
- ఐదేళ్లలో ఎగుమతులు 37 శాతం అప్
- పసుపు ఉత్పత్తిలో నంబర్‌వన్
- మిర్చి సాగులో ,ఎగుమతుల్లో దేశంలోనే రెండో స్థానం
హైదరాబాద్, వెలుగు : పసుపు, మిర్చి వంటి మసాలా ఎగుమతుల్లో మన రాష్ట్రం ఏటా ఆశించిన స్థాయిలో గ్రోత్ సాధిస్తోంది. గడచిన ఐదేళ్లలో మసాలాల ఎగుమతులు 37 శాతం పెరిగాయని అంతర్జాతీయ ట్రేడ్ ఫైనాన్స్ కంపెనీ డ్రిప్ క్యాపిటల్ ఇంక్ రిపోర్టు వెల్లడించింది. ఇది ఇటీవలే భారతదేశపు మసాలాల ఎగుమతులపై కమోడిటీ ఎనాలసిస్ రిపోర్టును విడుదల చేసింది. అన్ని రకాల మసాలాల ఎగుమతులను గురించి ఇందులో చర్చించింది. ఈ రిపోర్టు ప్రకారం.. అంతర్జాతీయంగా మసాలా ఎగుమతి పరంగా అతి పెద్ద దేశం ఇండియా. పశ్చిమ కనుమలతో పాటుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకలోని కొండ ప్రాంతాలు దాదాపు భారతదేశంలో పండే పసుపులో 60శాతం ఉత్పత్తి చేస్తాయి. పసుపు ఉత్పత్తి పరంగా తెలంగాణ మొదటిస్థానంలో ఉంది. దేశంలోని పసుపుసాగులో మన రాష్ట్రానికి 30శాతం వాటా ఉంది. ఇక్కడి నుంచి భారీ ఎత్తున ఎగుమతులూ జరుగుతున్నాయి. మసాలాల ఎగుమతులు గత ఐదు సంవత్సరాలుగా అంటే2017 నుంచి 2021 ఆర్ధిక సంవత్సరం వరకూ 37శాతం సీఏజీఆర్ (వార్షిక పెరుగుదల) సాధించాయి. మిర్చి పంటను కూడా పెద్ద ఎత్తున ఎగుమతి చేశారు. భారతదేశంలో మిరప ఉత్పత్తి పరంగా రెండవ స్థానంలో తెలంగాణ ఉంది. మిరప సాగుకు అత్యంత అనుకూలమైన ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్నాయి. ఈ రెండు దక్షిణాది రాష్ట్రాలు 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు మిరప ఎగుమతులలో 60శాతంకు పైగా వాటాను సంపాదించుకున్నాయి. కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దేశపు మిరపసాగులో దాదాపు 25శాతం వాటాను దక్కించుకున్నాయి. కరోనా తరువాత ఆయుర్వేదానికి మరింత ఆదరణ పెరిగింది. ఆయుర్వేదంలో పసుపుకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలు బాగా ఉంటాయని చెబుతారు. అందుకే కరోనా టైంలో చాలా మంది పసుపును విరివిగా వాడటంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఎగుమతులు మరింత ఎక్కువయ్యాయని డ్రిప్ క్యాపిటల్ సీఈఓ/ఫౌండర్ పుష్కర్ ముకివార్ అన్నారు. ‘‘పసుపులోని ఔషధ గుణాలు ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తాయి.పసుపు కలిపిన మందులకూ పానీయాలకూ మనదేశ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయంగానూ డిమాండ్ పెరుగుతున్నది”అని ఆయన అన్నారు.