మన సినిమాలు చైనాలో ఎక్కువ బిజినెస్​ చేస్తున్నయ్​

మన సినిమాలు చైనాలో ఎక్కువ బిజినెస్​ చేస్తున్నయ్​
  • థియేటర్లు తగ్గుతున్నయ్​
  • మన సినిమాలు చైనాలో ఎక్కువ బిజినెస్​ చేస్తున్నయ్​

ముంబై: మన దేశంలో సినిమా థియేటర్లు తగ్గిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. థియేటర్లు మూతపడుతుండడంతో మన సినిమాలు చైనాలో ఎక్కువ బిజినెస్​ చేస్తున్నాయని సీనియర్​ ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. మన సినిమాలు మన దేశంలోనే ఎక్కువ బిజినెస్​ చేసేలా చొరవ తీసుకోవల్సి ఉందని మినిస్ట్రీ ఆఫ్​ ఇన్ఫర్మేషన్​ అండ్​ బ్రాడ్​కాస్టింగ్​ (ఎంఐబీ) సెక్రటరీ అపూర్వ చంద్ర చెప్పారు. ఈ ట్రెండ్​ను రివర్స్​ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మీడియా, ఎంటర్​టెయిన్​మెంట్​పై  ఫిక్కి నిర్వహించిన ఈవెంట్లో అపూర్వ చంద్ర పాల్గొన్నారు. ఆరేళ్ల కిందట దేశంలో 12 వేల దాకా థియేటర్లు ఉండేవని, అవి ఇప్పుడు 8 వేలకి తగ్గిపోయాయని ఆయన చెప్పారు. ఇదే టైములో చైనాలోని ఫిల్మ్​ ఎగ్జిబిషన్​ హాల్స్​ సంఖ్య 10 వేల నుంచి ఏకంగా 70 వేలకి పెరగడాన్ని గమనించాలని పేర్కొన్నారు. మన సినిమాలు ఆ దేశంలో ఎక్కువ బిజినెస్​ చేయడానికి ఇదొక కారణమని చెబుతూ, ఈ ట్రెండ్​ను మనం రివర్స్​ చేయాలని సూచించారు. 

ఇందుకు దేశంలో మరిన్ని థియేటర్లు తెరవడమే సరయిన సొల్యూషన్​గా పేర్కొన్నారు. ఈ టాస్క్​ను దేశంలో కొత్తగా ఏర్పాటయిన ఫిల్మ్​ ఫెసిలిటేషన్​ ఆఫీస్​ (ఎఫ్ఎఫ్ఓ)కి ప్రభుత్వం అప్పచెబుతున్నట్లు అపూర్వ చంద్ర వెల్లడించారు. ఇన్వెస్ట్​ ఇండియా, నేషనల్​ సింగిల్​ విండో పోర్టల్​లతో కలిసి ఎఫ్​ఎఫ్​ఓ ఇందుకోసం పనిచేస్తుందన్నారు. థియేటర్​ ఏర్పాటు చేయడం అంటే ఒక ఇండస్ట్రీ నెలకొల్పడం లాంటిదేనని ఆయన పేర్కొన్నారు. 10 లక్షల మంది జనాభా ఉన్న  మాల్దా (వెస్ట్​ బెంగాల్​)లో ఒక్క థియేటర్​ కూడా లేకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ప్రభుత్వ చొరవతో కర్నాటకలోని చిన్న సిటీలలో గత నాలుగు నెలలలో కొత్తగా ఆరు థియేటర్లు ఏర్పాటయ్యాయని , మరిన్ని రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.   కిందటి వారాంతంలో రూ. 75 టికెట్​ ఆఫర్​ చాలా మందిని ఆకట్టుకుందని, మార్నింగ్​ షోలకు సైతం జనం ఎగబడ్డారని పేర్కొన్నారు. సినిమా టికెట్ల రేట్లు సమంజసమైనవిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు అపూర్వ చంద్ర చెప్పారు. సినిమా ఎగ్జిబిషన్​ ఇండస్ట్రీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. 

సినిమాటోగ్రఫీ యాక్టుకు సవరణలు...

రాబోయే శీతాకాలపు పార్లమెంట్​ సమావేశాలలో సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు తేనున్నట్లు కూడా సెక్రటరీ వెల్లడించారు. ముంబైలోని ఫిల్మ్​ మేకర్లతో ఈ దిశగా సోమవారం చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. పైరసీ అరికట్టడంతోపాటు, యూ/ఏ సర్టిఫికేషన్​ ఏజ్​ మార్పు విషయంలోనూ మార్పులను ఆ వర్గాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.  ఐటీ ఇండస్ట్రీలాగే యానిమేషన్​, విజువల్​ ఎఫెక్ట్స్​, గేమింగ్​ అండ్​ కామిక్స్​ (ఏవీజీసీ) కూడా మన దేశంలో పెద్ద రివల్యూషన్​ తేగలదని అపూర్వ చంద్ర అభిప్రాయపడ్డారు. గత అయిదు, ఆరేళ్లుగా డిస్కషన్స్​ జరుగుతున్నా ఈ రంగాల కోసం సెంటర్​ ఆఫ్​ ఎక్స్​లెన్స్​ ఇంకా ఏర్పాటు కాలేదన్నారు. దీని ఏర్పాటుపై కేంద్రం సీరియస్​ఉందని, ఇందులో 48 శాతం వాటా తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, మిగిలిన 52 శాతాన్ని ఫిక్కి, సీఐఐలు తీసుకుంటాయని చెప్పారు.