ఈ వారం ఓటీటీలోకి వస్తున్న చిత్రాలివే

ఈ వారం ఓటీటీలోకి వస్తున్న చిత్రాలివే

లగ్జరీ సొసైటీ

టైటిల్ : 36 రోజులు
ప్లాట్​ ఫాం : సోనీ లివ్‌
డైరెక్షన్ : విశాల్‌ ఫురియా
కాస్ట్ : నేహా శర్మ, అమృతా ఖాన్విల్కర్, సుశాంత్ దివ్గీకర్, శృతి సేథ్, పురబ్ కోహ్లీ, షరీబ్ హష్మీ, చందన్ రాయ్ సన్యాల్

గోవాలోని సముద్ర తీరంలో ఒక లగ్జరీ హౌసింగ్ సొసైటీ ఉంటుంది. ఆ కాలనీలో రిషి (పూరబ్ కోహ్లీ) రాధిక (శృతి సేథ్) ఉంటుంటారు. వాళ్ల పక్క ఇంట్లోనే టోని (చందన్ రాయ్) అతని భార్య సియా (చాహత్) ఉంటారు. తాము ధనవంతులమని చెప్పుకోవడానికే లలిత (అమృత), ఆమె భర్త వినోద్ (షరీబ్ హష్మీ) ఆ సొసైటీలో ఇల్లు కొంటారు. బెనీ (షెర్నాజ్) ఆమె భర్త డెన్జీ, కొడుకు రియాద్ మరో ఇంట్లో ఉంటారు. వాళ్ల పక్కనే ఉన్న ఒక ఇంట్లోకి అద్దెకి దిగుతుంది ఫరా (నేహా శర్మ). 
కథలోకి వెళ్తే.. గతంలో రిషికి ఒక అమ్మాయితో ఎఫైర్ ఉంటుంది. రాధికకి రిషితో రెండో పెళ్లి జరుగుతుంది. అందుకే రిషి–రాధిక మధ్య ఎప్పుడూ గొడవలు అవుతుంటాయి. నోయల్ (శంకర్) క్యాసినోలో వినోద్ మేనేజర్​గా పనిచేస్తుంటాడు. బెనీ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆమె కోడలు సోనాలి పుట్టింటికి వెళ్లిపోతుంది. దాంతో రియాద్ బాధపడుతుంటాడు. ఇదంతా అలా ఉండగా ఫరా ఆ సొసైటీలోకి వస్తుంది. తాను ఎయిర్ హోస్టెస్​గా పని చేస్తున్నట్టు అక్కడి వాళ్లను నమ్మిస్తుంది. పేరెంట్స్ ముంబయిలో ఉంటారని చెప్తుంది. ఫరా చాలా అందంగా ఉండడంతో రిషి, టోని ఆమెకు దగ్గరవ్వాలని చూస్తుంటారు. ఆమెకి వాళ్లిద్దరూ ఎక్కడ దగ్గరైపోతారో అని వినోద్ కంగారు పడుతుంటాడు. ఆమె అందాన్ని చూసి అక్కడి ఆడవాళ్లు అసూయపడతారు. అప్పుడే తార అనే ట్రాన్స్​జెండర్ టోని ఇంటికి వస్తుంది. ఆమె ఎందుకు వస్తుంది? ఫరా ఎవరు? అక్కడికి ఎందుకు వచ్చింది? ఫరా రెగ్యులర్​గా కలుస్తున్న మోహిత్ ఎవరు? తెలుసుకోవాలంటే సిరీస్‌ చూడాలి. 

పెళ్లి ఆపడానికి 

టైటిల్ : వైల్డ్ వైల్డ్ పంజాబ్
ప్లాట్​ ఫాం :  నెట్ ఫ్లి క్స్
డైరెక్షన్ : సిమర్‌ప్రీత్ సింగ్
కాస్ట్ : వరుణ్ శర్మ, సన్నీ సింగ్, జాస్సీ గిల్, మంజోత్ సింగ్, పాత్రలేఖ, ఇషితా రాజ్ శర్మ

రాజేష్ ఖన్నా (వరుణ్ శర్మ) లవ్‌ బ్రేకప్ అవుతుంది. దాంతో అతను బాధపడుతూ డిప్రెషన్‌లోకి వెళ్తాడు. అప్పుడు అతని ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ హనీ సింగ్ (మంజోత్ సింగ్), మాన్ అరోరా (సన్నీ సింగ్), గౌరవ్ జైన్ (జాస్సీ గిల్) ఖన్నాని మామూలు మనిషిలా మార్చాలని డిసైడ్ అవుతారు. అందుకే అతని ఎక్స్‌ (అషీమా వర్దాన్) పెండ్లి జరక్కుండా ఆపాలి అనుకుంటారు. అందుకోసం.. పాటియాలా నుండి పఠాన్‌కోట్ బయల్దేరతారు. కానీ.. వాళ్లు ప్లాన్‌ చేసుకున్న పనుల్లో ఒక్కటీ సరిగ్గా జరగదు. పఠాన్‌కోట్‌ చేరుకోవడానికి పెద్ద అడ్వెంచర్ చేయాల్సి వస్తుంది. చివరికి వాళ్లు పెళ్లి జరక్కుండా ఆపారా? లేదా? అనేది స్క్రీన్‌ మీదే చూడాల్సిందే. 

గూఢచారి కథ

టైటిల్ : కమాండర్ కరణ్ సక్సేనా 
ప్లాట్​ ఫాం :  డిస్నీ+హాట్‌స్టార్
డైరెక్షన్ : జతిన్ వాగ్లే
కాస్ట్ : గుర్మీత్ చౌదరి, హృతా దుర్గులే, అర్ష్ అనేజా, ఇక్బాల్ ఖాన్

ఏజెంట్ కరణ్ సక్సేనా (గుర్మీత్ చౌదరి) రా ఏజెంట్‌(గూఢచారి). ఉగ్ర దాడుల నుండి దేశాన్ని రక్షించే మిషన్‌ మొదలుపెడతాడు. అందులో భాగంగా.. అతను ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతను ఐ.ఎస్‌.ఐ. చీఫ్ నాసిర్ ఖాన్ (ఇక్బాల్ ఖాన్)ను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు ఏసీపీ రచన (హృతా దుర్గులే)  కరణ్‌తో రిలేషన్‌లో ఉంటుంది. ఆమె కూడా ఈ మిషన్‌కు హెల్ప్‌ చేస్తుంది. చివరికి కరణ్‌ ఉగ్రవాదులను పట్టుకున్నాడా? వాళ్ల చేతికి చిక్కాడా? అనేది కథ. 

ముసుగు మనిషి

టైటిల్ : అగ్నిసాక్షి
డైరెక్టర్​ :  రజనీకాంత్​, సాయి
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌‌
కాస్ట్ : ఐశ్వర్య పిస్సే, అర్జున్ అంబటి

ఒకప్పుడు స్టార్ మా ఛానెల్‌లో ‘అగ్ని సాక్షి’ పేరుతో ఒక సీరియల్ వచ్చేది. అదే పేరుతో ఇప్పుడు వెబ్‌సిరీస్‌ తీశారు. ఆ సీరియల్‌లో హీరో, హీరోయిన్లుగా చేసినవాళ్లే  ఇందులోనూ లీడ్​ రోల్స్​లో నటించారు. మొదటి ఎపిసోడ్‌లో విలన్ ఎంట్రీ ఇస్తాడు. కానీ.. అతను ఎవరనేది రివీల్‌ చేయరు. ముఖానికి మాస్క్‌ పెట్టుకుని కనిపిస్తాడు. పెళ్లి చేసుకోబోతున్న ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపేసి, ఆ అమ్మాయి జుట్టు కత్తిరించి తీసుకెళ్తాడు. తర్వాత గౌరీ(ఐశ్వర్య పిస్సే)ని చంపేందుకు ప్లాన్‌ వేస్తాడు. ఏసీపీ ఉమా శంకర్(అంబటి అర్జున్) నిజాయితీ గల పోలీస్‌ ఆఫీసర్. ఒక నేరస్తుడిని పట్టుకునేందుకు అతని గ్యాంగ్‌లోనే చేరేందుకు ట్రై చేస్తుంటాడు. అందుకోసం అండర్ కవర్ ఆపరేషన్ చేస్తాడు. కానీ, ఆ స్టింగ్ ఆపరేషన్‌లోకి గౌరీ వచ్చి చెడగొట్టేస్తుంది. ఆమె చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలని కలలు కంటుంది. కానీ.. ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతుంది. తల్లిదండ్రులు చనిపోవడంతో పిన్ని, బాబాయిల దగ్గర పెరుగుతుంది. ఆమె తండ్రి కూడా పోలీసే. కానీ... కొన్ని కారణాల వల్ల గన్‌తో కాల్చుకుని చనిపోతాడు. మరో వైపు శంకర్ అన్నా–వదినలు కూడా చనిపోతారు.  సీన్‌ కట్‌ చేస్తే.. గౌరీ రోడ్డు మీద వెళ్తుంటే మాస్క్ మ్యాన్ కారుతో యాక్సిడెంట్​ చేసేందుకు ప్రయత్నిస్తాడు. సరిగా అదే టైంకి శంకర్ వచ్చి కాపాడతాడు. కానీ... గౌరీ అతనితో గొడవకు దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మాస్క్ మ్యాన్‌ ఎవరు? గౌరీ తల్లిదండ్రులు, శంకర్‌‌ అన్నావదినలు ఎందుకు చనిపోయారు? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే. 

దెయ్యం శాపం

టైటిల్ : కాకుడ, ప్లాట్​ ఫాం : జీ5, డైరెక్షన్ : ఆదిత్య సర్పోత్దార్
కాస్ట్ : సోనాక్షి సిన్హా, రితీష్ దేశ్‌ముఖ్, సాకిబ్ సలీం, ఆసిఫ్ ఖాన్

ఉత్తర భారతదేశంలో రాటోడి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలను ఒక ఆత్మ ఇబ్బంది పెడుతుంటుంది. ప్రతి మంగళవారం సరిగ్గా సాయంత్రం 7.15 గంటలకు ‘కాకుడ’ ఆత్మ ఊళ్లోకి వస్తుంది. అప్పుడు ఊళ్లోని ప్రతి ఇంటి దర్వాజ తెరిచే ఉండాలి. అది మూసి ఉన్న చిన్న తలుపైనా దొరుకుతుందేమో అని వెతుకుతుంది. ఒకవేళ ఏదైనా తలుపు మూసి ఉంటే కాకుడ ఆ ఇంటికి చెందిన ఒక పురుషుడి వీపు మీద తన్ని వెళ్లిపోతుంది. ఒకవేళ ఆడవాళ్లు ఉంటే తాకదు. వాళ్లకు హాని చేయదు. అక్కడినుంచి వెళ్లిపోతుంది. కాకుడ తన్నిన వ్యక్తి వీపు మీద పెద్ద మూపురం ఏర్పడుతుంది. ఆ తర్వాత 13 రోజుల్లో అతను చనిపోతాడు. ఇదిలా ఉండగా.. సన్నీ (సాకిబ్ సలీం), ఇందిర (సోనాక్షి సిన్హా) ప్రేమించుకుంటారు. కానీ.. ఇందిర తండ్రి (రాజేంద్ర మెహతా) ఇంగ్లిష్ మాట్లాడడం బాగా తెలిసినవాడే తనకు అల్లుడిగా రావాలని కోరుకుంటాడు. అందుకని కూతురి పెండ్లికి ఒప్పుకోడు. కానీ.. ఇందిర తన తల్లి (నీలు కోహ్లి), సన్నీ ఫ్రెండ్‌ కిల్విష్ (ఆరిఫ్ ఖాన్) సాయంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అనుకున్నట్టుగానే ఒక మంగళవారం సాయంత్రం 5 గంటలకు పెండ్లి చేసుకోవడానికి టెంపుల్‌కి వెళ్తారు. కానీ.. కొన్ని కారణాల వల్ల పెండ్లి ఆలస్యంగా జరుగుతుంది. అయినా.. సన్నీ రాత్రి7.15 గంటలకు ఇంటికి చేరుకుంటాడు. కానీ.. కాకుడ వచ్చేలోపు తలుపు తెరవలేకపోతాడు. దాంతో కాకుడ సన్నీని తన్ని వెళ్లిపోతుంది. అతని వీపు మీద పెద్ద మూపురం ఏర్పడుతుంది. దాంతో అతని తండ్రి (యోగేంద్ర టిక్కు)తో సహా అందరూ అతని చావు గురించి బాధపడుతుంటారు. కానీ.. ఇందిర సన్నీని బతికించుకోవాలనే దృఢ నిశ్చయంతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. చదువుకున్న అమ్మాయి కావడంతో వైద్యుల సలహా తీసుకుంటుంది. తర్వాత  ఘోస్ట్ హంటర్ (రితీష్ దేశ్‌ముఖ్)ని కలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సన్నీని బతికించుకోగలిగిందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాలి. 

మెడిసిన్ మాఫియా

టైటిల్ : పిల్‌
ప్లాట్​ ఫాం : జియో సినిమా
డైరెక్షన్ : రాజ్‌కుమార్‌‌ గుప్త
కాస్ట్ : రితేష్‌ దేశ్​ముఖ్‌, పవన్‌ మల్హోత్రా, అన్షుల్‌ చౌహాన్‌

బ్రహ్మ గిల్ (పవన్ మల్హోత్రా) నేతృత్వంలోని ఫార్మా కంపెనీ ‘ఫరెవర్ క్యూర్’ ప్రోటోకాల్‌ పాటించకుండా డయాబెటిస్ మెడిసిన్‌ ట్రయల్స్‌ చేస్తుంది. ఆ మెడిసిన్ నమూనాలపై నకిలీ టెస్ట్ లు చేస్తుంది. దాంతో.. ఆ మందులు వాడిన వాళ్ల కిడ్నీలు పాడైపోతాయి. కొందరికి కళ్లు కనిపించవు. తన కంపెనీలో జరిగిన తప్పుని ముఖ్యమంత్రి, తన కుమారుడికి కాబోయే మామగారు సాయంతో బ్రహ్మ గిల్ కప్పిపుచ్చుతాడు. డాక్టర్ ప్రకాష్ చౌహాన్ (రితీష్ దేశ్‌ముఖ్) మెడిసిన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ‘డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ మెడిసిన్’​ హోదాలో పనిచేస్తుంటాడు. ఎంతో నిజాయితీపరుడు. అందుకే డ్రగ్స్‌ ట్రయల్స్ విషయంలో జరిగిన తప్పుని ఎలాగైనా బయట పెట్టాలి అనుకుంటాడు. అప్పుడే నూర్ (అక్షత్ చౌహాన్) అనే జర్నలిస్ట్​ ‘ఫరెవర్ క్యూర్’ మందుల తయారీకి సంబంధించిన రహస్య సమాచారం ఉన్న ఒక ఫైల్‌ని దక్కించుకుంటాడు. ఆ ఫైల్‌ అతనికి దక్కే ప్రాసెస్‌లో అదే కంపెనీలో చేస్తున్న ఆశిష్ ఖన్నా (కుంజ్ ఆనంద్), మెడిసిన్ కౌన్సిల్‌లో మెడిసిన్ ఇన్‌స్పెక్టర్ గుర్జిత్ (అన్షుల్ చౌహాన్) పాత్ర కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ డ్రగ్‌ కంపెనీ ఎలాంటి మోసాలు చేసింది? దోషులకు శిక్ష పడిందా? లేదా? అనేదే ఈ వెబ్‌ సిరీస్‌.