- కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలె
- బాసర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలె
- ట్రిపుల్ విద్యార్థికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలె
- ఓయూ జాక్ నేతల డిమాండ్
హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చినట్లు ఓయూ జాక్ నేత సురేశ్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు జాక్ నేతలు ప్రకటన విడుదల చేశారు. విద్యా శాఖ నిర్లక్ష్యం వల్లే బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ హత్యే అన్న ఆయన... తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థి మృతికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ట్రిపుల్ ఐటీలో పేరుకుపోయిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఉరి వేసుకుని సురేష్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. సురేష్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సూసైడ్ కు గల కారణాలు తెలియరాలేదు. విద్యార్ధి ఆత్మహత్యతో మిగతా స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత నెలకొంది. పలు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు తోటి విద్యార్థులు. విద్యార్థి మృత దేహాన్ని పోలీసులు భైంసా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా అధికారులు పట్టించుకోలేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. సురేష్ చనిపోయి గంటసేపు అయినా అంబులెన్స్ కోసం ఎవ్వరూ ఫోన్ చేయలేదని.. ఆస్పత్రికి తరలించేందుకు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.