ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తాండ్ర నవనీత రావు(95) జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో శనివారం కన్నుమూశారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తిలో జన్మించిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేశారు. ఓయూ కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకు
డిగా చేరి దాదాపు 40 ఏండ్ల పాటు సేవలందించారు. ప్రొఫెసర్ నవనీతరావు 1985 నుంచి 1991 వరకు రెండు సార్లు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా పని చేశారు. ఆయన వీసీగా ఉన్న సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ భూములు కబ్జాలకు గురవుతున్నట్లు గుర్తించి వాటి పరిరక్షణ కోసం ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించారు. వర్సిటీలోని1,460 ఎకరాల భూమిని కాపాడేందుకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మింపజేశారు.
నవనీత రావు మరణ వార్త తెలుసుకున్న ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, ఫ్యాకల్టీ, స్టూడెంట్లు జూబ్లీహిల్స్ లోని ఇంటికి చేరుకున్నారు. పార్థివదేహానికి నివాళులర్పించారు.నవనీతరావు మృతిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.