- ఒక్కరోజే 26 మందికి సోకిన ఒమిక్రాన్
- పదకొండు రాష్ట్రాలు, యూటీల్లో కేసులు నమోదు
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ స్పీడ్ పెంచింది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 26 మందికి కొత్త వేరియంట్ కన్ఫమ్ అయింది. ఢిల్లీలో కొత్తగా 12 మందికి ఒమిక్రాన్ సోకింది. సిటీలో మొత్తం కేసులు 22కు చేరాయి. మహారాష్ట్రలో కొత్తగా 8 మందికి ఒమిక్రాన్ సోకింది. వీరిలో ఆరుగురు పుణెకు చెందిన వాళ్లు, ఒకరు ముంబై, మరొకరు కల్యాణ్ డోంబివిలీ ఏరియాకు చెందినవారు ఉన్నారు. రాష్ట్రంలో కొత్త వేరియంట్ బాధితుల సంఖ్య 40కి చేరింది. కేరళలో యూఏఈ నుంచి కొచ్చికి వచ్చిన వృద్ధ దంపతులకు ఒమిక్రాన్ సోకింది. దీంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్ బాధితుల సంఖ్య 7కు పెరిగింది. తెలంగాణ, గుజరాత్ లోనూ కొత్తగా 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 113కు చేరిందని కేంద్రం వెల్లడించింది. దేశంలో ఫస్ట్ ఒమిక్రాన్ కేసు ఈ నెల 2న కర్నాటకలో నమోదైంది. ఇప్పటివరకు 11 రాష్ట్రాలు, యూటీల్లో కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 40, ఢిల్లీలో 22, రాజస్తాన్ లో 17, కర్నాటక, తెలంగాణలో 8 చొప్పున, కేరళ, గుజరాత్ లో 7 చొప్పున, తమిళనాడు, బెంగాల్, ఏపీ, చండీగఢ్‌లో 1 చొప్పున ఒమిక్రాన్ కేసులు వచ్చాయి.
86 వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
దేశంలో కొత్తగా 7,447 మందికి కరోనా సోకిందని, మొత్తం కేసుల సంఖ్య 3,47,26,049కి పెరిగిందని శుక్రవారం కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. వైరస్ బారిన పడి మరో 391 మంది చనిపోయారని, మొత్తం మృతుల సంఖ్య 4,76,869కి పెరిగిందని తెలిపింది. అలాగే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 86,415కు తగ్గాయని, మొత్తం కేసుల్లో ఇవి 0.25 శాతమేనని కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.38 శాతంగా నమోదైందని, నిరుడు మార్చి నుంచి ఇదే అత్యధికమని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 136 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్రం తెలిపింది. 82.8 కోట్ల మందికి ఫస్ట్ డోస్, 53.72 కోట్ల మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని వెల్లడించింది.
77 దేశాలకు పాకిన ఒమిక్రాన్
పోయిన నెలలో సౌత్ ఆఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ ఇప్పటివరకు అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, హాంకాంగ్, జపాన్ సహా 77 దేశాలకు వ్యాపించింది. ఇది ఇప్పటికే మరిన్ని దేశాలకు వ్యాపించి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి ఒమిక్రాన్ పెనుముప్పుగా మారిందని శుక్రవారం జీ7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అన్ని దేశాలు మరింత కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చాయి.
రోజూ 14 లక్షల కేసులు రావొచ్చు..
దేశంలో 20 రోజులుగా డైలీ కేసులు 10 వేల లోపే వస్తున్నప్పటికీ, ఒమిక్రాన్ కారణంగా యూరప్, ఇతర ప్రాంతాల్లో ని దేశాల్లో కేసులు భారీగా పెరుగుతు న్నందున మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి న అవసరం ఉందని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ హెచ్చరించింది. ఒమిక్రాన్ చాలా స్పీడ్ గా వ్యాపిస్తోందని, ఒక్క బ్రిటన్‌లోనే 11 వేల కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దేశంలో పరిస్థితిని కంట్రోల్ చేయకపోతే రోజూ 14 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా19 జిల్లాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని తెలిపిం ది. ‘‘ప్రస్తుతం దేశంలో 19 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ 5 నుంచి 10% మధ్యలో, 5 జిల్లాల్లో 10%పైనే ఉంది. పాజిటివిటీ 5% కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టాలి” అని కేంద్రం సూచించింది. ప్రజలంతా మాస్కులు పెట్టుకోవాలని, గుంపులుగా ఉండరాదని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచిం చింది. న్యూఇయర్ వేడుకలను సింపుల్‌గా చేసుకోవాలని కోరింది. కాగా, ఒమిక్రాన్ సోకినోళ్లలో విదేశాల నుంచి వచ్చినోళ్లే ఎక్కువని కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్, నీతి ఆయోగ్ మెంబర్(హెల్త్) డాక్టర్ వీకే పాల్ చెప్పారు.