‘ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.. మార్పు అన్నది ఒక్కటి తప్ప’.. 2,500 ఏండ్ల క్రితం గ్రీక్ ఫిలాసఫర్ హెర్క్యులస్ చెప్పిన మాట ఇది. టైమ్, మనుషులు మారకుండా ఆపడం ఎవరి తరం కాదన్నది ఆయన ఉద్దేశం. ఈ విషయం లేటుగానైనా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిందే. ఏ లీడర్, ఏ రాజ్యమూ శాశ్వతం కాదు.. గ్రేట్ కింగ్ అశోకుడు, మొగల్స్ లాంటి వాళ్ల సామ్రాజ్యాలే కుప్పకూలిపోయాయి. అట్లనే ఎన్నికల్లో ఓడినా అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష పీఠం నుంచి దిగనని మొదట మొండికేసిన ట్రంప్
ఆ తర్వాత నెమ్మదిగా పదవి వదిలేందుకు సిద్ధపడ్డారు. జనవరి 20న ట్రంప్ ప్లేస్‌లో జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత్‌తో మంచి మిత్రుడిలా ఉన్న ట్రంప్ పోయి.. బైడెన్ రావడంపై మన వాళ్లలో కొంత ఆందోళన ఉంది. కానీ ఆసియాలో ఇండియా బలం అమెరికాకు అవసరం. కాబట్టి బైడెన్ కూడా మన దేశంతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నది పక్కనే ఉన్న పాకిస్థాన్, చైనాలే. ఈ రెండు దేశాల విషయంలో ట్రంప్ ఎప్పుడూ వ్యతిరేకంగానే పని చేశారు. పాకిస్థాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌ని అనేక సార్లు ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. జీహాదీ పేరుతో టెర్రర్ అటాక్స్ చేయడంపై చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. కొన్ని దేశాలపై బ్యాన్ కూడా విధించారు. ఎంత చెప్పినా టెర్రర్ యాక్టివిటీస్ ఆపలేదని పాకిస్థాన్‌కు అందించే ఫైనాన్షియల్ ప్యాకేజీని ఆపేశారు. చైనా విషయంలోనూ ట్రంప్ అదే తీరులో వ్యవహరించారు. సీరియస్‌గా ట్రేడ్ వార్ చేసే స్థాయి వరకూ వెళ్లారు. చైనాపై వాణిజ్య పరంగా అనేక ఆంక్షలు విధించారు. భారత్ సరిహద్దుల్లో చైనా ఆర్మీ బలగాలు దూకుడుగా వ్యవహరించడంపైనా ట్రంప్ తీవ్రంగా స్పందించారు. దురాక్రమణ ఆలోచనా ధోరణి సరికాదని చైనాను హెచ్చరించారు. చైనా – ఇండియా మధ్య బోర్డర్‌లో ఘర్షణ వాతావరణం నెలకొన్న టైమ్‌లో అమెరికా డిఫెన్స్, ఫారిన్ మినిస్టర్లు ఇండియా వచ్చి మిలటరీ ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా అనేక రకాలుగా ఇండియా ఫారిన్, డిఫెన్స్ పాలసీల్లో అమెరికా కలిసి వచ్చింది. ఒక్క ఇమిగ్రేషన్ పాలసీ విషయంలో తప్ప ట్రంప్ హయాంలో మనకు జరిగిన నష్టమేం లేదు. ఇప్పుడు బైడెన్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేదే ప్రశ్న. ముఖ్యంగా పాక్, చైనాల విషయంలో ఆయన తీరు ఎలా ఉంటుందన్న దాన్ని బట్టే ఇండియా – అమెరికా మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయి.
ట్రేడ్ పరంగా చైనా శత్రువే..
అమెరికా అధ్యక్షుడు మారినా ఇండియాతో ఆ దేశానికి ఉండే రిలేషన్స్‌లో ఏ మాత్రం మార్పు ఉండబోదు. ముఖ్యంగా చైనాను ట్రేడ్ పరంగా ఎప్పటికీ అమెరికా శత్రువుగానే చూస్తుంది. అమెరికా ప్రయోజనాల విషయంలో ఆ దేశంతో మాట్లాడి కొన్ని వాణిజ్య సమస్యలను బైడెన్ సెటిల్ చేసుకునే చాన్స్ ఉంది. అలా అని ట్రంప్ తీసుకున్న సీరియస్ నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం మాత్రం లేదు. అమెరికా కంపెనీలకు మేలు చేయడం, క్వాలిటీ లేని చైనా వస్తువులను తమ దేశంలో డంప్ కాకుండా చూసుకోవడం లాంటి విషయాల్లో సీరియస్‌గానే ఉంటారు. ఇక పాకిస్థాన్ విషయంలోనూ ప్రపంచంలోనే లీడింగ్ పవర్‌గా ఎదుగుతున్న ఇండియాను కాదని పక్కకు వెళ్లే చాన్స్ లేదు. ఎకానమీ సహా అనేక విషయాల్లో అమెరికాకు భారత్ అవసరం ఉంది. కాబట్టి పాక్‌ను కూడా బైడెన్ దగ్గరకు చేరనీయరు.
బైడెన్ రాక మనకు మరింత మేలు
ఆర్థిక పరంగా చూస్తే బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిలోకి రావడం ఇండియాకు మరింత మేలు చేసే విషయమే. ఐటీ, టెక్నాలజీ ట్రేడ్ మరింత పెరుగుతుంది. అలాగే ఇమిగ్రేషన్ పాలసీ విషయంలో ట్రంప్ విధించిన రిస్ట్రిక్షన్స్ ఎత్తేస్తానని బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. డాలర్ డ్రీమ్స్‌తో ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, యువతకు వీసాలు ఈజీగా వస్తాయి. ఏళ్ల తరబడి అమెరికాలో పని చేస్తూ గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న ఇండియన్స్ విషయంలోనూ బైడెన్ పాజిటివ్‌గా ఉన్నారు. ఇండియా నుంచి సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ పైనా ఆంక్షలను సడలించే చాన్స్ ఉంది.
బైడెన్ ఫారిన్ పాలసీ
అమెరికా ఫారిన్ పాలసీ విషయంలో దాని మిత్ర దేశాల ప్రభావం ఉంటుంది. అమెరికాకు ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటివి చైనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆ దేశాలన్నీ చైనాకు వ్యతిరేక పాలసీతో ఉండాలని అమెరికాను గతంలోనూ డిమాండ్ చేశాయి. ఆసియాలో చైనాను కంట్రోల్ చేయగలిగే సత్తా ఉన్న దేశం భారత్ మాత్రమే. దీంతో చైనాకు వ్యతిరేకంగా ఇండియాకు అనుకూలమైన ఫారిన్ పాలసీనే బైడెన్ కూడా ఫాలో అయ్యే చాన్స్ ఉంది. ఈ రకంగానూ ఇండియా బలం ఆయనకు అవసరం.
గుజరాత్ చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు నరేంద్రమోడీకి వీసా ఇవ్వడానికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అంగీకరించలేదు. కానీ, నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన రోజు ఒబామానే ఆయనకు ఫోన్ చేశారు. అమెరికా రావాలని ఆహ్వానించారు. బైడెన్‌కు ఈ పాత చరిత్ర మొత్తం తెలుసు. ఎందుకంటే ఒబామా టైంలో వైస్ ప్రెసిడెంట్ ఆయనే. అందువల్ల బైడెన్‌తో కూడా మనకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది.
బైడెన్, మోడీ ఇద్దరూ కొత్తేం కాదు
తమ మాటలు, పబ్లిక్ రిలేషన్స్ ద్వారా బిల్ క్లింటన్, బరాక్ ఒబామా మంచి గుడ్‌విల్ సంపాదించుకున్నారు. వాస్తవానికి ఏషియాలో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఉండాలని భావించడం వల్లే క్లింటన్, ఒబామా ఇండియాతో సన్నిహితంగా ఉన్నారు. 2014లో నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యే నాటికి అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా బైడెన్ ఉన్నారు. వారేంటో ఒకరికొకరు తెలుసు. అమెరికాలోని ఎన్ఆర్ఐల్లో మోడీకి ఎంతో సపోర్ట్ ఉందనే విషయం బైడెన్‌కు కూడా తెలుసు. యూఎస్ ఇండియన్ కమ్యూనిటీతో శత్రుత్వం పెట్టుకోవాలని బైడెన్ కోరుకోరు. అందుకే ఈ విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ విషయంలో మోడీ జాగ్రత్తగా వ్యవహరించినట్టే.. బైడెన్ కూడా ఉండాలి. అలాగే బైడెన్ విషయంలో కూడా మోడీ కూడా
కేర్‌ఫుల్‌గానే ఉండాలి.
స్ట్రాంగ్ ఇండియన్ ఎకానమీదే కీ రోల్
ఇండియాకు అత్యంత బలమైన అంశాలు ఎకానమీ, ఇంటలెక్చువల్ పవర్లే. అమెరికా నుంచి ప్లెయిన్స్, ఆయుధాలను కొనుగోలు చేసే అతి పెద్ద బయ్యర్ ఇండియానే. ఇండియాకు ప్రపంచం గౌరవం ఇవ్వాలంటే.. దాని ఎకానమీ తప్పకుండా అభివృద్ధి సాధించాలి. ప్రధాని నరేంద్రమోడీ తప్పకుండా ఎకానమీపై ఫోకస్ పెట్టాలి. ఇంగ్లండ్ మాజీ ప్రధాని లార్డ్ పాల్మర్‌స్టోన్ 200 ఏండ్ల క్రితం ‘‘దేశాలకు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. వాటికి పర్మినెంట్ ఇంట్రెస్ట్‌లు మాత్రమే ఉంటాయి”అని ఓ మాట చెప్పారు. అలాగే డబ్బులున్న వ్యక్తి ఎప్పుడు కూడా పేద వ్యక్తితో స్నేహం చేయడు. అందుకే ఇండియా తన ఎకానమీపై ఫోకస్ చేయాలి.-పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ అనలిస్ట్.
ఇవీ చదవండి
పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..
జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్ నెంబర్-2
నెట్ బౌలర్‌గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం