OTT Release 2024: ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సీరీస్లు

OTT Release 2024: ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సీరీస్లు

 

టైటిల్: ఫ్రీడం ఎట్​ మిడ్​నైట్
ప్లాట్​ ఫాం : సోనీ లివ్​
డైరెక్షన్ : నిఖిల్ అద్వానీ
కాస్ట్ :  సిధాంత్ గుప్తా, రాజేంద్ర చావ్లా, చిరాగ్ వోహ్రా, ఆరిఫ్ జకారియా, ఇరా దూబే, 
లాంగ్వేజ్​ : హిందీ

విభజన ఎలా జరిగింది?

ఈ వెబ్​ సిరీస్​1975లో లారీ కాలిన్స్, డొమినిక్ లాపియర్‌ రాసిన ‘ఫ్రీడం ఎట్​ మిడ్​నైట్’ ​ పుస్తకంలోని విషయాల ఆధారంగా తీశారు. స్వాతంత్ర్యానికి ముందు1946లో మన దేశంలో జరిగిన సంఘటనలను ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే..  రెండో ప్రపంచ యుద్ధం తర్వాత  1947 ఆగస్టు 14 అర్ధరాత్రి టైంలో బ్రిటిష్ వాళ్లు ఇండియాకు స్వాతంత్ర్యం ప్రకటించారు. అంతకంటే ఏడాది ముందు నుంచే అప్పటి కాంగ్రెస్​, ముస్లీం లీగ్​ నాయకుల మధ్య చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి కారణం.. ‘దేశ విభజన’. చర్చలకు కాంగ్రెస్​ నుంచి గాంధీ (చిరాగ్ వోహ్రా), నెహ్రూ (సిధాంత్ గుప్తా), సర్దార్ పటేల్ (రాజేంద్ర చావ్లా)లాంటివాళ్లు వెళ్లారు. ముస్లీం లీగ్​ నుంచి జిన్నా (ఆరిఫ్ జకారియా) ముందుకొచ్చాడు. అఖండ భారతదేశంగా కొనసాగించాలా? లేదంటే.. రెండుగా విభజించాలా? అనేది చర్చ. అప్పుడు అనేక సిద్ధాంతాలు తెరపైకి వచ్చాయి. జిన్నా వేర్పాటువాదం, నెహ్రూ ఏకీకరణ, పటేల్ వ్యావహారిక సత్తావాదం(ప్రాగ్మాటిజం) తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు మన దేశం రెండుగా ఎందుకు చీలిపోయింది? అనేది సిరీస్​లోని మిగతా కథ. 


హత్యలు చేసిందెవరు?

టైటిల్ : కురుక్కు
 ప్లాట్​ ఫాం : అమెజాన్​ ప్రైమ్​ వీడియో
 డైరెక్షన్ : అభిజిత్ నూరాని
 కాస్ట్ : అనిల్ ఆంటో, ప్రీతా ప్రదీప్, అజయ ఘోష్, మీరా నాయర్, అమిత మిథున్,  శ్రీజిత్ శ్రీకాంతన్, సుబిన్ టార్జాన్, 
లాంగ్వేజ్​: మలయాళం

జార్జ్ (సుబిన్ టార్జాన్) అనే టెక్కీ ఒకరోజు క్లబ్‌కు వెళ్లి బాగా తాగుతాడు. పెద్ద గొడవ చేసి తన అపార్ట్​మెంట్​కి వెళ్లిపోతాడు. అయితే.. తన కాంప్లెక్స్​లోకి వెళ్లాక జార్జ్ తన పక్క ఫ్లాట్​లో ఉంటున్న రూబిన్ (అజయ ఘోష్) చనిపోవడం చూస్తాడు. కానీ.. అప్పటికే తాగిన మత్తులో ఉండడం వల్ల అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతాడు. కట్​ చేస్తే.. తర్వాతి రోజు ఉదయం రూబిన్ శవం రోడ్డు పక్కన పడి ఉంటుంది. అతని భార్య స్నేహ (ప్రీతా ప్రదీప్) ఫ్లాట్‌లో చనిపోయి ఉంటుంది. పోలీసులు కేసు నమోదు చేస్తారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాజన్ (అనిల్ ఆంటో) ఆధారాల కోసం వెతికినప్పుడు హత్యలు జరిగిన ఫ్లాట్స్​ దగ్గర ఉన్న సీసీటీవీ విజువల్స్​లో జార్జ్ కనిపిస్తాడు. దాంతో అతన్ని అరెస్టు చేస్తారు. కానీ.. అతనే హత్యలు చేశాడు అనడానికి కావాల్సిన ఆధారాలు ఉండవు. తర్వాత అసలైన నేరస్తులను పట్టుకోవడానికి సాజన్ ఏం చేశాడు? ఆ మర్డర్లు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేదే మిగతా కథ. 


ఫ్యామిలీ కోసం.. 

టైటిల్ : ది మ్యాజిక్ ఆఫ్ శిరి
ప్లాట్​ ఫాం : జియో సినిమా
డైరెక్షన్ : బిర్సా దాస్​గుప్త
కాస్ట్ : దివ్యాంక త్రిపాఠి, జావేద్ జఫేరి, నమిత్ దాస్, దర్శన్ జరివాలా, నిశాంక్ వర్మ, పర్మీత్ సేథి,
లాంగ్వేజ్​: హిందీ

ఇది 2000ల ప్రారంభంలో జరిగే కథ. ఢిల్లీలో ఉంటున్న శిరీ (దివ్యాంక త్రిపాఠి) ఒక మామూలు గృహిణి. భర్త, పిల్లలే తన ప్రపంచం. వంట, ఇంట్లో పనులు చేయడం ఆమె డైలీ రొటీన్. ఆమెకు మ్యాజిక్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది. కుటుంబ బాధ్యతల వల్ల నేర్చుకోలేకపోతుంది. కానీ.. అప్పుడప్పుడు పిల్లలకు చిన్న చిన్న మ్యాజిక్​లు చేసి చూపించేది. అలా సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా ఊహించని మార్పు వస్తుంది. ఆర్థిక మాంద్యం వల్ల వాళ్ల ఫ్యామిలీ బిజినెస్​ మూతపడుతుంది. దాంతో కుటుంబ భారాన్ని మోయలేక శిరి భర్త నవీన్ (నమిత్ దాస్) ఆమెను, పిల్లలను వదిలేసి వెళ్లిపోతాడు. దాంతో శిరి తన కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగంలో చేరుతుంది. దాంతోపాటే సలీం జాదుగర్ (జావేద్ జాఫేరి) అనే మెజీషియన్​ దగ్గర మ్యాజిక్‌ కూడా నేర్చుకుంటుంది. కానీ.. తన ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? శిరి కల ఫలించిందా? లేదా? తెలుసుకోవాలంటే ఈ సిరీస్​ చూడాలి.