హీరో అల్లు అర్జున్ ఇంటిపై OU JAC దాడి

హీరో అల్లు అర్జున్ ఇంటిపై OU JAC  దాడి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‎లోని హీరో అల్లు అర్జున్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నాయకులు ఆదివారం (డిసెంబర్ 22) అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. బన్నీ ఇంటి గేట్ ముందు కూర్చొని బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరికొందరు ఇంటి గోడ ఎక్కి బన్ని ఇంటిపై రాళ్లు రువ్వి ఇంట్లోని పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో జేఏసీ  నాయకులను బన్నీ సెక్యూరిటీ సిబ్బంది అదుపు చేసింది.

 ఓయూ జేఏసీ నేతల నిరసన సమయంలో బన్నీ కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో నుండి బయటకు రాలేదు.  సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బన్నీ ఇంటి ముందు బైఠాయించిన ఓయూ జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా బన్నీ ఇంటిపై రాళ్లతో దాడి చేయడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, 2024, డిసెంబర్ 4 పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. 

హీరో అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడటంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే  రేవతి ఫ్యామిలీని ఆదుకోవాలని ఓయూ జేఏసీ ఆదివారం (డిసెంబర్ 22) అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది.