![వేతనాలు రాక చిరు ఉద్యోగుల చింత](https://static.v6velugu.com/uploads/2025/02/outsourcing-medical-staff-in-asifabad-face-salary-crisis-threaten-strike_ldPxY0OcqK.jpg)
- నాలుగు నెలలుగా జీతాలు పెండింగ్
- ఇబ్బందులు పడుతున్నఔట్ సోర్సింగ్ వైద్య సిబ్బంది
- 17 నుంచి సమ్మెలోకి వెళ్తామని వెల్లడి
ఆసిఫాబాద్, వెలుగు : వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు నెలలుగా వేతనాలు అందక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో పని చేసే ఆయాలు, సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్ వర్కర్లు, పేషెంట్ కేర్ వర్కర్లతోపాటు తదితర ఉద్యోగులు ఏజెన్సీల ద్వారా నామమాత్రపు జీతాలతో కాలం వెల్లదీస్తున్నారు. వచ్చేదే కొద్దిపాటి జీతం.. అది రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఏజెన్సీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత్యంతరం లేని స్థితిలో సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని వారు పేర్కొంటున్నారు. జిల్లాలోని వాంకిడి, కెరమెరి, జైనూర్ , తిర్యాణి , కాగజ్ నగర్ , సిర్పూర్ టీ దవాఖానలతోపాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో దాదాపు 100 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులు పని చేస్తున్నారు. తాము ఒక్కరోజు పనిమానేస్తే దవాఖానలు పారిశుధ్య లోపంతో కంపుకొట్టే పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు.
వేతనాలు చెల్లించాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఇప్పటికే సమ్మె నోటీసులను సైతం అందజేశామని, దవాఖాన సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని వైద్య సిబ్బంది వాపోతున్నారు. తమ వేతనాల విషయాన్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ దృష్టికి తీసుకుళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఈనెల 17 లోపు తమ వేతనాలను చెల్లించాలని, లేనిచో సమ్మె కు దిగుతామని వారు స్పష్టం చేశారు.
17లోపు వేతనాలు చెల్లించకుంటే సమ్మె
ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలను ఈనెల 17 లోపు చెల్లించాలి. లేనిచో సమ్మె చేస్తం. అధికారులు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లకు పలుమార్లు విన్నవించినా ఫలితం దక్కలేదు. – ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్