ప్రొఫెసర్ కోదండరాం నేటి తరానికి రోల్​ మోడల్... ఓయూ కాంట్రాక్ట్​ టీచర్స్​ అసోసియేషన్

ఓయూ, వెలుగు: నేటి తరానికి ప్రొఫెసర్ కోదండరాం ఓ రోల్ మోడల్ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యారంగం బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా కోదండరాంను నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో మంగళవారం ఓయూలో కోదండరాంను ఘనంగా సన్మానించారు.

అతిథులుగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, మాజీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నెరవేర్చే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.