ఒలింపిక్ మెడల్ బరిలో మన బిడ్డలు

ఒలింపిక్ మెడల్ బరిలో మన బిడ్డలు
  • ఒలింపిక్ మెడల్ వేటలో  నిఖత్, ఇషా, శ్రీజ
  • తొలిసారి పోటీపడుతున్న తెలంగాణ అమ్మాయిలు 
  • రేపటి నుంచే పారిస్ గేమ్స్‌‌‌‌
  • జులై 28 తొలి రౌండ్స్ –సా. 4.06 నుంచి
  • ఆగస్టు 10  ఫైనల్ – అ. రాత్రి 1.17 నుంచి

టీటీలో మేటి

ఒలింపిక్స్‌‌‌‌లో ఇండియా టేబుల్‌‌‌‌ టెన్నిస్ టీమ్ ఇప్పటిదాకా ఒక్క మెడల్‌‌‌‌ కూడా నెగ్గలేదు. ఈసారి ఆ లోటు తీరుతుందని అంతా భావిస్తున్నారు. ఇందుకు కారణం ఆరుగురితో కూడిన టీటీ జట్టులో హైదరాబాదీ ఆకుల శ్రీజ ఉండటమే.  సింగిల్స్‌‌‌‌తో పాటు విమెన్స్ టీమ్ ఈవెంట్‌‌‌‌లోనూ   శ్రీజ పారిస్ బెర్తు దక్కించుకుంది. గత రెండేండ్ల నుంచి తను  సూపర్ ఫామ్‌‌‌‌లో దూసుకెళ్తోంది.

 2022 కామన్వెల్త్ గేమ్స్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌ డబుల్స్‌‌‌‌లో శరత్‌‌‌‌ కమల్‌‌‌‌తో కలిసి గోల్డ్ నెగ్గిన తర్వాత ఆమెకు ఎదురేలేకుండా 2024లో శ్రీజ కెరీర్‌‌‌‌‌‌‌‌ పతాక స్థాయికి చేరుకుంది. ఏప్రిల్‌‌‌‌లో వరల్డ్ నం. 38వ ర్యాంక్‌‌‌‌ అందుకున్న ఆమె ఇండియా నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌ టీటీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. టెక్సాస్‌‌‌‌లో డబ్ల్యూటీటీ ఫీడర్ కార్సస్‌‌‌‌లో సింగిల్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌తో ఈ సీజన్‌‌‌‌ను ఆరంభించిన ఆమె మార్చిలో మరో డబ్ల్యూటీటీ ఫీడర్‌‌‌‌‌‌‌‌ టైటిల్ గెలిచింది. జూన్‌‌‌‌లో డబ్ల్యూటీటీ కంటెండర్ టైటిల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌‌‌గా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో  వరల్డ్ ర్యాంకింగ్స్‌‌‌‌లో 24వ స్థానానికి చేరుకున్న శ్రీజ అదే జోరును ఒలింపిక్స్‌‌‌‌లోనూ కొనసాగించి టీటీలో దేశానికి తొలి పతకం అందిస్తుందేమో చూడాలి. 

గోల్డెన్‌‌‌‌ పంచ్‌‌‌‌ కోసం

వరుసగా రెండుసార్లు వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా నిలిచి ఇండియాలోనే కాకుండా వరల్డ్ బాక్సింగ్‌‌‌‌లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మన హైదరాబాదీ నిఖత్ జరీన్‌‌‌‌.  అథ్లెట్ కాబోయి బాక్సింగ్ రింగ్‌‌‌‌లోకి అడుగు పెట్టిన నిఖత్ అంచెలంచెలుగా ఎదిగింది. ముస్లిం కుటుంబంలో పుట్టిన జరీన్‌‌‌‌  అనేక అవాంతరాలు ఎదురైనా.. ఫ్యామిలీ సపోర్ట్‌‌‌‌తో ఈ ఆటలో రాటుదేలింది. నిజానికి టోక్యో ఒలింపిక్స్‌‌‌‌లోనే  పోటీ పడాలని 28 ఏండ్ల నిఖత్ కలలు కన్నది. 

కానీ, తన ఆరాధ్య బాక్సర్‌‌‌‌‌‌‌‌ మేరీకోమ్‌‌‌‌ కారణంగానే ఆమె కల చెదిరింది. నిఖత్‌‌‌‌ వెయిట్ కేటగిరీకి మారిన మేరీని నేరుగా ఒలింపిక్స్‌‌‌‌కు ఎంపిక చేయడం.. ఆమెతో ట్రయల్స్‌‌‌‌ నిర్వహించాలని హైదరాబాద్ బాక్సర్ డిమాండ్‌‌‌‌ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నాడు ట్రయల్స్‌‌‌‌లో ఓడి బెర్తు కోల్పోయిన నిఖత్ ఏమాత్రం నిరాశ చెందకుండా వెంటనే పారిస్‌‌‌‌పై ఫోకస్ పెట్టింది. ఆటపైనే ఏకాగ్రత పెట్టిన ఆమె పక్కా ప్లానింగ్‌‌‌‌తో   ట్రెయినింగ్ తీసుకుంటూ.. ఆడిన ప్రతీ టోర్నీలోనూ ప్రత్యర్థులపై పంచ్‌‌‌‌ల వర్షం కురిపించింది. 

ఈ క్రమంలో 2022, 2023లో వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్‌‌‌‌లోనూ గోల్డ్ మెడల్ సాధించింది. దాంతో ఈ మెగా గేమ్స్‌‌‌‌లో ఇండియా నుంచి ఆరుగురు బాక్సర్లు పోటీలో ఉండగా..  50 కేజీ  విభాగంలో నిఖత్ గోల్డ్ మెడల్‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. ఒలింపిక్స్‌‌‌‌లో ఇప్పటిదాకా బాక్సింగ్‌‌‌‌లో ఇండియాకు మూడు బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ వచ్చాయి. 2008లో విజేందర్ సింగ్‌‌‌‌, 2012లో మేరీకోమ్‌‌‌‌, గత ఎడిషన్‌‌‌‌లో లవ్లీనా బొర్గొహైన్‌‌‌‌ ఈ పతకాలు సాధించారు. నిఖత్ బంగారు పతకం గెలిస్తే ఒలింపిక్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ నెగ్గిన ఇండియన్‌‌‌‌ బాక్సర్‌‌‌‌‌‌‌‌గా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడున్న ఫామ్‌‌‌‌ను కొనసాగిస్తే నిఖత్ కచ్చితంగా మెడల్‌‌‌‌తో తిరిగి  రాగలదు.

టీనేజ్ సెన్సేషన్‌

ఇండియా షూటింగ్‌‌‌‌లో కొన్నేండ్ల నుంచి టీనేజ్‌‌‌‌ షూటర్ల హవా నడుస్తోంది. వారిలో మన హైదరాబాదీ ఇషా సింగ్‌‌‌‌ ముందుంది. 19 ఏండ్ల ఇషా సింగ్‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌, 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలో రెండేండ్ల నుంచి సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌ చేస్తోంది. రేసర్‌‌‌‌‌‌‌‌ అయిన తండ్రిని చూసి ఆటల్లోకి వచ్చిన ఇషా.. కార్టింగ్‌‌‌‌, బ్యాడ్మింటన్‌‌‌‌, టెన్నిస్‌‌‌‌ లాంటి  గేమ్స్‌‌‌‌ను ట్రై చేసి చివరకు షూటింగ్‌‌‌‌పై ఇష్టం పెంచుకుంది. 

13 ఏండ్ల వయసులో నేషనల్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్ గెలిచిన ఈ యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ 2022లో జూనియర్ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో మూడు గోల్డ్ మెడల్స్‌‌‌‌, ఓ సిల్వర్‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ గెలిచి ఔరా అనిపించింది.  అదే జోరును సీనియర్‌‌‌‌‌‌‌‌ విభాగంలోనూ కొనసాగించింది. 2022లోనే  జరిగిన ఆసియా గేమ్స్‌‌‌‌లో అద్భుతం చేసింది.  ఒక గోల్డ్‌‌‌‌ సహా ఏకంగా నాలుగు మెడల్స్‌‌‌‌ నెగ్గి రికార్డు సృష్టించింది. 25 మీటర్ల పిస్టల్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ అయిన ఇషా ఇదే ఈవెంట్‌లో తొలి ప్రయత్నంలోనే ఒలింపిక్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌గా నిలవాలని ఆశిస్తోంది. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటం.. పక్కన ఎంత బలమైన ప్రత్యర్థులు ఉన్నా ఏమాత్రం కంగారుపడకుండా టార్గెట్‌‌‌‌పై గురిపెట్టడం ఇషా సింగ్ బలం. 

జులై 27- సింగిల్స్ క్వాలిఫికేషన్, తొలి రౌండ్‌‌‌‌ సా. 6.30 నుంచి
ఆగస్టు 3 - సింగిల్స్‌‌ మెడల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు సా. 5 నుంచి
ఆగస్టు5 - విమెన్స్ టీమ్ తొలి రౌండ్‌‌‌‌  మ. 3.30 నుంచి
ఆగస్టు 10 - మెడల్ మ్యాచ్‌‌‌‌లు మ. 1.30 నుంచి