SL vs AUS: ఇలాంటివి స్మిత్‌కే సాధ్యం.. స్లిప్‌లో ఆసీస్ కెప్టెన్ స్టన్నింగ్ క్యాచ్

SL vs AUS:  ఇలాంటివి స్మిత్‌కే సాధ్యం.. స్లిప్‌లో ఆసీస్ కెప్టెన్ స్టన్నింగ్ క్యాచ్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఎంత గ్రేట్ ఫీల్డర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్లిప్స్ లో స్మిత్ అద్భుతంగా క్యాచ్ తీసుకుంటాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో అలాంటి క్యాచ్ ఒకటి నమోదయింది. మూడో రోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 40 ఓవర్ నాలుగో బంతికి మాథ్యూ కుహ్నేమాన్ వేసిన బంతిని శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా  డిఫెన్స్ ఆడాడు. బాల్ బ్యాట్ అంచున తాకి స్లిప్ లోకి వెళ్ళింది. 

స్మిత్ ఈ క్యాచ్ ను వన్ హ్యాండ్ తో డైవ్ చేసి అందుకున్నాడు. రెప్పపాటులో అతను పట్టిన క్యాచ్ వైరల్ అవుతుంది. నాలుగు ఫోర్లు కొట్టి టచ్ లోకి వచ్చిన డిసిల్వా 23 పరుగులకే వెనుదిరగాల్సి వచ్చింది. స్మిత్ కు ఇది టెస్ట్ ఫార్మాట్ లో 198 వ క్యాచ్. అతను మరో 13 క్యాచ్ లు అందుకుంటే ఫీల్డర్ గా టెస్ట్ క్రికెట్ లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న ప్లేయర్ గా నిలుస్తాడు. ఈ లిస్టులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 210 క్యాచ్ లతో అగ్ర స్థానంలో ఉన్నాడు.  

స్మిత్ పట్టిన క్యాచ్ తో శ్రీలంక కష్టాల్లో పడింది. మూడో రోజు చివరి సెషన్ లో ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. క్రీజ్ లో ఏంజెలో మాథ్యూస్(70), కుశాల్ మెండీస్ (31) క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరూ మినహాయిస్తే మిగిలినవారందరూ విఫలమయ్యారు. కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న కరుణరత్నే 14 పరుగులకే ఔట్ అయ్యాడు. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 259 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 414 పరుగులు చేసి 165 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.