ఔట్​సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలకు జీతాల్లేవు

 

  • రెండు, మూడు నెలల వేతనాలు పెండింగ్
  • ఒక్కో జిల్లాలో ఒక్కో తీరుగా సాలరీలు
  • జేపీఎస్ లతో సమానంగా పనిచేసినా వివక్షే 

కరీంనగర్, వెలుగు : గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలకు (ఓపీఎస్ లు) నెలనెలా జీతాలు పడడం లేదు. ఎప్పుడూ రెండు, మూడు నెలల జీతం పెండింగ్ లో ఉంటున్నది. సకాలంలో బడ్జెట్ విడుదల కాకపోవడం, విడుదలైనా డీపీఓలు వారి అకౌంట్లలో జమచేయకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతున్నదని ఓపీఎస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చేదే అరకొర వేతనమని, అందులోనూ వరుసగా మూడు, నాలుగు నెలల సాలరీ రాకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు వాపోతున్నారు. కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న ఓపీఎస్ లకు మూడు నెలల జీతం పెండింగ్ లో ఉండగా.. ఇతర జిల్లాల్లో పనిచేసే వారికి నాలుగైదు నెలల జీతం పెండింగ్ లో ఉంది. జూనియర్ పంచాయతీ సెక్రటరీలతో సమానంగా తాము పనిచేస్తున్నప్పటికీ ఔట్ సోర్సింగ్  అన్న కారణంగా చిన్నచూపు చూస్తున్నారని, అధికారులు కూడా వేధింపులకు గురిచేస్తున్నారని ఓపీఎస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 పంచాయతీ సెక్రటరీ పోస్టులను జూనియర్  పంచాయతీ సెక్రటరీల పేరిట 2019లో భర్తీచేశారు. అయితే, ఉద్యోగంలో పనిఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక కొందరు, వేరే ఉద్యోగాలు వచ్చి మరికొందరు తమ ఉద్యోగాలకు రిజైన్ చేశారు. ఇలా వెళ్లిపోయిన వారి స్థానంలో సుమారు 1,074 మందిని ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలుగా తీసుకున్నారు. జేపీఎస్ ఎగ్జామ్ రాసిన వారినే ఆర్డర్  ఆఫ్  మెరిట్ లో నియమించారు. కొన్నిచోట్ల కలెక్టర్లే నేరుగా రిక్రూట్  చేయగా.. కొన్ని జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్  చేశారు. ఈ ఓపీఎస్ ల జీతాలు కూడా జిల్లాకో తీరుగా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యధికంగా రూ.15 వేలు చెల్లిస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో రూ.10,500, రూ.12,500 చొప్పున ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు చెల్లిస్తున్నాయి. పీఎఫ్  కోసం కట్  చేస్తున్నట్లు చెప్తున్నా చాలా ఏజెన్సీలు ఏడాదిలో నాలుగైదు నెలల పీఎఫ్ డబ్బులను ఎగ్గొడుతున్నాయనే  ఆరోపణలు ఉన్నాయి. 

ALSO READ :దొంగలు ఉన్నారని నమ్మించి.. చైన్‌‌ తీసుకొని పొట్లంలో రాళ్లు కట్టి ఇచ్చిన్రు

జీవో 60ని అమలు చేయట్లే 

వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం సాలరీ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 2021 జూన్ 11న జీఓ నంబర్ 60  విడుదల చేసింది. దీంతో అన్ని శాఖల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రార్టు ఉద్యోగుల జీతాలు పెరిగినా ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలకు మాత్రం పెంచలేదు. పెరిగిన జీతం ప్రకారం ఓపీఎస్ లకు రూ.19,500 అదే ఏడాది జులై నుంచే చెల్లించాల్సి ఉండగా, జీవో ఇచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు చెల్లించలేదు. గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్లు, మంచినీటి సరఫరా, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణకు హరితహారం, ఇంటి పన్నుల వసూలు, గ్రామసభ తదితర రికార్డుల నిర్వహణ, పల్లె ప్రగతిలాంటి అనేక పనులను జేపీఎస్ లు, సీనియర్ పంచాయతీ సెక్రటరీలతో సమానంగా చేస్తున్నా తమకు కేవలం రూ.10,500 నుంచి రూ.15 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధను అర్థంచేసుకుని జీఓ 60 నంబర్  ప్రకారం జీతాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.