- టైంకు జీతాలు చెల్లిస్తున్నాం
- ఐఎన్టీయూసీ సదస్సులో మంత్రి సీతక్క
బషీర్ బాగ్, వెలుగు: గత ప్రభుత్వం కార్మికులను చిన్నచూపు చూసిందని పంచాయతీ రాజ్, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిరుద్యోగులను మాజీ సీఎం కేసీఆర్ వాడుకుని వదిలేశారని ఫైరయ్యారు. రవీంద్ర భారతిలో శనివారం నిర్వహించిన ఐఎన్టీయూసీ రాష్ట్ర సదస్సుకు సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.తమది కర్షక, కార్మిక, ఉద్యోగ ప్రభుత్వం అని అన్నారు. తన శాఖల పరిధిలోని కార్మిక సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే జాప్యం లేకుండా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీతో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆ రోజుల్లో పీజేఆర్, సంజీవ రెడ్డి వేరువేరుగా కార్మికుల కోసం పోరాటం చేసినా వారిద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని గుర్తుచేశారు. ఐఎన్టీటీయూ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనక్ ప్రసాద్, పలువురు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.