మా కొమురెల్లి మల్లన్నను మాకు ఇయ్యాల్సిందే : ఇమ్మిడి మహేందర్

‘మా కొమురెల్లి మల్లన్నను మాకు ఇయ్యుర్రి’ అంటే.. ‘ఈ మాట ఒక ధిక్కారం. మా దేవుడు అంటే ఏమిటి? దేవుడికి కులం అంటగడుతున్నారా? దైవానికి పరిధి, పరిమితులు నిర్ణయిస్తారా? సర్వాంతర్యామి అయిన దేవుడు మీ వాడు ఎలా అవుతాడు?’ వంటి ప్రశ్నలు పండితోత్తముల మెదళ్లలో మొలవవచ్చు. తప్పులేదు. మీ బుర్రలు ఏనాడో కులం రొచ్చులో పడి మునిగి, నేడు తేలుతున్నాయి. మా దేవుడు అంటున్నామంటే దీని వెనకాల వేల ఏండ్ల సాంస్కృతిక చైతన్యం, జాతి వికాసాలు నిర్మాణం అయి ఉన్నాయి. మాదైన బహుజన తాత్విక నేపథ్యం ఉన్నది. నేడు దాన్ని కొంత మంది నాశనం చేస్తున్నారు. అందుకే ఈ ధిక్కారం. 

నా ఇంట్లో నీ పెత్తనం ఏంది?

సాంస్కృతికంగా బహుజనుల అస్తిత్వాన్ని దెబ్బదీసే కుట్ర చాలా బలంగా జరుగుతున్నది. దీనికి ప్రధాన సాక్ష్యం. కురుమ, గొల్లలు సమస్త బహుజన కులాల దేవుడిగా కొలిచే కొమురవెల్లి మల్లన్న లగ్గం దగ్గర జరుగుతున్న పరిణామాలే. వేల ఏండ్లుగా మల్లన్నను పూజించే పద్ధతులను కాదని, ఆగమ శాస్త్ర పద్ధతుల్లో లగ్గాన్ని నిర్వహిస్తున్నారు. పుసుపు బండారితో, ప్రధాన మండపంలో పట్నాల మధ్యలో జరగాల్సిన మల్లన్న లగ్గాన్ని బ్రాహ్మణీయ పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. ఒగ్గు కథా గేయాలు, డోలు, నపీర శబ్దాల మధ్య అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమాన్ని సింగారి మేళం, లక్ష బిల్వార్చనల పేరుతో నిర్వహిస్తూ ఒగ్గు సంప్రదాయాన్ని నాశనం చేస్తున్నారు. ఒగ్గు కళాకారులను తాగుబోతులుగా, డబ్బులకు ఆశపడే వారిగా చిత్రీకరించారు. అక్కడి గోడలపై డబ్బులు ఇవ్వరాదని రాశారు. ఇది గొల్ల, కురుమ కళాకారులను అగౌరవ పరచడమే. నా ఇంట్లో నీ పెత్తనం ఏందనే ప్రశ్నలకు అక్కడి వేద శాస్త్రాల పురోహితులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆగమ శాస్త్ర పండితులు మల్లన్న లగ్గం చేస్తున్నప్పటి నుంచి కుర్మ, గొల్లలకు కలిసి రావడం లేదనే మాటలు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. మందలు తగ్గిపోయి నష్టాలు వస్తున్నాయి. మంద రోగాల బారిన పడుతున్నది. ఆర్థికంగా నష్టపోతున్నాం. రాజకీయంగా బలంగా తయారైతలేము వంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే “మాకు కలిసొస్తలేదు మా దేవున్ని మాకు ఇచ్చేయుర్రి – మేము పూజించుకుంటాం” అనే ధిక్కారాలు ప్రారంభమయ్యాయి. ఇది ఒక సాంస్కృతిక ధిక్కారం. మమ్మల్ని కాదని, మా పద్ధతులను కాదని కొమురెల్లి మల్లన్న లగ్గం చేయడాన్ని ఏ విధంగా చూడాలి. నా ఇంట్లో నీ పెత్తనం ఏంది?

నా ఇంట్లకెళ్లి బయటకు వెళ్లి మాట్లాడు..

ఈ విషయంలో ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. గొల్ల, కురుమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే, సాంస్కృతికంగా మమ్మల్ని అణిచివేసే చర్యలకు సర్కారు కూడా ఊతమిస్తున్నది. గొర్లు, బర్లు ఇస్తున్నామంటూ నమ్మబలికి మా గొంతులను కోసే చర్యలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వానికి గొల్ల, కురుమలపై చిత్తశుద్ధి లేదు. కొమురెల్లి మల్లన్న లగ్గం నిర్వహణలో మా ప్రాతినిధ్యాన్ని ప్రశ్నిస్తున్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం కండ్ల ముందర కనిపిస్తున్న నగ్న సత్యం. కురుమ, గొల్ల ప్రజా ప్రతినిధులు వారి సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించకుండా బ్రాహ్మణవాద తొత్తులుగా పనిచేస్తున్నారు. అక్కడి గోడలపై “ఒగ్గు పూజారులకు డబ్బులు ఇవ్వరాదు” అనే రాతల్లో ఈ ప్రజా ప్రతినిధులు కూడా ఒక భాగమే. ఎందుకంటే వారి సామాజిక వర్గాల ప్రజలనే దొంగలంటూ వేలు చూపిస్తుంటే.. చేవ చచ్చిన మనుషులోలె ప్రవర్తిస్తున్నారు. నా ఇంట్లోనే నేను దొంగను ఎట్లయిన్నో, బాపనోళ్ల హారతి కంచాల్లో డబ్బులు వేయనిదే శఠగోపం మనస్ఫూర్తిగా పెట్టని తత్వం ఎలానో బయట పడాల్సిన అవసరం వచ్చింది. ఇవే రాతలు బ్రాహ్మణులకు డబ్బులు ఇవ్వరాదని ఏ తిరుపతిలోనో, యాదగిరి గుట్ట దగ్గరనో, వేములవాడ రాజన్న సన్నిధిలో ఎందుకు రాయరు? దేవాలయాల దగ్గర బహుజన పూజారులు అంటే అంత చులకన భావం ఉంది. ఇప్పుడు ఈ ధిక్కారం కొమురెల్లిలో “నా ఇంట్లకెళ్లి బయటకు వెళ్లి మాట్లాడు” అనే ప్రశ్నతోనే ప్రారంభం కావాలి.

ఇది సాంస్కృతిక కుట్రనే..

నేడు కుల, మతాలు మనిషి జీవితాన్ని లోతుగా ప్రభావితం చేస్తున్నాయి. ఇది ఆరోగ్యకర పరిస్థితి కాదు. మతం వ్యక్తిగత విషయమైనప్పటికీ అది సామాజిక, రాజకీయ పరిస్థితులను నిర్ణయిస్తుంది. భారతదేశంలో ఎన్నడూ లేని పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. ఏకోన్ముఖ భావాలు ప్రబలుతున్నాయి. బయటకు మంచిగా కన్పిస్తున్నప్పటికీ కడుపులో కత్తెర్లు పెట్టుకొని, నోట్లో బెల్లం వేసుకున్న తీరు కనిపిస్తున్నది. భారతదేశ మౌలికత్వాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్నటువంటి రాజకీయ, సాంస్కృతిక కుట్ర ఇది. ఈ కుట్ర భిన్న సంస్కృతులను, ఏక సంస్కృతిగా భ్రమింపజేస్తున్నది. దీనిలో భాగమే బహుజన దేవుండ్లను కూడా బ్రాహ్మణీకరించడం.

గ్రామ దేవతల కాడా మీరేనా?

నిచ్చెనమెట్ల సమాజంలో మా మాటలను, అల్లిక వారసత్వాలను గౌరవించిన కాలం భూతద్దం వేసి వెతికినా దొరకదు. చరిత్ర పుటల్లో మావి గొల్ల సుద్దులు. శూద్రుల పేరుతో ప్రధాన స్రవంతికి దూరంగా ఉంచారు. ప్రతి మనిషికి, గుంపుకి సామాజికార్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యాలు ఉంటాయి. మా జీవన మార్గాల్లోనే దేవుండ్లు పుట్టారు. మా దేవుళ్లు ఏ వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో కనిపించరు. ఏ ఇతిహాసాల్లో మాతో ఉన్నట్టు అగుపడరు. మాతో పుట్టి, మా తోనే ఉన్నారు. ఇప్పుడు మా దేవుణ్ని మాకు దూరం చేస్తున్నారు. మేము దేవుండ్లను పూజించే పద్ధతులను కాదని, మా జాతులను నాశనం చేస్తున్నారు. ప్రజలను, అందునా ప్రత్యేక సాంస్కృతిక పద్ధతులు కలిగిన దేవుండ్లను, వారి పూజారులను అంటరాని తనానికి గురిచేసి, బ్రాహ్మణ పూజా పద్ధతులనే ఉన్నతమైనవని చిత్రీకరించడం నేడు ప్రబలంగా పెరుగుతున్నది.  గ్రామాల్లో బొడ్రాయి పండుగను హోమాల పేరుతో శక్తి పీఠాల పూజారులను తెచ్చి గ్రామ బైండ్ల పూజారుల కడుపులు కొట్టారు. పోశమ్మ, ఎల్లమ్మ, మైసమ్మల దగ్గరికి బ్రాహ్మణ పుజారులు వచ్చారు. భక్తులకు, తల్లులకు మధ్య అడ్డుగోడలయ్యారు. ఇలాంటి పరిస్థితులు మమ్మల్ని మాకు, మా సంస్కృతులకు దూరం చేస్తున్నాయి. మా ఇంట్ల పుట్టిన దేవుండ్లను కూడా మాకు దూరం చేస్తున్నారు. మా బీరప్ప లింగాలకు బదులుగా విగ్రహాలను సృష్టించారు. వేల ఏండ్లుగా మేము నిర్మాణం చేసుకున్న చరిత్రను మా చేతే నిర్వీర్యం చేయిస్తున్నారు.
- ఇమ్మిడి మహేందర్, రీసెర్చ్ స్కాలర్, ఓయూ