మన దేశ అడవి పండుగలు

కుంభమేళా మన దేశంలోని అతి పెద్ద హిందూ సంప్రదాయ వేడుక. ప్రతి పన్నెండేళ్లకోసారి జరిగే ఈ కుంభమేళాకి మన దేశం నుంచే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి వస్తారు. పుణ్య స్నానాలు ఆచరిస్తారు. దేశంలో జీవనదులైన గంగ, యమున, గోదావరి, కృష్ణ వంటి పన్నెండు నదులకు వచ్చే పుష్కరాలకు మరో రూపమే కుంభమేళా. సకల జీవరాశులకు నీళ్లే ఆధారం. అందుకే మనదేశంలో నది నీటికి, ముఖ్యంగా గంగానదికి ప్రాధాన్యం ఇస్తారు. హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతుంది. అవి 1. హరిద్వార్, 2. ప్రయాగ్ రాజ్ (అలహాబాద్​), 3.ఉజ్జయిని, 4. నాసిక్.  కుంభమేళా సందర్భంగా  పుణ్యస్నానాలు చేస్తే మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు.

కుంభమేళా విశిష్టత

కుంభం అంటే కుండ అని అర్థం. ఖగోళ శాస్త్రం ప్రకారం రాశి అనే అర్థం కూడా వస్తుంది. మేళా అంటే కలయిక లేదా జాతర అని అర్థం. కుంభ రాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీనికి కుంభమేళా అనే పేరు వచ్చింది. కుంభమేళా చరిత్ర ఇప్పటిది కాదు. వేదకాలం నుంచి కుంభమేళా నిర్వహిస్తున్నట్లు పెద్దలు చెబుతారు. పురాణాల్లో కూడా కుంభమేళా ప్రస్తావన ఉందంటారు. క్షీర సాగర మథనం ఫలితంగా వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో మోహినీ రూపంలో విష్ణువు వచ్చి, అమృతం ఉన్న కుండను తీసుకుని పోతుండగా హరిద్వార్, ప్రయాగ్ రాజ్, ఉజ్జయిని, నాసిక్ నగరాల్లో కొన్ని  అమృతపు చుక్కలు జారిపడ్డాయన్నది ఒక కథనం. అందుకే  ఈ నాలుగు ప్రాంతాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాను ‘పూర్ణ కుంభమేళా’ అని, ఆరేళ్లకోసారి జరిగే కుంభమేళాను  ‘అర్ధ కుంభమేళా’ అని పిలుస్తారు.  పురాణాల్లో అసలు అర్థ కుంభమేళా అనేదే లేదంటారు. ఈ సంగతి ఎలాగున్నా ఆరేళ్లకోసారి అర్థ కుంభమేళాలు కూడా  జరుపుకుంటున్నారు  భక్తులు.

కిందటేడాది ప్రయాగ్ రాజ్​లో కుంభమేళా

కిందటేడాది ప్రయాగ్ రాజ్​లో కుంభమేళా జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనిని అద్భుతంగా నిర్వహించింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన యాత్రీకులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది. ప్రముఖ సాధువులకు భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రామ్ నామ్ బ్యాంక్ అందరినీ ఆకట్టుకుంది.

ఆసియాలోనే అతి పెద్దది

తెలంగాణలో ప్రతి రెండేళ్లకు ఓసారి జరిగే మేడారం జాతరను కుంభమేళాతో పోలుస్తారు. సమ్మక్క–సారలమ్మల పేరుతో జరిగే ఈ జాతరను ‘తెలంగాణ కుంభమేళా’ అంటారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ఇది పేరు తెచ్చుకుంది. కేవలం నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు కోటిన్నర మంది వరకు భక్తులు వస్తున్నరు.

బోలెడు ప్రత్యేకతల మేడారం

కుంభమేళాకు ఉన్నట్లే  మేడారం జాతరకు కూడా బోలెడన్ని ప్రత్యేకతలున్నాయి. కోయదొరల సంప్రదాయాలు, ఆచారాలకు నిలువెత్తు సంతకంగా నిలుస్తుంది మేడారం జాతర. అమ్మవార్లయిన సమ్మక్క, సారలమ్మలకు ఇక్కడ విగ్రహాలుండవు. గద్దెలపైనే అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. బెల్లం మొక్కులు, ఎదుర్కోళ్లు, ఒడి బియ్యం మొక్కుల వంటి అనేక ప్రత్యేకతలు మేడారం జాతరకు ఉన్నాయి.

కుంభమేళాకు యునెస్కో గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కుంభమేళాకు 2017లో యునెస్కో గుర్తింపు లభించింది. కుంభమేళాను వారసత్వ సంస్కృతిగా యునెస్కో ప్రకటించింది. దక్షిణ కొరియాలో జరిగిన సమావేశంలో యునెస్కో ఈ నిర్ణయం తీసుకుంది. వారసత్వ సంస్కృతి కల్పించడానికి రూపొందించిన జాబితాలో మన దేశానికి చెందిన కుంభమేళాను కూడా చేర్చినట్లు యునెస్కో  ప్రకటించింది. ఇప్పటివరకు బోట్స్​వానా, కొలంబియా, వెనెజులా, మంగోలియా, మొరాకో, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​లో జరిగే వేడుకలకు మాత్రమే యునెస్కో గుర్తింపు ఉంది.

లక్షల్లో సాధువులు

కుంభమేళాకు ప్రధాన ఆకర్షణ నాగ సాధువులు, అఖాడాలు, సన్యాసులే. సహజంగా వీరు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉంటారు. కుంభమేళా జరిగే ముహూర్తానికి లక్షలాది మంది గుంపులు గుంపులుగా వస్తారు. పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఒళ్లంతా విభూది రాసుకుని మేళాకే  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.