిడిగా..

రెండు దశాబ్దాలుగా సోషల్‌‌‌‌ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి. ఇండియాలో ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌కు 41 కోట్ల మంది యూజర్లు, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌కు 21 కోట్ల మంది, వాట్సాప్‌‌‌‌కు 53 కోట్ల మంది, యూట్యూబ్‌‌‌‌కు 44.8 కోట్ల మంది, గూగుల్‌‌‌‌కు 40 కోట్ల మంది, ట్విట్టర్‌‌‌‌కు 1.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ ఏవీ ప్రత్యేక చట్టపరిధిలో లేని కారణంగా కొంతమంది వ్యక్తులు, సంస్థలు నకిలీ ఖాతాలతో అసత్యాలను ప్రచారం చేయడం, హింసను ప్రేరేపించడం, ఫొటోలను మార్ఫింగ్ చేయడం, బూతు చిత్రాలను పోస్ట్ చేయడం, మహిళలను వేధించడం, ఇతరులను బూతులతో దూషించడం వంటి కార్యకలాపాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. దీని వల్ల హింసాత్మక, అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడే అసాంఘిక శక్తులకు, టెర్రరిస్టులకు తలుపులు బార్లా తెరిచినట్లయింది.

ఇన్ఫర్మేషన్‌‌‌‌ టెక్నాలజీ యాక్ట్‌‌‌‌లో మార్పులు

న్యూస్‌‌‌‌ చానల్స్‌‌‌‌, కేబుల్ చానల్స్‌‌‌‌, పత్రికలు, సినిమాలు చట్ట పరిధిలో నడుచుకుంటూ ఉంటే ఓవర్ ద టాప్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లకు, డిజిటల్ మీడియాలకు ఒక నియమావళి, ఒక చట్ట పరిధి ఎందుకు ఉండకూడదని పౌరసమాజం భావిస్తోంది. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో భారీ మార్పులతో మధ్యంతర మార్గదర్శకాలు తీసుకొచ్చి భావప్రకటన స్వేచ్ఛ పేరుతో బరితెగించిన ఈ వేదికలకు ‘డిజిటల్ మీడియా నైతిక స్మృతి-2021’తో కళ్లెం వేసింది. ఈ నిర్ణయంతో దేశంలోని భిన్న ధర్మాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఆదర్శ పురుషులు, దేవతలను కించపరిచే చర్యలకు అడ్డుకట్టపడుతుందని మాఖన్ లాల్ చతుర్వేది యూనివర్సిటీ వైస్‌‌‌‌ చాన్స్‌‌‌‌లర్‌‌‌‌, ప్రముఖ పాత్రికేయుడు కేజీ సురేశ్‌‌‌‌ అభిప్రాయపడ్డారు. వాట్సాప్, ఫేస్‌‌‌‌బుక్ అసత్య ప్రచారాల వల్ల చాలా చోట్ల అల్లర్లు చెలరేగిన ఉదంతాలు ఉన్నాయని ఆయన అన్నారు. యూజర్ల గౌరవాన్ని, దేశ గౌరవాన్ని కాపాడాలంటే ఈ మార్గదర్శకాలు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. సమస్యకు, అసత్య ప్రచారానికి కారణమైన మొదటి వ్యక్తి వివరాలు ఆ సంస్థలు బహిర్గతం చేయడం వల్ల సమస్యను పరిష్కరించవచ్చని చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగంలో అధికారులే కాకుండా పాత్రికేయులు, మేధావులతో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించలేని పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. 21వ శతాబ్దంలో సాంకేతిక విప్లవానికి అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా మన చట్టాలను మార్చుకోవాలని, కొత్త చట్టాలను రూపకల్పన చేయాలని సుప్రీంకోర్టు లాయర్‌‌‌‌ తడిమల్ల భాస్కర్‌‌‌‌ గౌతం అభిప్రాయపడ్డారు.

స్వేచ్ఛను హరిస్తున్నారనడం సరికాదు

‘డిజిటల్ మీడియా నైతిక స్మృతి-2021’ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (a) ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. విచ్చలవిడితనానికి, బాధ్యతతో కూడిన స్వేచ్ఛకి గల సన్నని గీతను మనమందరం గుర్తించాలి. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పత్రికా స్వేచ్ఛ కోసం ఉద్యమించిన ఎందరో నాయకులు నేటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. సాక్షాత్తూ కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా వారిలో ఒకరు. స్వేచ్ఛ విలువేంటో తెలిసిన వారిగా ఇతరుల స్వేచ్ఛను హరించి వేస్తారని భావించడం సరికాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన దిశగానే అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మెజారిటీ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు.

   – అయోధ్య రామ్, ఫ్రీలాన్స్‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌, ఢిల్లీ