మన టీచింగ్​ మారాలె

టీచర్​ నిత్య విద్యార్థి. లోకం పోకడలకు అనుగుణంగా నూతన జ్ఞానాన్ని పొందుతూ టెక్నాలజీని అందిపుచ్చుకొని తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియను రక్తికట్టించాలి. భిన్న ఆర్థిక, సామాజిక మానసిక స్థాయి పిల్లల బృందాలను సమన్వయపరచాలి. విస్తృతమైన ప్రచార, ప్రసార సాధనాల మూలంగా ముందస్తు జ్ఞానంతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు బోధించడంలో ఉండే సవాళ్లను స్వీకరించగలిగి, సమయస్ఫూర్తితో తరగతి నిర్వహణను చేయగలిగే శక్తిసామర్థ్యాలను స్వయంగా పెంపొందించుకోగలగాలి. ఉపన్యాసం, ప్రదర్శన, చర్చ, ప్రయోగం, కృత్యాలు, ఆటాపాట, అభినయం, గానం, నాటకంతో పాటు నేటి మార్కెట్ లో పిల్లలకు అమితాసక్తి ఉన్న టెక్నాలజీ అంశాలను మేళవించి బోధించగలిగినపుడే టీచర్​ రాణించే పరిస్థితులున్న సందర్భమిది.

డిజిటలైజేషన్ ​దిశగా..

భారతీయ ప్రాచీన విద్యావిధానం నుంచి శ్రవణం నైపుణ్యానికి అధిక ప్రాధాన్యం దక్కింది. గణిత, ఖగోళ, జోతిష్య, వైద్యవిద్య, శస్త్రచికిత్సల్లో ఇంకా అనేక రంగాల్లో మనదేశం ప్రపంచ అగ్రగామిగా ఉన్నదన్నది చారిత్రక సత్యం. ఒక ఆశ్చర్యకర విషయమేమిటంటే విన్నదానికన్న చూసిన దాన్ని అభ్యాసకుడు సుమారు డెబ్బై శాతం అధికంగా గుర్తుంచుకోగలడన్న విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాల నేపథ్యంలోనూ, ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లు డిజిటలైజేషన్ కు మారుతున్న క్రమంలో, విద్యార్థులంతా ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆకర్షితులవుతూ వ్యసనానికి లోబడుతున్న తరుణంలో, విద్యార్థుల ఆసక్తిని చదువులపైకి మళ్లించాలనే సంకల్పంతో నేడు తెలంగాణలోని ప్రభుత్వ బడులన్నింటినీ డిజిటలైజేషన్ వైపు పరుగులు తీయిస్తున్న వైనం కనిపిస్తున్నది. ఇప్పటికే చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రొజెక్టర్లు, కంప్యూటర్ల ద్వారా విద్యార్థులకు డిజిటల్ విద్యను పరిచయం చేస్తున్నారు. ప్రభుత్వ బడులన్నీ డిజిటల్ దిశగా అడుగులేస్తున్నాయి. ఒక్క బోధనలోనే కాకుండా బయోమెట్రిక్ హాజరు, జియో ట్యాగింగ్ ముఖ గుర్తింపు హాజరు తదితర టెక్నాలజీలను ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టింది. సర్కారు బడులను మెరుగుపరుస్తూ అన్ని వర్గాల ప్రజలకు నాణ్యత, నవ్యత కలిగిన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. అందుకోసం ప్రపంచ వినూత్న బోధనాభ్యాసన పోకడల్ని తరగతి గదుల్లోకి దిగుమతి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

వివిధ దేశాల్లో ఇలా..

నేరుగా కండ్లతో చూసింది 83 శాతం స్మృతిలో ఉంటుందని, విన్నది11 శాతమేనని, జ్ఞానేంద్రియాలతో చేసిన అభ్యసనం 6 శాతం మాత్రమేనని మనోవికాస శాస్త్రవేత్తలు చెబుతున్న తరుణంలో తరగతి గదిలో మెరుగైన బోధనకు ఇతర రాష్ట్రాలు, దేశాలు అవలంబిస్తున్న  నూతన పోకడలను, అధునాతన టెక్నాలజీ లను  మనం కూడా అందిపుచ్చుకోవాలి.

 

  • దక్షిణ కొరియా దేశం ఇంగ్లీష్ టీచర్ల కొరతను ఎదుర్కొని రాబోవు తరాలను ప్రపంచ పోటీలో నిలపాలనే సంకల్పంతో ‘రోబోట్ టీచర్లు’ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. సందర్భాన్ని బట్టి ఇతర అంశాలకు వాడుకునే ఈ పరికరం ద్వారా విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది.
  • డెన్మార్క్ ప్రవేశపెట్టిన ‘ఫారెస్ట్ కిండర్ గార్డెన్’ అనే భావన విద్యార్థులకు ఒక సహజ వాతావరణాన్ని కల్పించి ఆసక్తులను రేకెత్తిస్తుంది. తరగతి గదిలో కూర్చొని నేర్చుకున్న అంశాల కన్నా స్వయంగా, జట్టులుగా ప్రయోగాత్మక అభ్యసనానికి ఈ విధానం దోహదపడుతుంది.
  • విశ్వవిద్యాలయ విద్య తలసరిగా బోలెడు భారాన్ని మోపుతుందని తలచి జర్మనీ ప్రవేశపెట్టిన ఉచిత విశ్వ విద్యాలయ విద్య ప్రస్తుతం అసందర్భమే అయినా విద్యాభివృద్దే జాతి నిర్మాణమనే కోణంలో పరిగణించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రవేశపెట్టిన ‘3డీ అభ్యసనం’ నేటి ప్రపంచ ట్రేడింగ్ విధానంగా పరిగణించాలి. తరగతిలోని పిల్లలందరూ 3డీ కళ్లజోడును ధరించి మానవ మెదడు హోలోగ్రామ్ లేదా సౌర కుటుంబంలోని గ్రహాలను దగ్గరగా వీక్షించే ఒక సరికొత్త అనుభవం ఊహించడానికే చాలా తమాషాగా ఉన్నది. తరగతి గదులన్నీ అత్యంత వేగవంతమైన ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ కి అనుసంధానమై ఉండటం ఇందులో ఉన్న ప్రత్యేకత. విద్యార్థుల ఆసక్తి గురించి, విషయాలు అవగాహన అయ్యే స్థాయిని గురించి గానీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమూర్త భావనలు అత్యంత సరళంగా అర్థమవుతాయి.
  • సంచలన విప్లవాల క్యూబాలో అక్షరాస్యత 50 శాతం ఉన్న విపరీత పరిస్థితుల్లో 1961 లో ఫిడేల్ క్యాస్ట్రో ప్రవేశపెట్టిన ఒక సైనికదళం లాంటి లిటరసీ బ్రిగేడ్స్ అనే విధానం కేవలం ఒకే ఒక సంవత్సరంలో  నిరక్షరాస్యతను 4 శాతానికి తీసుకురావడంతో ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ ఈ విధానాన్ని అనుసరించారు. 
  • ఫిన్ లాండ్ లోని ‘టీచర్ అనాటమీ’ అనేది ఒక కొత్త ప్రక్రియ. ఇంగ్లాండులోని ‘కాగిత రహిత తరగతి గదులు’ ఒక సంచలనాత్మక వినూత్న బోధనా విధానం. ఆపిల్ ఐ ట్యూన్ ‘యూ’ ద్వారా జరిగే ప్రసారంలో డిజిటల్ ప్రొజెక్టర్ల ద్వారా, ఐ ప్యాడ్ల ద్వారా నేర్చుకుని, స్వతహాగా డిజిటల్ పాఠాలను తయారుచేయగలిగే పరిజ్ఞానాన్ని విద్యార్థులు పొందడం ఇందులోని ప్రత్యేకత అందిపుచ్చుకోవాలి


ప్రపంచ ఏడు వింతల్లాగా ప్రస్తుతం చలామణిలో ఉన్న ఏడు వినూత్న బోధనా పద్ధతులను పరీక్షిస్తే ఇప్పుడిప్పుడే మన బడుల్లోకి అడుగిడుతున్న డిజిటల్ విధానం స్థానంలో ప్రతిక్షేపించే విధానాన్ని లేదా మరో నూతన ఆవిష్కరణ కోసం మన మస్తిష్కాలకు పదునుపెట్టాల్సిన అవసరం ఉన్నది. హామీల గుట్టల అడుగున పడ్డ విద్యావ్యవస్థ ఆనవాళ్లను వెతికి ప్రభుత్వం ప్రక్షాళనకు పూనుకోవాలి. ఇటీవల బెంగుళూరు లో ఒక కార్పొరేట్ స్కూల్ లో ప్రవేశపెట్టిన ‘రోబోటిక్ టీచర్’ వంటి టెక్నాలజీలను ప్రభుత్వం మన బడుల్లో ప్రవేశపెట్టి ఆ దిశగా ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ ఇవాల్సి ఉంది. వివిధ దేశాల్లో అమలు చేస్తున్న వినూత్న పోకడలను విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టి చాలీచాలని ఉపాధ్యాయుల సంఖ్యకు, బహుళ తరగతి బోధనకు స్వస్తి పలికిననాడే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుంది.


- ఏ.వి. సుధాకర్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు,  ఎస్టీయూటీఎస్