న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ బండ్ల క్వాలిటీ, ఆప్టర్ సేల్స్ సర్వీసులపై 10 వేలకు పైగా ఫిర్యాదులు అందుకున్నామని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) పేర్కొంది. వీటిని కంపెనీ ఇంకా పరిష్కరించలేదని తెలిపింది. గత ఏడాది కాలంగా నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్) ఓలా టూవీలర్లపై ఫిర్యాదులను అందుకుంటోంది. కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించడానికి కంపెనీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. ఓలా ఎలక్ట్రిక్‌పై క్లాస్ యాక్షన్‌ను సీసీపీఏ మొదలు పెట్టింది.
వారెంటీ పీరియడ్‌లో ఛార్జింగ్ సమస్యలు, సర్వీసులు వేగంగా అందకపోవడం, సంతృప్తిగా లేకపోవడం, వారెంటీపై సర్వీస్‌లను అందించడానికి ఒప్పుకోకపోవడం, సర్వీస్ పూర్తయినా మళ్లీ సమస్య తలెత్తడం, యాడ్స్‌లో చెప్పినట్టు పెర్ఫార్మెన్స్ లేకపోవడం, ఇన్‌వాయిస్‌లు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలను కస్టమర్లు ఫిర్యాదు చేశారు. అలానే రిఫండ్స్ ఇవ్వడంలో కంపెనీ ఫెయిలైందని తెలిపారు. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినందుకు ఓలా ఎలక్ట్రిక్‌కు సీసీపీఏ షోకాజ్ నోటీసులను జారీ చేసింది.