యూపీలో వెయ్యి మంది పాకిస్తానీయులు:ఏరివేత మొదలుపెట్టిన యోగీ

యూపీలో వెయ్యి మంది పాకిస్తానీయులు:ఏరివేత మొదలుపెట్టిన యోగీ

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలు విధించింది. సింధు జలాలను రద్దు చేయడంతోపాటు అన్ని రకాల దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. పాక్ జాతీయులు వీసాలు రద్దు చేసింది. భారత్ లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 29 లోపు పాక్ జాతీయులు ఏ ఒక్కరూ ఇండియాలో కనిపించొద్దని ఆర్డర్స్  పాస్ చేసింది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్  చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పాక్ జాతీయులు వీసాలు రద్దు చేసిన భారత్.. వారిని దేశం నుంచి పంపించే చర్యలు చేపట్టింది.  ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఏమూలన పాకిస్తానీలు ఉన్నా గుర్తించి వారిని ఏప్రిల్ 29లోగా దేశం నుంచి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. 

అమిత్ ఉత్తర్వులతో ఆయా రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పాక్ జాతీయులను గుర్తించే పనిలో పడ్డారు. యూపీలో పెద్ద ఎత్తున పాక్ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు. 

యుపిలో 1,000 మందికి పైగా పాకిస్తానీయులు

యూపీ పోలీసు ఉన్నతాధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,000 నుంచి 1,200 మంది పాకిస్తానీ జాతీయులు నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారిక బహిష్కరణ ఉత్తర్వు ఇంకా అందలేదు. ఆదేశం జారీ అయిన వెంటనే స్వదేశానికి తిరిగి పంపే ప్రక్రియను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసారన్ గడ్డి మైదానంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగా భారత ప్రభుత్వం నిర్దారించింది.తీవ్రవాదాన్ని అంతంచేయడమే లక్ష్యంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేసింది.