
1996 వన్డే ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ తొలిసారి ఐసీసీ టోర్నీకి ఆతిధ్యమిస్తుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ ఒక ఐసీసీ టోర్నీని నిర్వహించడం విశేషం. 2009లో ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లో జరాగాల్సి ఉంది. కానీ ఆ సంవత్సరం లాహోర్‌లో పర్యటించిన శ్రీలంక క్రికెట్ జట్టుపై దాడి జరిగింది. ఈ భయంకరమైన ఘటనతో ఛాంపియన్స్ ట్రోఫీని సౌతాఫ్రికాకు తరలించారు. 29 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్ లో ఐసీసీ టోర్నీ జరగనుండడంతో టోర్నమెంట్‌కు ముందు ఆ దేశం అన్ని మ్యాచ్‌లకు భారీ భద్రతను ఏర్పాటు చేస్తుంది.
లాహోర్, రావల్పిండి అంతటా 12,000 మందికి పైగా అధికారులను.. సిబ్బందిని మోహరించారు. వీరిలో 18 మంది సీనియర్ అధికారులు, 54 మంది డిఎస్పీలు, 135 మంది ఇన్స్పెక్టర్లు, 1,200 మంది అప్పర్ సబార్డినేట్లు, 10,556 మంది కానిస్టేబుళ్లు, 200 మందికి పైగా మహిళా పోలీసు అధికారులు ఉన్నారు. ఫిబ్రవరి 22 నుండి మార్చి 5 వరకు లాహోర్ మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది, 8,000 మందికి పైగా అధికారులు.. సిబ్బంది భద్రతా విధులను కేటాయించారు.
వీరిలో 12 మంది సీనియర్ అధికారులు, 39 మంది డిఎస్పీలు, 86 మంది ఇన్స్పెక్టర్లు, 700 మంది అప్పర్ సబార్డినేట్‌లు ఉన్నారు. 6,673 కానిస్టేబుళ్లు, 129 మంది మహిళా కానిస్టేబుళ్లకు విధులు కేటాయించనున్నారు. రావల్పిండి ఫిబ్రవరి 24 నుండి 27 వరకు మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నగరంలో ఆరుగురు సీనియర్ అధికారులు, 15 మంది డిఎస్పీలు, 50 మంది ఇన్స్పెక్టర్లు, 500 మంది అప్పర్ సబార్డినేట్లు, 4,000 మంది కానిస్టేబుళ్లు మరియు 100 మందికి పైగా మహిళా సిబ్బందితో సహా 5000 మందికి పైగా అధికారులు విధుల్లో ఉంటారు.
బుధవారం (ఫిబ్రవరి 19) గ్రాండ్ గా ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. కరాచీలోని నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యం ఇస్తుంది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్–ఎలో బరిలో నిలవగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్ గ్రూప్–బిలో పోటీ పడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్– 2లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.