ఫీల్డుకు వెళ్లకుండానే పిల్లల సర్వే.. ఔట్​ ఆఫ్ స్కూల్ సర్వేపై ఆఫీసర్ల నిర్లక్ష్యం

ఫీల్డుకు వెళ్లకుండానే పిల్లల సర్వే..  ఔట్​ ఆఫ్ స్కూల్ సర్వేపై ఆఫీసర్ల నిర్లక్ష్యం
  • ఆఫీసుల్లోనే కూర్చొని రాసుకున్న విద్యాశాఖ ఆఫీసర్లు, సీఆర్పీలు
  • పది రోజుల సర్వేలో గుర్తించింది 243 మందినే 
  • గత ఏడాది ఈ సంఖ్య 465
  •  సిటీలో బడికి వెళ్లని పిల్లలు వేల సంఖ్యలో.. 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో ప్రతి ఏటా నిర్వహించే ఔట్ ఆఫ్​ స్కూల్ చిల్డ్రన్​ సర్వేపై విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. బడికి వెళ్లని, చదువు మధ్యలో ఆపేసిన 6 నుంచి 19 ఏండ్ల మధ్య ఉన్న పిల్లల్ని గుర్తించి స్కూళ్లలో చేర్పించడం ఈ సర్వే ఉద్దేశం. బడుల్లో చేరిన పిల్లలకు స్పెషల్ క్లాసులు నిర్వహించి ఏ తరగతికి అర్హుడో గుర్తించి అందులో జాయిన్ చేస్తారు.

ఈ ఏడాది కూడా జనవరి 15 నుంచి 25వ తేదీ వరకు సర్వే నిర్వహించారు. అయితే, ఇందులో కేవలం 243 మంది పిల్లలను మాత్రమే గుర్తించినట్టు తెలుస్తోంది. సీఆర్​పీ(క్లస్టర్​రిసోర్స్ పర్సన్)తో నిర్వహించిన ఈ సర్వే ఫీల్డ్​కు వెళ్లకుండా చేయడంతోనే ఇలా జరిగిందన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

చేసినమా అంటే చేసినం..

జిల్లాలోని 24 మండలాల్లో 53 మంది సీఆర్పీలున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులుగా కొనసాగుతున్న వీరు మొన్నటి దాక సమ్మెలో ఉండడంతో డిసెంబర్ లో ప్రారంభం కావాల్సిన ఔట్​ఆఫ్​స్కూల్ చిల్డ్రన్​సర్వే జనవరిలో మొదలైంది. మిగతా జిల్లాల్లో కూడా ఈ నెల 12 నుంచే ప్రారంభం కాగా, హైదరాబాద్ లో మాత్రం15న షురూ చేశారు. ఈ నెల 25న కంప్లీట్​చేశారు. సర్వేలో భాగంగా 33 అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉంటుంది.

పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, స్వస్థలం, వృత్తి, పిల్లల్ని స్కూళ్లకు పంపకపోవడానికి కారణాలు, డ్రాపవుట్ అయితే రీజన్స్​, పర్మినెంట్ అడ్రస్, ఫోన్​నెంబర్​ ఇతర వివరాలు తెలుసుకుంటారు. అయితే, జిల్లాలోని క్లస్టర్ల పరిధిలో ఉండే సీఆర్​పీలు ఫీల్డ్​లెవెల్​లో సర్వే చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. సర్వేకు సంబంధించి రోజువారీ వివరాలు ప్రబంధ్​పోర్టల్​లో నమోదు చేయాల్సి ఉన్నా సైట్ అప్​డేట్ అవుతోందంటూ ఎంట్రీ చేయలేదని సమాచారం.

ఏదో ఒక చోటుకు వెళ్లి రెండు ఫొటోలు తీసి సంబంధిత అధికారికి వాట్సాప్​ చేసినట్టు తెలిసింది. ఈ పది రోజుల వ్యవధిలో కొన్ని క్లస్టర్లలో 10 మందిని కూడా గుర్తించలేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 243 మంది పిల్లలను గుర్తించామని అధికారులు చెప్తుండగా, గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య సగమే కావడం గమనార్హం. 

గతేడాది 465 మందే గుర్తింపు...

రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ జిల్లాలోనే జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఉపాధి కోసం వస్తుంటారు. ఇందులో ఎక్కువ శాతం కార్మికులే ఉండడంతో చాలా మంది తమ పిల్లలను స్కూళ్లలో జాయిన్​చేయించడానికి ఆసక్తి చూపించరు. మరికొంతమంది తమ పిల్లలను కూడా పనికి పంపుతుంటారు. బస్తీలు, కాలనీలు, ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో చదువుకోకుండా ఇంట్లో ఉండే పిల్లలు ఎంతోమంది ఉంటారు. 

ప్రతి ఏటా ఔట్ ఆఫ్​ స్కూల్ చిల్డ్రన్​సర్వే ను నిబద్ధతతో నిర్వహించకపోవడంతో పిల్లలు చదువులకు నోచుకోవడం లేదు. ప్రతి సంవత్సరం గుర్తిస్తున్న పిల్లల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్​లో బడికి పోని పిల్లల సంఖ్య భారీగానే ఉన్నా సర్వేలో లోపాల వల్లే తక్కువ సంఖ్యలో గుర్తిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, సీఆర్​పీలపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికైనా విద్యా ఉన్నతాధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టి బడికి పోని పిల్లల కోసం గడువు పెంచి సర్వే చేయాలని పలువురు కోరుతున్నారు.