- జాబ్ లోంచి తీసేసికేసులు పెట్టి వేధిస్తున్న ఆస్పత్రి
- సూపరింటెండెంట్, ఎస్ఐ సెల్ఫీ వీడియో తీసుకుని,
- సూసైడ్ నోట్ రాసి పెట్టిన మృతుడు
- రంగారెడ్డి జిల్లాఇబ్రహీం పట్నంలో ఘటన
ఎల్బీనగర్,వెలుగు: “ఆస్పత్రి సూపరింటెండెంట్, ఎస్ఐ కలిసి కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. నా కుటుంబసభ్యులను కూడా నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. దీంతో మనస్తాపం చెంది చనిపోతున్నా”.. అంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సెల్ఫీ వీడియో తీసుకుని, నోట్ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఏనుముల జయంత్(26) స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. ఈనెల 2న ఆస్పత్రిలో డయాలసిస్ రూమ్ లోని నీళ్లు రావడం లేదని, వెళ్లి చూడమని జయంత్ కు ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘునాథ్ చెప్పాడు. దీంతో అతడు పోస్టుమార్టం రూం వద్ద ఉన్న బోరు చూడగా పక్కనే శ్మశానవాటికకు వేరొక కనెక్షన్ ఇవ్వటంతో వాటర్ సరిగా రావడం లేదని సూపరింటెండెంట్ కు వాట్సాప్ ద్వారా పంపించి ఫోన్ చేసి చెప్పాడు. అదేవిధంగా అక్కడే శ్మశానవాటికలో ఉన్నవారు తనతో గొడవపడ్డారని కూడా చెబుతుండగా.. తను చెప్పేది పట్టించుకోకుండా మందు తాగి ఆస్పత్రికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నావని, రేపటి నుంచి డ్యూటికి రావద్దని ఇబ్రహీంపట్నం పీఎస్ లో ఆస్పత్రి సూపరింటెండెంట్ కేసు పెట్టాడు. దీంతో ఎలాంటి కారణం లేకుండా జాబ్ లోంచి ఎందుకు తీసివేశారని నిలదీసిన తనపై పోలీసులకు ఫోన్ చేసి మరింత ఒత్తిడి తెచ్చి గత ఆదివారం మరో కేసు పెట్టించాడని మృతుడు తన బంధువులతో చెప్పినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన జయంత్ ఇబ్రహీంపట్నం బైపాస్ రోడ్డు లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘునాథ్,ఎస్ఐ మైబెల్లి వేధింపులతోనే చనిపోతున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకోవడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తన చావుకు కారణమైన ఇద్దరిని కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. తన కొడుకు చావుకు ఆస్పత్రి సూపరింటెండెంట్, ఎస్ ఐ వేధింపులే కారణమని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి తెలిపారు. ఎస్ఐని డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తున్నట్లు తెలిపారు.