
నాగర్ కర్నూల్ టౌన్/ మహబూబ్నగర్కలెక్టరేట్, వెలుగు : ప్రజావాణికి జిల్లా అధికారులు కాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు హాజరు కావడంపై కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని ‘ప్రజావాణి’ హాల్లో ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. ‘ప్రజావాణి’ పని పాట లేకుండా నిర్వహిస్తున్నామా’..? అని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని 20 మండలాల్లో ప్రజావాణికి హాజరయ్యే జిల్లా అధికారులు మినహా మిగతా శాఖల జిల్లా అధికారులు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అడిషనల్కలెక్టర్ మోతీలాల్, సీపీవో భూపాల్ రెడ్డి, డీఆర్డీఏ నర్సింగరావు పాల్గొన్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు 20 సెంటర్లు
నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రూపు -–1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌కోసం 20 సెంటర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎగ్జామ్నిర్వహణపై చీఫ్‌సూపరింటెండెంట్, లైజనింగ్ ఆఫీసర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ జిల్లాలో 5,134 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ ఎగ్జామ్స్‌ను దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికార యంత్రాంగం ఎగ్జామ్సెంటర్ల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. అడిషనల్కలెక్టర్ మనూ చౌదరి, మోతీలాల్, అడిషనల్ఎస్పీ భరత్, డీఎస్పీ మోహన్ కుమార్, డీఈవో గోవిందరాజులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌లో..
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం మహబూబ్నగర్కలెక్టర్ ఎస్.వెంకట్ రావు రెవెన్యూ మీటింగ్హాల్ముందు క్యూ కట్టిన ఫిర్యాదుదారుల వద్దకు నేరుగా వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. అక్కడికే సంబంధిత ఆఫీసర్లను పిలిపించుకుని సమస్యలను పరిష్కరించారు. అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, జడ్పీ సీఈవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్‌లో..
ప్రజావాణి హాల్లో అడిషనల్కలెక్టర్లు కె. చంద్రా రెడ్డి, పద్మజా రాణి తో కలిసి ప్రజల నుంచి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కారం చేయలేని అంశాలు ఉంటే ఫిర్యాదుదారులకు అక్కడే అవగాహన కల్పించాలన్నారు.
పీయూ పరిధిలో ఐదు క్లస్టర్ డిగ్రీ కాలేజీలు
మహబూబ్‌నగర్, వెలుగు : పాలమూరు యూనివర్సిటీ (పీయూ) పరిధిలో ఐదు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నత విద్యా శాఖ కమిషనర్నవీన్మిట్టల్ సోమవారంఉత్తర్వులు జారీ చేశారు. క్లస్టర్ల పరిధిలో గద్వాల గవర్నమెంట్డిగ్రీ కాలేజ్, మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్(డబ్ల్యూ), జడ్చర్ల, వనపర్తి ఉన్నాయి. వీటి పరిధిలో శాంతినగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, కొడంగల్, కొల్లాపూర్, కల్వకుర్తి, నారాయణపేట, కొండనాగుల, షాద్‌నగర్, పాలెం, వనపర్తి, ఆత్మకూరు, పెబ్బేరు, అమ్రాబాద్ డిగ్రీ కాలేజీలు పని చేయనున్నాయి.
భూములను జాయింట్ సర్వే చేయాలి
లింగాల, వెలుగు : మండలంలోని రాయవరం గ్రామ రెవెన్యూ, ఫారెస్ట్భూములను అధికారులు జాయింట్సర్వే చేసి న్యాయం చేయాలని సోమవారం గ్రామస్తులు ఫారెస్ట్ఆఫీసర్లు, పోడుభూముల కమిటీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దశాబ్ధాలుగా పోరంబోకు భూములను సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గిరిజనులకు పోడు భూములు ఇవ్వడంలో ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ జాయింట్సర్వే నిర్వహించి పంపిణీ చేయాలని కోరారు. 138 గ్రామస్తుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని పోడు భూముల కమిటీ కి అందజేశారు. ఎంపీటీసీ మోహన్ రెడ్డి, సేవ్య నాయక్, మల్లయ్య, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.
దళిత రైతులకు పట్టాదారు పాస్‌బుక్స్ ఇవ్వాలి
ధన్వాడ, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన భూములకు పట్టాదారు పాస్బుక్స్ఇవ్వాలని సోమవారం కిష్టాపూర్నుంచి ధన్వాడ వరకు దళిత రైతులు పాదయాత్ర చేపట్టారు. ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ఆఫీస్ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలప్ప మాట్లాడుతూ 2015లో 50 మంది రైతులకు ఒక్కొక్కరికీ 3 ఎకరాల చొప్పున ప్రభుత్వం 150 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. సదరు భూమిలో రైతులు 8 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్నా.. పాస్బుక్స్లేక ప్రభుత్వ పథకాలు, లోన్లు వస్తలేవన్నారు. ప్రభుత్వం వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్‌చేశారు. అనంతరం తహసీల్దార్నాగేంద్రప్రసాద్కు వినతి పత్రం ఇచ్చారు. ఎల్క బాల్‌రాజ్, బాలప్ప, కతలయ్య, పట్నం తిరుపతయ్య పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలి
నారాయణపేట, వెలుగు: ప్రభుత్వాలు నిత్యావసరాల సరుకుల ధరలను అడ్డగోలుగా పెంచి సామాన్య ప్రజలపైన భారం మోపుతున్నాయని, వెంటనే తగ్గించాలని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూప డిమాండ్‌చేశారు. గత రెండు రోజులుగా జిల్లా కేంద్రంలో జరిగిన పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు స్వరూప మాట్లాడుతూ.. కేంద్రం గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ఒక్క కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు మాత్రమే ఇవ్వాలని పరిమితి విధించాలన్న ఆలోచన సరి కాదన్నారు. ఆ ఆలోచనను వెంటనే మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వాల ప్రజా
వ్యతిరేక విధానాలపై ఈ నెల 15 నుచి 20 వరకు రాష్ట్ర మంతా నల్ల బ్యాడ్జీలు ధరించి సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరోమణి, లీడర్లు కె.రమ, అరుణ, సౌజన్య, లక్ష్మి తదితరులు ఉన్నారు.
‘భారత్ మాల’ బాధితులకు న్యాయం చేయాలి
నారాయణపేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వం జిల్లాలో చేపట్టిన ‘భారత్ మాల’ రోడ్డు వైడెనింగ్‌లో భూములు కోల్పోయిన రైతులకు బహిరంగ మార్కెట్‌విలువ ప్రకారం పరిహారం చెల్లించి న్యాయం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్కు వద్ద చేపట్టిన భారత్ మాల బాధితుల ధర్నాలో ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం
ఎకరాకు రూ. 5 లక్షలు ఇస్తామనడం సరికాదన్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరానికి రూ. 80 లక్షల నుంచి రూ. 1కోటి 20 లక్షలు ధర ఉందన్నారు. ధర్నా తర్వాత రైతులు కలెక్టరేట్ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా రైతులు వినకపోవడంతో భూసేకరణ అధికారిని ధర్నా శిబిరం వద్దకు పిలిపించి మాట్లాడారు. భూ సంరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ జి.వెంకటరామిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, ఆంజనేయులు, గోవిందరాజ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్లే ముగ్గురు చనిపోయారు..
వనపర్తి, వెలుగు: ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్లే వనపర్తి జిల్లా మదనాపురం మండలం లోని సరళాసాగర్ వాగు వంతెన దాటుతూ ముగ్గురు చనిపోయారని మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆరోపించారు. సోమవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన తన అనుచరులతో కలిసి స్వయంగా గుంతలు పూడ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని విమర్శించారు. జిల్లా ఆర్అండ్బీ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రమాదాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
వీఆర్ఏల డిమాండ్లు నెరవేర్చాల్సిందే..
నెట్వర్క్, వెలుగు: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని, పేస్కేల్అమలు చేసేదాకా సమ్మెను విరమించబోమని వీఆర్ఏలు తేల్చి చెప్పారు. వీఆర్ఏల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం తహసీల్దార్ఆఫీసులను ముట్టడించారు. ఆఫీసుల తలుపులు మూసేసి నిరసన తెలిపారు.
అనంతరం ఆఫీసుల ఎదుట ధర్నా చేసి తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 3 నెలలుగా జీతాలు లేక దుర్భర జీవితాలు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా మండలాల్లో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌చేసి సాయంత్రం విడిచిపెట్టారు.
అక్రమ సంబంధం వల్లే హత్య : సీఐ చంద్రశేఖర్
గద్వాల, వెలుగు: మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలో ఈ నెల ఏడో తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం సీఐ చంద్రశేఖర్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అమరవాయికి చెందిన బోయ నడిపి నల్లన్న ఇద్దరు బామ్మర్దులు కావలి కిష్టన్న, రాజు. అయితే కిష్టన్న భార్యతో నల్లన్న అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మరో బామ్మర్ది కావలి రాజు కు నల్లన్న చిన్న కూతురుని ఇచ్చి పెళ్లి చేశారు. పెద్ద బామ్మర్ధి భార్యతో అక్రమ సంబంధం, కూతురును సంసారానికి పంపకపోవడంతో ఇద్దరు బామ్మర్దులు నల్లన్నపై కక్ష పెంచుకున్నారు. ఇదే అదునుగా పశువుల కొట్టంలో పడుకున్న నల్లన్నను గొడ్డలితో నరికి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు వారిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. మొబైల్కాల్డేటా ఆధారంగా హంతకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.
పులికల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలి
అయిజ, వెలుగు: అయిజ – పులికల్ మీదుగా నాగలదిన్నె వరకు పునర్ నిర్మిస్తున్న రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి అదే రోడ్డుపై వంటావార్పు నిర్వహించి, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు పునర్ నిర్మాణ పనులు ఆరేండ్ల కింద చేపట్టినప్పటికీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. పది గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ నిత్యం నరకం అనుభవిస్తున్నారన్నారు. రాస్తారోకోతో ట్రాఫిక్జామ్కావడంతో పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పి పంపించారు. బీజేపీ లీడర్లు తిరుమల్ రెడ్డి, అశోక్, శేఖర్, నరసింహయ్యశెట్టి, వెంకటేశ్ యాదవ్ పాల్గొన్నారు.
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
నారాయణపేట, వెలుగు: స్టూడెంట్లు చెడు అలవాట్లు చేసుకోవద్దని, బాల్యంలో వేసే తప్పటడుగు వల్ల జీవితం అంధకారమవుతోందని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ఉమర్ సూచించారు. సోమవారం నారాయణపేట గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండ్లో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. హాజరైన జడ్జి ఉమర్ మాట్లాడుతూ మార్కులు తక్కువ వచ్చాయని క్షణికావేశంలో అఘాయిత్యాలు చేసుకోవద్దని, మార్కుల కంటే జీవితం ఎంతో గొప్పదని సూచించారు. స్టూడెంట్లకు పోక్సో చట్టం గురించి వివరించారు. డీపీఆర్వో పి. సీతారాం, హైస్కూల్ ఇన్చార్జి హెడ్మాస్టర్యూనిస్ టీచర్లు పాల్గొన్నారు.
ఉమామహేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
అచ్చంపేట, వెలుగు: శ్రీశైల ఉత్తర ద్వార ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వర ఆలయ హుండీ లెక్కింపు సోమవారం నిర్వహించారు. ఫిబ్రవరి 18 నుంచి నేటి వరకు హుండీని లెక్కించగా రూ.12 లక్షల 31 వేల 120 రూపాయలు వచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్వెంకటేశ్వరమ్మ, ఆలయ చైర్మన్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
‘పీఎం 15 సూత్రాలు’ పక్కాగా అమలు చేయాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మైనారిటీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘ పీఎం15 సూత్రాలు’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని అడిషనల్ కలెక్టర్ సీతారామారావు జిల్లా స్థాయి కమిటీ సభ్యులను కోరారు. సోమవారం కలెక్టర్ ఆఫీసులో ఆయన విద్య, ఉపాధి, స్కిల్ డెవలప్ మెంట్, పింఛన్లు వివిధ అంశాలపై ఆఫీసర్లు, కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వక్ఫ్‌ఆస్తులను పరిరక్షించి, బహిరంగంగా ఉండే ఆస్తులకు కంచె ఏర్పాటు చేయాలన్నారు. కమిటీ సభ్యులు అన్వర్ బాష, శామ్యూల్ విక్టర్, సయ్యద్ సుల్తాన్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్అన్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు.