ప్రపంచకప్‌ గెలవడమే మా లక్ష్యం.. ఎవరినైనా ఓడిస్తాం: వెస్టిండీస్ ఆల్‌రౌండర్

ప్రపంచకప్‌ గెలవడమే మా లక్ష్యం.. ఎవరినైనా ఓడిస్తాం: వెస్టిండీస్ ఆల్‌రౌండర్

టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా, భారత్ సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తుండగా.. రెండో గ్రూప్ నుంచి మూడు జట్లు(వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా) పోటీలో ఉన్నాయి. మూడింటికి సమాన అవకాశాలు ఉండటం, అగ్రశ్రేణి జట్ల మధ్య సమరం కావడంతో సెమీస్ చేరే రెండు జట్లు లేవన్నది చెప్పడం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితులలో విండీస్ ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఆతిథ్య జట్టును సెమీస్ చేర్చడం ఎలా అన్నది మానుకొని.. ప్రపంచకప్‌ గెలవడమే తమ లక్ష్యమని రోస్టన్ చేజ్ గంభీరాలు పలికాడు. ఆ క్రమంలో ఎంతటి జట్టునైనా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 

 కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో చేజ్(19/3) కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో బార్బడోస్‌లో జన్మించిన ఈ విండీస్ ఆల్‌రౌండర్.. సొంతగడ్డపై స్నేహితులు, కుటుంబ సభ్యుల ముందు ఈ ప్రదర్శన చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

ఎవరినైనా ఓడిస్తాం..

"నా బెస్ట్ ఫిగర్స్.. స్నేహితులు, కుటుంబ సభ్యులందరి నడుమ చేయడం ఒక గొప్ప అనుభూతినిస్తోంది. క్రికెట్ ఆడటానికి ఇదొక గొప్ప ప్రదేశం. సొంత అభిమానులు చుట్టూ ఉంటారు. ఈ ప్రపంచ కప్‌ గెలవడమే మా లక్ష్యం, ఆ క్రమంలో ఎవరినైనా ఓడిస్తాం.." అని చేజ్ అన్నాడు. 

విండీస్ సెమీస్ చేరే మార్గమిదే..!

అమెరికాపై భారీ విజయంతో సెమీస్‌లో చోటు ద‌క్కించుకునే అవ‌కాశాన్ని విండీస్ ప‌దిలం చేసుకుంది. చాలా వేగంగా లక్ష్యాన్ని ఛేదించడం వ‌ల్ల విండీస్ నెట్ ర‌న్ రేట్(+1.814).. సౌతాఫ్రికా కంటే మెరుగ్గా ఉన్నది. ఇప్పుడు వారు చేయాల్సిందల్లా.. దక్షిణాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్‌లో గెలవడం. మెరుగైన ర‌న్ రేట్ ఉన్న కారణంగా గెలిస్తే చాలు.. గట్టెక్కచ్చు. అదే సఫారీ జట్టు చేతిలో ఓడితే.. అప్పుడు అమెరికా- ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో బట్లర్ సేన ఓడిపోవాలని కోరుకోవాలి.