అనేకమందికి తీవ్ర గాయాలు
కైరో: సూడాన్‌లో ఆర్మీకి, పారామిలిటరీ ఫోర్సెస్ కు మధ్య జరుగుతున్న పోరాటంలో మరో వంద మంది బలైపోయారు. గెజిరా ప్రావిన్స్‌లోని వాద్ అల్-నౌరా గ్రామంపై బుధవారం పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ చేసిన దాడిలో100 మంది మరణించారు. అనేక మంది గాయాలపాలయ్యారు. సూడాన్ ఆర్మీపై ఏడాది కాలంగా దాడులు చేస్తున్న ఆర్ఎస్ఎఫ్.. వాద్ అల్-నౌరా గ్రామంపై దాడికి పాల్పడిందని ఆ ప్రావిన్స్ అధికారులు తెలిపారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారని పేర్కొన్నారు. పారామిలిటరీ దళం గ్రామంపై భారీ ఫిరంగిని ప్రయోగించిందని తెలిపారు.
గ్రామంపై దాడులు చేయడమే కాకుండా పారామిలటరీ దళాలు గ్రామస్తులను దోచుకున్నాయని ఆర్ఎస్ఎఫ్దాడికి గురైన మదానీ ప్రతిఘటన కమిటీ ఆరోపించింది. గ్రామాన్ని పూర్తిగా ఆక్రమించారని.. మహిళలు, పిల్లలతో సహా పలువురిని బందీలుగా తీసుకెళ్లారని తెలిపింది. కాగా, ఈ దాడిని సూడాన్ ఆర్మీ, ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి.