
- పల్స్ యూట్యూబ్ చానల్ ఎండీ, రిపోర్టర్‌కు రిమాండ్
- మరొకరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకర కామెంట్లు ఉన్న వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి, చంచల్‌గూడ జైలుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తరలించారు. కేసు వివరాలను సైబర్ క్రైం డీసీపీ కవితతో కలిసి సిటీ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నానక్‌రాంగూడకు చెందిన పొగడదండ రేవతి కొంతకాలంగా పర్పుల్ క్రౌ మీడియా పేరుతో పల్స్ న్యూస్ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. గత నెల బీఆర్‌ఎస్ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై ఓ వృద్ధుడిని పల్స్ న్యూస్ రిపోర్టర్ బండి సంధ్య ఇంటర్వ్యూ చేశారు.
ఈ సందర్భంగా సీఎం గురించి సదరు వ్యక్తి అనుచితంగా మాట్లాడారు. పబ్లిక్‌లో ఉపయోగించలేని భాష మాట్లాడాడు. అలా మాట్లాడేటట్టు రిపోర్టర్ సంధ్య అతన్ని ప్రేరేపించారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున ఈ ఇంటర్వ్యూను ‘నిప్పు కోడి’పేరుతో ఉన్న ‘ఎక్స్’అకౌంట్‌లో పోస్ట్ చేశారన్నారు. దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ సెక్రటరీ కైలాశ్ ఫిర్యాదు చేయడంతో పల్స్ న్యూస్ ఎండీ రేవతి, రిపోర్టర్ బండి సంధ్యను అరెస్ట్ చేశామని తెలిపారు.
వీరి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు హార్డ్ డిస్క్‌లు, మైక్ లోగో, రూటర్, ఏడు సీపీయూలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 26 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. తర్వాత వారిని చంచల్‌గూడ ఉమెన్స్ జైలుకు తరలించారు. నిప్పు కోడి ట్విట్టర్ అకౌంట్ హోల్డర్ అమెరికాలో ఉన్నారని తాము గుర్తించామని, అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని పోలీసులు తెలిపారు.