- కేటీఆర్, బాల్కసుమన్ పై మండిపడ్డ ఓయూ జేఏసీ నేతలు
- ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద దిష్టిబొమ్మల దహనం
ఓయూ/బషీర్‌బాగ్/మేడిపల్లి/వికారాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం ఉస్మానియా వర్సిటీలో ఓయూ జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. కేటీఆర్, బాల్క సుమన్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి ఆర్ట్స్ కాలేజీ వద్ద దహనం చేశారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్ కోట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
తమ నాయకుల కంటే తానేమీ తక్కువ కాదన్నట్లు బీఆర్ఎస్ పార్టీ పెద్దల బానిసైన బాల్క సుమన్ సైతం సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంపదను దోచుకున్న బీఆర్ఎస్ను ఎన్నికల్లో జనం ఓడించినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయారని.. మళ్లీ ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఓయూను సందర్శించని బాల్క సుమన్.. అహకారంతో మాట్లాడితే చూస్తూ ఊరుకోమని కోట శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
కార్యక్రమంలో విద్యార్ధి నాయకులు పెంచాల సతీశ్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో పలువురు స్టూడెంట్లు బాల్క సుమన్‌పై ఓయూ పీఎస్ లో కంప్లయింట్ చేశారు. సీఎం రేవంత్‌పై బాల్క సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా పీసీపీ ప్రధాన కార్యదర్శి చెకోలేకర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ALSO READ: 6 బ్యాంకుల్లో వాటాలు పెంచుకోనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రూప్
కాంగ్రెస్ పీర్జాదిగూడ కార్పొరేషన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో ఆవరణలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను పార్టీ నేతలు దహనం చేశారు. అనంతరం సుమన్‌పై మేడిపల్లి పీఎస్ లో కంప్లయింట్ చేశారు. ఎల్బీనగర్ చౌరస్తాలో బాల్క సుమన్ ఫొటోలను చెప్పులతో కొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ వికారాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనూ నిరసనలు జరిగాయి.