మా భూములు మాకేనని... సర్కారుపై రైతుల భూపోరాటం

  • నేదునూరు , తోటపల్లి రిజర్వాయర్ల కోసం తీసుకున్న భూములు తిరిగివ్వాలని డిమాండ్
  • నాడు అగ్గువకు తీసుకున్న సర్కారు
  • ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో అమ్మేందుకు రెడీ

కరీంనగర్, వెలుగు: పదహారేండ్ల క్రితం రిజర్వాయర్ కడతామని, పవర్ ప్లాంట్ పెడతామని అడిగితే  కరీంనగర్​జిల్లాలోని ఆరు గ్రామాల రైతులు సుమారు 2 వేల ఎకరాలు ఇచ్చారు. కానీ అప్పటి సర్కార్ ఆ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టలేదు. కేవలం ప్రారంభోత్సవాలతోనే సరిపెట్టింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా వచ్చిన ప్రభుత్వం రిజర్వాయర్ కట్టింది లేదు.. ప్లాంట్ నిర్మించింది లేదు. దీంతో ఏండ్ల తరబడి ఆ భూములు సాగుకు నోచుకోక పడావు పడ్డాయి. అప్పుడు అగ్గువకే భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు అవే భూములను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం ఇచ్చేందుకు రెడీ కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  సర్కార్ ఏ లక్ష్యం కోసమైతే భూములు సేకరించిందో..ఆ లక్ష్యం నెరవేరనందున ‘మా భూములు మాకే ఇవ్వండి’ అంటూ నిర్వాసిత రైతులు ప్రభుత్వాన్ని డిమాడ్ చేస్తున్నారు.  

తోటపల్లి రిజర్వాయర్ కోసం1603 ఎకరాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి, చిగురుమామిడి మండలాల పరిధిలో1.75 టీఎంసీల సామర్థ్యంతో తోటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా గౌరవెల్లి, అక్కడి నుంచి గండిపెల్లి రిజర్వాయర్లకు నీరందించాలని 2008లోనే అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం నిర్ణయించింది. రూ.131.68 కోట్లతో పనులను మెసర్స్ వారిగేట్స్ కంపెనీకి అప్పగించింది. అగ్రిమెంట్ ప్రకారం 2015 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ కోసం  3,830 ఎకరాల భూములు సేకరించాల్సి ఉండగా చిగురుమామిడి మండలం వరికోలు, నారాయణపూర్, బెజ్జంకి మండలం తోటపల్లి, గాగిల్లాపూర్, కోహెడ మండలం రామచంద్రపూర్ గ్రామాల రైతుల నుంచి 1603 ఎకరాలు సేకరించారు. అప్పట్లో ఎకరానికి రూ.2.10 లక్షలు మాత్రమే పరిహారంగా చెల్లించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో ఈ ప్రాజెక్టును రద్దు చేసింది. దీంతో అప్పటికే105 ఎకరాల్లో తవ్వించిన మిడ్ మానేరు లింక్ కెనాల్స్ పోగా.. మిగతా భూములు పడావుపడ్డాయి.  

నేదునూరులో రెండు తరాల రైతులు నిర్వాసితులే..

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని నేదునూరు, లక్ష్మీదేవిపల్లి, గొల్లపల్లి గ్రామాల రైతులు 1980లో ఎల్ఎండీ రిజర్వాయర్ నిర్మాణంతో నిర్వాసితులయ్యారు.  మళ్లీ ఆ రైతులే నేదునూరులో గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయారు. 2008లో 160 మంది రైతులు 436 ఎకరాల భూములు సర్కారుకు అప్పగించాల్సి వచ్చింది. భూములు ఇవ్వబోమంటూ 2007లో  ఏడాదిపాటు రైతులు ఉద్యమం చేసినప్పటికీ పవర్ ప్లాంట్ వస్తే గ్రామంలో యువతకు ఉపాధి లభిస్తుందని, భూములు కోల్పోయిన కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగాలు వస్తాయని, ఇండ్లకు కూడా నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఒప్పుకున్నారు. నీటి వసతి కలిగిన భూమికి ఎకరానికి 2.80 లక్షలు, వర్షాధార భూములకు రూ.2 లక్షలు ప్రభుత్వం చెల్లించింది. అప్పటికే పొరుగు గ్రామాల్లో ఎకరాకు రూ.4 లక్షల వరకు ఉండడంతో భూములు కోల్పోయిన చాలా మంది  రైతులు మళ్లీ భూములు కొనలేకపోయారు. రెండేండ్ల తర్వాత 2010లో అప్పటి సీఎం రోశయ్య 2010లో గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం పైలాన్ ఆవిష్కరించారు. పైలాన్ తప్పా ఆ భూముల్లో గత 13 ఏండ్లలో ప్లాంట్ నిర్మాణానికి పునాది కూడా తీయలేదు. దీంతో కొందరు ఆ  భూముల్లో వ్యవసాయం చేసుకుంటుండగా.. మరికొన్ని భూములు బీళ్లుగా మిగిలాయి. జెన్ కో పవర్ ప్లాంట్ పెట్టనందు వల్ల తమ భూములు తమకే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా సర్కార్ మార్కెట్ వాల్యూను బట్టి డబ్బులు చెల్లిస్తామంటున్నారు.

మా భూములు మాకియ్యలే

ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్ట్ అవుతుందని రైతులంతా సంబరపడ్డరు. దీంతో నేను తోటపల్లి రిజర్వాయర్ కోసం రైతులను ఒప్పించాను. కానీ, తెలంగాణ వచ్చాక హరీశ్​రావు ఈ ప్రాజెక్ట్ రద్దు చేసి వారికి అనుకూలమైన రంగనాయక సాగర్, అనంత సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు కట్టించాడు. పోనియ్​..మా భూములు మాకే ఇస్తరనుకుంటే ఇవ్వలే. మేం ఇచ్చిన భూముల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, కెమికల్ ఫ్యాక్టరీ పెడతమంటున్నరు. ఊరుకునే ప్రసక్తి లేదు.      

- సెట్టి సుధాకర్, మాజీ సర్పంచ్

అసెంబ్లీలో తప్పు చెప్పిన్రు

మేం ఇది వరకే ఎస్సారెస్పీ కోసం కాల్వల కింద భూములు కోల్పోయినం. మళ్లీ జెన్ కో కోసం లాక్కున్నారు. భూములు ఇచ్చేది లేదని ధర్నాలు చేసినం. కానీ సర్కారు బెదిరించి లాక్కుంది. నీటి పారకం లేని భూములకు రూ.2 లక్షలు, ఉన్న వాటికి రూ.2.80 లక్షలు ఇచ్చిన్రు. ఇటీవల అసెంబ్లీలో మా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ రూ.ఐదారు లక్షలు ఇచ్చినట్లు చెప్పిన్రు.  ఇప్పుడీ భూములను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం తీసుకోవాలని చెప్తున్నరు. ఇది కరెక్ట్ కాదు. మా భూములు మాకివ్వాలి.

‌‌‌‌- నీలం రాజిరెడ్డి, రైతు, లక్ష్మీదేవిపల్లి

భూములు కోల్పోయి నష్టపోయినం

తోటపల్లి రిజర్వాయర్ కోసం మా భూములిచ్చినం. నాకున్న ఐదెకరాల భూమిని, మా కుటుంబసభ్యుల భూములు కూడా ఇచ్చిన్రు. ఇతర ప్రాజెక్టులతో పోలిస్తే మాకు పరిహారం చాలా తక్కువ ఇచ్చిన్రు. ప్రాజెక్ట్ రద్దు తర్వాత మాకు మంత్రి హరీశ్ రావు మార్కెట్ వాల్యూ చెల్లిస్తే భూమి తిరిగి ఇస్తామన్నరు. ఆ హామీ ఇచ్చి చాలాకాలమైంది. కానీ ఇప్పుడు సప్పుడు చేస్తలేరు. భూమి ఇవ్వకపోయినా మంచిదే మాకు ట్రిపుల్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. భూమిని కోల్పోయి ఉపాధినీ కోల్పోయినం. మాకు ఆధారం లేకుండా పోయింది.  

‌‌‌‌ - ముస్కు మహిపాల్ రెడ్డి, రైతు, ఓగులాపూర్