
- రాయదుర్గం గేటెడ్ కమ్యూనిటీలో బయటి వ్యక్తుల హల్చల్
- హోలీ వేడుకలకు ఔటర్స్ను అనుమతించిన అసోసియేషన్
- అక్కడే మందు కొట్టి.. అసభ్య ప్రవర్తన
- స్పాట్‌కు చేరుకొని బయటకు వెళ్లగొట్టిన పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ భారీ గేటెడ్కమ్యూనిటీలో బయటి వ్యక్తులు హల్చల్ చేశారు. అసోసియేషన్, కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీలో నిర్వహించిన హోలీ వేడుకలకు బయటివ్యక్తులను అనుమతించడంతో.. కొందరు యువకులు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు వచ్చి అవుటర్స్ను బయటకు పంపించారు. రాయదుర్గంలోని పేరుగాంచిన ఓ గేటెడ్కమ్యూనిటీలో హోలీ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు, కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో స్పాన్సర్ల సహకారంతో గేట్ నంబర్ 3 వద్ద ఉన్న ఓపెన్ ఏరియాలో గ్రాండ్‌గా హోలీ ఈవెంట్ నిర్వహించారు. ప్రతిసారి ప్రతి ఫ్లాట్‌కి కొంత అమౌంట్వసూలు చేసి ఈవెంట్ నిర్వహించేవారు. అయితే, ఈసారి బయటి స్పాన్సర్ సహకారంతో సెలబ్రేషన్స్ నిర్వహించారు. దీనికి దాదాపు 1,500 మంది కమ్యూనిటీ వాసులు వచ్చారు. అయితే, బయటి వ్యక్తులను కూడా లోపలకు అనుమతించడంతో సుమారు 2,300 మంది అదనంగా వచ్చారు.
వీరిలో కొందరు కమ్యూనిటీ పార్కింగ్ ఓపెన్ ఏరియాలో మందు కొట్టారు. మరికొందరు అక్కడే గంజాయి కూడా సేవించారు. అంనతరం కమ్యూనిటీలోని చిన్నపిల్లలు, యువతులు, మహిళలను అభ్యంతరకరంగా తాకుతూ.. ఇష్టం వచ్చినట్టు మీద రంగులు చల్లుతూ ఇబ్బందికరంగా ప్రవర్తించారు. ప్రశ్నించిన కొంతమందిపై చేయి కూడా చేసుకున్నారు. అడ్డు చెప్పిన వారిని బూతులు తిట్టారు. దీంతో కమ్యూనిటీ వాసులు 100కు డయల్చేయడంతో.. రాయదుర్గం పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బయటి వ్యక్తులను గుర్తించి ఈవెంట్ నుంచి బయటకి పంపించారు. అసోసియేషన్ మెంబర్స్డబ్బుల కోసం బయటి నుంచి స్పాన్సర్లను తీసుకువచ్చి ఈవెంట్ నిర్వహించారని, ఎన్నడూ లేని విధంగా బయటి వ్యక్తులను అనుమతించడం వల్లే ఇలా జరిగిందని కమ్యూనిటీ వాసులు మండిపడ్డారు. అయితే, ఈ ఘటనపై తమకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదని రాయదుర్గం ఇన్స్పెక్టర్వెంకన్న తెలిపారు.