
- టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి వినతి
హైదరాబాద్, వెలుగు: ఔట్ సోర్సింగ్పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్నవారందరినీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తించి రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ పంచాయతీ సెక్రటర్సీ అసోసియేషన్ (టీపీఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కోరారు. ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో శుక్రవారం డైరెక్టర్ సృజనకు టీపీఎస్ఏ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
అనంతరం డైరెక్టర్ తో కలిసి డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను 1, 2, 3, 4 గ్రేడ్లుగా పునర్ వ్యవస్థీకరణ చేసి, గ్రేడ్ల వారీగా కేడర్ స్ట్రెంత్ పెంచాలని, జోన్ల వారీగా కేడర్ కేటాయించాలన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక తేదీ నుంచి సర్వీస్ లెక్కిస్తూ రెగ్యులరైజేషన్ కాలాన్ని నాలుగేండ్ల నుంచి రెండేళ్లకు తగ్గించాలన్నారు. ప్రొహిబిషన్ డిక్లేర్ చేస్తూ సర్వీసు కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.