సామాజిక సమస్యగా నిరుద్యోగం

మనది పాక్షికంగా వ్యవసాయ దేశం. కొంతమంది వ్యవసాయ రంగంలో,   మరి కొంతమంది ప్రైవేట్, కార్పొరేట్‌‌, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులుగానే ఉన్నారు. అయితే రెండో పంచవర్ష ప్రణాళిక నుంచి దేశంలో పారిశ్రామిక రంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెరగడం..  రష్యా, అమెరికా, జర్మనీ వంటి దేశాల సహకారంతో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశారు.‌‌ దీంతో దేశంలో మరో నూతన వర్గంగా ఉద్యోగస్తులు, కార్మికుల పెరగటం,  పరిశ్రమలు ఏర్పాటుతో నూతన ఒరవడి సమాజంలో ఏర్పడింది.‌‌ ఈ క్రమంలో అక్షరాస్యత పెరిగింది. వ్యవసాయ రంగం వదిలి, పారిశ్రామిక రంగం వైపు ఎక్కువ మంది రావడంతో నిరుద్యోగం పెరగడం ప్రారంభమయ్యింది. 1977–78లో 2.6% గా ఉన్న నిరుద్యోగం 2017-–18 నాటికి 6.1 శాతానికి చేరింది. ప్రస్తుతం కనీవినీ ఎరుగని రీతిలో 9.1% నిరుద్యోగం రికార్డు అయ్యింది. వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం ఇండియాలో 15–-24 ఏండ్ల మధ్య వయస్సు గల వారిలో నిరుద్యోగం 21.01% గా ఉంది. ఇది చాలా ప్రమాదకరం. గత జనవరిలో బీహార్/ ఉత్తర ప్రదేశ్ అన్ స్కిల్డ్​ లేబర్ గా పనిచేయుటకు రైల్వే శాఖలో కేవలం 40,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి 12,50, 000 మంది అప్లై చేయడం చూస్తే, నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారో అర్థం అవుతోంది. ‌‌ మన ప్రభుత్వాలు మాత్రం ఉచిత ఆహారం ధాన్యాలు అందించడం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయడం ద్వారా నిరుద్యోగం కంట్రోల్‌‌ చేస్తున్నట్టు భావిస్తున్నాయి. ఈ భావన నుంచి బయటపడాలి. ముఖ్యంగా నిరుద్యోగ నిర్మూలనకు పారిశ్రామిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు చొరవ చూపాలి. అన్ని రంగాల్లో బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. అవినీతి పై విచారణ జరపాలి. ‌‌అందుకే యువత ‌‌‌‌‌‌‌‌‌‌తమ భవిష్యత్తు కోసం ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించాలి. లేకపోతే భవిష్యత్తులో నిరుద్యోగం స్టాటిస్టిక్స్ అంకెలు చిట్టాగా కాకుండా, సామాజిక సమస్యగా మారుతుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

- ఐ.ప్రసాదరావు, సోషల్​ యాక్టివిస్ట్​