డిఫెన్స్ అకాడమీలోనూ ఇంతేనా?

‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ ’ అంటే మామూలు సంస్థ కాదు. ప్రతి ఏడాది వందలాది మంది స్టూడెంట్లను ఉత్తమ సైనికాధికారులుగా తయారుచేసి ఇచ్చే  ప్రిస్టేజియస్ సంస్థ. అలాంటి అకాడమీ ప్రస్తుతం రకరకాల వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. మామూలు కాలేజీలు, యూనివర్శిటీలకు ఈ అకాడమీ ఏమాత్రం డిఫరెంట్ కాదన్న వాదన తెరమీదకు వస్తోంది. అకాడమీలో  జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసిన సంఘటనలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. అంతేకాదు ‘ క్రమశిక్షణ’ పేరుతో పెట్టిన హింసను తట్టుకోలేక కొంతమంది కేడెట్లు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా బయటకు వస్తున్నాయి. వీటన్నిటికి తోడు ప్రొఫెసర్ వంటి కీలక పోస్టులను డబ్బులకు అమ్ముకుంటున్న మెగా కుంభకోణాలు కూడా వెలుగు చూస్తున్నాయి.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల్లో భర్తీ అయ్యే కేడట్లకు ట్రైనింగ్ ఇచ్చే  ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’ ని 1954 లో మహారాష్ట్రలోని పుణే సమీపాన  ఖడక్ వాస్లా దగ్గర  ఏర్పాటు చేశారు. 65 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ లో  ఇప్పటివరకు  లక్షలాది మంది యువకులు సైన్యానికి అవసరమైన ట్రైనింగ్ తీసుకున్నారు.  తర్వాత సర్వీసులో చేరి మంచి పేరు తెచ్చుకున్నారు. కీలక పోస్టులు చేపట్టారు. ప్లస్ టూ ఎగ్జామ్ లో పాస్ అయిన వారు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి అకాడమీ లో చేరతారు. ఇక్కడి కేడట్లకు మూడేళ్ల కోర్సు ఉంటుంది. ఈ కోర్సు ను  పూర్తి చేసిన వారికి బీఏ లేదా బీఎస్సీ డిగ్రీ  ఇస్తారు.

ఆ వివాదాలేంటి?

మిలటరీకి అవసరమైన  మెరికల్లాంటి  సైనికులను తయారు చేయాల్సిన  నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రస్తుతం వివాదాలకు నిలయంగా మారింది. ఒకటి కాదు అనేక వివాదాలు అకాడమీ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయి. కుంభకోణాలు కూడా బయటపడుతున్నాయి. 1975 లో ఒక సీనియర్ కేడట్ ను కొంతమంది జూనియర్లు కూడబలుక్కుని హతమార్చిన సంఘటన వెలుగు చూసింది. ఆ తర్వాత ఒక జూనియర్ కేడట్ ను సీనియర్లు హాకీ స్టిక్  తో కొట్టిన ఇన్సిడెంట్ 2014 లో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. దీంతో  అకాడమీలో అంతా ఓకే కాదన్న విషయం బయటి ప్రపంచానికి తెలిసిపోయింది. జూనియర్లను ర్యాగింగ్ చేయడం, ట్రైనింగ్ పేరుతో రకరకాలుగా హింసకు గురి చేయడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నట్లు తెలిసింది. సీనియర్ల చేతుల్లో హింసకు గురైన వారు, ర్యాగింగ్ బారిన పడ్డవారు తమకు ఇలా జరిగిందని ఓపెన్ గా చెప్పుకునే పరిస్థితులు కూడా అకాడమీలో లేవు. ఈ పరిస్థితుల్లో అకాడమీలో ట్రైనింగ్ కోసం వచ్చిన వారు మధ్యలోనే వదిలేసి వెళ్లడం కూడా మొదలైంది. ఏడాదికి 16 నుంచి 20 శాతం డ్రాప్ అవుట్స్ ఉన్నట్లు  లెక్కలు తేల్చి  చెప్పాయి. రెండేళ్ల కిందట సీనియర్లు చేసిన ర్యాగింగ్ ను తట్టుకోలేక ఒక జూనియర్ సూసైడ్ చేసుకున్న సంఘటన వెలుగు చూసింది.

అధికారులను ఎలా సెలెక్ట్ చేస్తారు?

అకాడమీలో పనిచేసే అధికారులను సైనికదళాల నుంచే ఎంపిక చేస్తారు. ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్ తో పాటు ఇతర విభాగాలకు చెందిన అందరు అధికారులనూ సైన్యం నుంచే తీసుకుంటారు.అకాడమీ వ్యవహారాలు చూసే కీలకపోస్టును కమాండెంట్  అంటారు. సహజంగా లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేసి రిటైర్ అయిన వారిని ఇలా కమాండెంట్ గా అపాయింట్ చేస్తారు. కొన్నిసార్లు రిటైర్మెంట్ కు దగ్గరపడ్డవారిని కూడా సెలెక్ట్ చేస్తారు. ఈ  సెలక్షన్ విధానం పై  కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆప్టిట్యూడ్ సహా అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత ‘ బెస్ట్ ’ అనుకున్న వారినే  కమాండెంట్ గా  ఎంపిక చేయాలంటున్నారు డిఫెన్స్  ఎక్స్ పర్ట్స్ . రిటైరైన లెఫ్టినెంట్ జనరల్ ను కాకుండా కింది స్థాయి సిబ్బందికి రోల్ మోడల్ గా పనికొచ్చే ఒక జూనియర్ ఆఫీసర్ ను అయినా కమాండెంట్ గా ఎంపిక చేయాలన్న వాదన వినపడుతోంది. కమాండెంట్ ఎంపిక ఇష్యూ ఒక్కటే కాదు. అకాడమీలో ఫాకల్టీ సెలక్షన్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. 1950ల్లో దేశంలోనే బెస్ట్ అకడమీషియన్స్ అనే వారిని అకాడమీలో క్లాసులు చెప్పడానికి పిలిపించేవారు. ఆ తర్వాత ఈ పద్దతికి  గండి పడింది. రూల్స్ ను తమకు అనుకూలంగా మార్చుకుని రిక్రూట్ మెంట్ ద్వారా పోస్టులు భర్తీ చేస్తున్నారన్న విమర్శలొచ్చాయి. రేపటితరం ఆర్మీ ఆఫీసర్లను తయారు చేసే అకాడమీలో జూనియర్లకు ఇన్ స్పిరేషన్ గా నిలిచే సైనిక వ్యవహారాలు తెలిసిన ప్రొఫెసర్లను నియమించాలన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.

సిలబస్ ను మార్చాల్సిందే

అకాడమీ లో స్టూడెంట్లకు చెప్పే సిలబస్ పై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. కాలం చెల్లిన సిలబస్ ఇప్పటికీ చెబుతున్నారన్న విమర్శలున్నాయి. అన్ని దేశాల్లోని  మిలటరీ కాలేజీల్లో ప్రస్తుత యుద్ధ అవసరాలకు తగ్గట్టు సిలబస్ ఉంది. మన దేశంలోనే  ఆ పరిస్థితి లేదంటున్నారు నిపుణులు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత  మన ఆర్మీ అవసరాలకు తగ్గట్టు యుద్దానికి  సంబంధించిన అన్ని అంశాలను స్టూడెంట్లు స్టడీ చేసేలా కొత్త సిలబస్ ను తయారు చేయాలన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.

పనిష్మెంట్ పేరుతో ఇంటికి పంపేయడం

అకాడమీలో కేడట్లు చిన్న తప్పు చేసినా పనిష్మెంట్ పేరుతో ఇంటికి పంపే పద్ధతి కూడా చాలా కాలం ఉంది. అయితే దీనిపై  విమర్శలు రావడంతో ఇలా చిన్న చిన్న విషయాలకు ఏకంగా అకాడమీ నుంచే బహిష్కరించే పద్దతికి 2012 లో పై అధికారులు ఫుల్ స్టాప్ పెట్టారు.

పూర్తిగా సంస్కరించాలి

మారిన పరిస్థితుల నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీని పెద్ద ఎత్తున సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు అడ్మిరల్ (రిటైర్డ్ ) అరుణ్ ప్రకాశ్. కమాండెంట్ ఎంపికను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. రిటైర్మెంట్ కు దగ్గర పడిన వాళ్లకు రెస్ట్ ఇవ్వడానికన్నట్టు  అకాడమీకి  కమాండెంట్ గా పంపుతున్నారని ఆయన చెప్పారు. ఈ పద్దతిని మార్చాలన్నారు. కనీసం మూడేళ్ల పాటు ఇంకా సర్వీస్ ఉన్న అధికారులనే కమాండెంట్ గా  సెలెక్ట్ చేయాలని అరుణ్ ప్రకాశ్ డిమాండ్ చేశారు. అకాడమీలో ఫాకల్టీ పై  అధికారులు దృష్టి పెట్టాలన్నారు. టెక్నికల్, మిలటరీ ఎడ్యుకేషన్ ను సిలబస్ తో  తప్పనిసరిగా చేర్చాల్సిన అవసరం ఉందని మరో సీనియర్ అధికారి, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) దీపేంద్ర సింగ్ హుడా అన్నారు.

ఇక్కడా అవినీతి ఆరోపణలు

అకాడమీపై  అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. 2012లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రూ. 1.86 కోట్ల కుంభకోణం బయటపడింది. సైన్యంలో ఉద్యోగాలిప్పిస్తామని ఏజెంట్ల ద్వారా భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. ఈ స్కాంలో అప్పటి  అకాడమీ కమాండంట్ కు స్టాఫ్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తితో పాటు, ఎన్డీయే రిక్రూట్ మెంట్ బోర్డు ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వీరిద్దరితో పాటు మరో ఆరుగురికి ఈ స్కాంతో సంబంధాలున్నట్లు  పోలీసులు చెప్పారు. ఈ మెగా స్కాం చివరకు సీబీఐ దాకా వెళ్లింది.