ఒకప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం అన్ని జిల్లాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా టైర్ 2 సిటీ వరంగల్ కు మహర్దశ ఉందనే చెప్పాలి. మౌలిక వసతులను సమకూర్చుకోగలిగితే పెట్టుబడులు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సిటీని నలు దిశల్లో డెవలప్ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని క్రెడాయ్ రాష్ట్ర ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో30 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆయన ప్రస్తుతం బిల్డర్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో రియల్ అవకాశాలు, రేరా చట్టం, పాలసీ విధానాలు, ప్రభుత్వ చొరవ వంటి విషయాలను చెప్పుకొచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రియల్ బూమ్ పెరిగిందని, జిల్లా కేంద్రాలకు దగ్గరలో లేఔట్ల ఏర్పాటే దీనికి నిదర్శనమన్నారు. “వెలుగు”తో ఆయన చెప్పిన రియల్ రంగం విశేషాలేంటో ఓసారి చూద్దాం.
లుక్ త్రూ ఔట్ సిటీ పాలసీ తేవాలి
హైదరాబాద్ కు ఐకానిక్ ఐటీ కారిడార్. పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇటు వైపే రావడంతో అభివృద్ధి అంతా ఒక్క చోటే కనిపిస్తోంది. ఇప్పటికే ఐటీ కారిడార్ పై అన్ని విధాలుగా ఒత్తిడి పెరుగుతోంది. కోకాపేట లాంటి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ పెరిగిపోయింది. కోకాపేట న్యూ సిటీతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ కేవలం ఐటీ కారిడార్ కే పరిమితం కాకుండా నలుదిశలా దృష్టిపెట్టేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పాలసీ మేకింగ్ లో మార్పులు తేవాలి. లుక్ ఈస్ట్ పాలసీని లుక్ త్రూ ఔట్ సిటీగా తయారు చేయాలి.
సిటీకి ఓఆర్ఆర్ కామధేనువు
హైదరాబాద్ కు మణిహారంగా దాదాపు 150 కి.మీ. పరిధిలో విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్డు భవిష్యత్తులో కామధేనువు అవుతుందనడంలో ఏ మాత్ర సందేహం లేదు. రింగు రోడ్డుకు ఇరువైపుల ఒక్క కి. మీ. పరిధిలో ప్రస్తుతం గ్రోత్ కారిడార్ ఉండగా మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడింది. దీంతో సిటీలో ఎక్కడ ఉన్నా నిమిషాల వ్యవధిలోనే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకునే వెసులుబాటు ఉంది. ఓఆర్ఆర్ కనెక్టవిటీ పెంచేలా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలి. ఓఆర్ఆర్ వెంబడి గ్రిడ్ రోడ్లు, సర్వీస్ రోడ్లతో కలిపేలా వేసిన ప్లాన్ అమలు చేయాల్సి ఉంది.
రెరా గేమ్ చేంజర్…
రియాల్టీ రంగంలో రెరా అనేది గేమ్ చేంజర్. వినియోగదారులు. రియల్ ఎస్టేట్ రంగానికి ఇది మేలు చేస్తుంది. 500 చదరపు అడుగులకు మించినా లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువగా ఉంటే కచ్చితంగా రెరాలో పేర్లు నమోదు చేసుకోవాలి. చిన్న చిన్న డెవలపర్స్, బిల్డర్స్ భయపడుతున్నట్లుగా ఇందులో ఏమీ లేదు. కార్పొరేట్ తరహా వ్యాపారాలు చేసే పెద్ద కంపెనీలు, బిల్డర్లకు మేలు చేసేలా రెరా ఉందనీ చెప్పే వాదన కూడా పసలేనిదే. ముఖ్యంగా ఫ్లై బై నైట్ రైడర్స్ బెడద చాలా వరకు తగ్గిపోతుంది. వ్యాపారంలో క్రమశిక్షణ, పారదర్శకత పెరుగుతోంది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేందుకు సాయపడుతుంది.