సికింద్రాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ రోడ్ గేట్లను ఇక నుంచి రోజూ రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ఇప్పటి వరకు ఈ గేట్లను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసివేసేవారు. దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని, బయటకు వెళ్లినప్పుడు ఆలస్యమైతే విద్యానగర్ మీదుగా తిరిగి రావాల్సి వస్తుందని వీసీ ప్రొఫెసర్ కుమార్కు విద్యార్థులు విన్నవించగా ఆయన స్పందించి నిర్ణయం తీసుకున్నారు.
బయటివ్యక్తులు, బయటి వాహనాల రాకపోకలు పెరిగి క్యాంపస్ వాతావరణానికి విఘాతం కలుగుతోందని, విద్యార్థులు, ఉద్యోగులకు బయట నుంచి వచ్చేవాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని మూడేండ్ల కింద వీసీగా ఉన్నప్పుడు ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఎన్సీసీ గేటుతో పాటు ఓయూ పీఎస్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎన్సీసీ గేటును రోజూ రాత్రి 8గంటలకు మూసి తెల్లారి 8గంటలకు తెరిచేవారు. అప్పట్లో విద్యార్థులు ఆందోళన చేసినా స్పందించలేదు. మూసివేసే సమయాన్ని గంటపాటు పొడిగించాలని కోరినా పట్టించుకోలేదు. తాజాగా వీసీగా ప్రొఫెసర్ కుమార్బాధ్యతలు చేపట్టాక విద్యార్థుల కోరిక మేరకు రెండువైపులా గేట్లను రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంచేందుకు అంగీకరించారు.